న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే కొనసాగడానికి సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. ఉద్ధవ్ ఠాక్రేను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోకుండా∙ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. అప్పట్లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వ్యవహరించిన తీరు సమర్థనీయంగా లేనప్పటికీ ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏక్‌నాథ్ షిండేను ఆదేశించలేమని పేర్కొంది.
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభం, తద్వారా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన 8 పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం∙తీర్పు వెలువరించింది. ‘సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదు. ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించి తీరు చట్టబద్ధంగా లేదు. సభలో బల పరీక్ష ఎదుర్కోకుండా ఉద్ధవ్ రాజీనామా చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఉద్ధవ్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ మద్దతున్న షిండేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అది సమర్థనీయమే’ అని వెల్లడించింది.
ఉద్ధవ్ వర్గంపై తిరుగుబాటు చేసి, షిండే పక్షాన చేరిన శివసేన ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత వేటు వేయలేమని తెలియజేసింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్‌కు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసు ఇచ్చే అధికారం ఉందా? అనేది తేల్చడానికి అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే.
షిండే రాజీనామా చేయాలి: ఉద్ధవ్
సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అప్పటి గవర్నర్ తీరును కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. వారు(షిండే వర్గం ఎమ్మెల్యేలు) తమ పారీ్టని, తండ్రి బాల్ ఠాక్రే అందించిన వారసత్వానికి దగా చేశారని మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం చట్టప్రకారం పొరపాటే అయినప్పటికీ నైతిక విలువలను పాటిస్తూ పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. వెన్నుపోటుదారులతో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు.
చదవండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు భారీ ఊరట.. కేంద్రానికి షాక్
Comments
Please login to add a commentAdd a comment