ఉత్కంఠగా ఎదురుచూసిన కోర్టు తీర్పు వచ్చింది. కానీ, న్యాయం మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. శివసేన రెండు ముక్కలై వీధికెక్కిన వివాదంలో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా గురువారం ఇచ్చిన తీర్పు తర్వాత పరిస్థితి అదే. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే వర్గాల మధ్య శివసేనలో అంతర్గత కలహాలు చివరకు ప్రభుత్వ మార్పిడిగా పర్యవసించినప్పుడు మహారాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్‌లు అత్యుత్సాహం చూపిన తీరును కోర్టు తీవ్రంగా తప్పు బట్టింది.
వారు చట్టప్రకారం నడుచుకోలేదని కుండబద్దలు కొట్టింది. కానీ, శివ సేనను వీడి, పార్టీని శిందే రెండు ముక్కలు చేసిన సందర్భంలో సభలో బలపరీక్షకు నిలవకుండానే రాజీనామా సమర్పించిన ఉద్ధవ్ సర్కార్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలివ్వలేమనీ పేర్కొంది. జరిగింది తప్పేనని తీర్పు చెబుతూనే, పాత తప్పును ఇప్పుడు సరిదిద్దలేమని అశక్తత వ్యక్తం చేసింది.
అంటే శిందే సర్కార్ కొనసాగేలా ఇప్పటికి ఊరట నిచ్చింది. అదే సమయంలో ఉద్ధవ్ రాజీనామా చేయకుండా, సభలో బలపరీ క్షకు దిగుంటే... ఆ బలపరీక్షే చట్టవిరుద్ధం గనక ఆయన సర్కారును పునరుద్ధరించే వీలుండేదని కోర్ట్ అభిప్రాయపడింది. అలా అప్పట్లో విప్‌ను ధిక్కరించిన శిందే అనర్హతకు తలుపు తెరిచే ఉంచింది.
పార్టీ అంతర్గత విభేదాల లెక్క తేల్చేందుకు నాటి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ శాసనసభలో బలపరీక్ష పెట్టాలని నిర్ణయించడం శుద్ధ తప్పు అనే మాట లోతైనది.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు రాజకీయ పార్టీల అంతర్గత విభేదాలతో పనేమిటి? ప్రభుత్వం మద్దతు కోల్పోయినట్టు తగిన సాక్ష్యాధారాలేమీ లేకుండానే, స్వయానా గవర్నరే బలపరీక్ష జరపా లని కోరడమంటే... చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని అనివార్యంగా మెజారిటీ కోల్పోయేలా చేసి, కూలి పోయేలా చూడడమే! అంటే, కారణాలేమైనా తన చర్యల ద్వారా ఒక నిర్ణీత ఫలితం వచ్చేలా చేయ డమే! ఉద్ధవ్ సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కార్ రాజీనామాకు ఇదే కారణమైంది.
ఇది గవర్నర్లు చేయాల్సిన పనేనా? ఈ కేసులో వాదనల సందర్భంగా సుప్రీమ్ ప్రస్తావించిన ఈ అంశాలు ఆలోచించాల్సినవి. కావాల్సిన పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్న విషాదానికి ఇవన్నీ మహా చిహ్నాలు.
మరోపక్క శిందే వర్గమే ‘అసలైన’ శివసేన అని గుర్తిస్తూ, దానికే పార్టీ చిహ్నమైన విల్లంబులను ఎన్నికల సంఘం కేటాయించడమూ తొందరపాటే. అలాగే, అసెంబ్లీ స్పీకర్ సైతం శిందే వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించే వరకు ఆ వర్గపు ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులను నానబెట్టడం మరో తప్పు. ఇలా గవర్నర్, స్పీకర్, ఎన్నికల సంఘం సహా అన్ని రాజ్యాంగ సంస్థలూ తప్పుదోవ పట్టిన తీరును సుప్రీమ్ తన తీర్పులో బలంగా ప్రస్తావించడం గమనార్హం.
శివసేన కథలో తదుపరి ఘట్టం మరింత విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న వేళ ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి రాక మానవు. అలాగే, విప్ జారీ అయినా సరే చీలిక ముసుగులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తిప్పలు తప్పవనీ తేలిపోనుంది. వెరసి, తాజా తీర్పు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖయం అనిపిస్తోంది.
గతంలోకెళితే ఈ కథలో ఎన్నో మలుపులు. 2019 అక్టోబర్‌లో బీజేపీ–శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. మరిన్ని మంత్రి పదవులు, రెండున్నరేళ్ళ పాటు సీఎం పీఠం కట్టబెట్టాలని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి ఒప్పందమేదీ లేదని బీజేపీ అడ్డం తిరిగింది. దాంతో గెలిచిన పక్షం రోజులకే కూటమి విచ్ఛిన్నమైంది. కమలనాథుల సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో కొత్త పొత్తులు, ప్రభుత్వాలు– సీఎంల మార్పులు, కాంగ్రెస్– ఎన్సీపీ– శివసేనల ‘ఎంవీఏ’ కూటమి ఆవిర్భావం... ఇలా అనేకం జరిగాయి.
వాటిలో భాగమే 2022 జూన్‌లో ఏకంగా శివసేన వ్యవస్థాపకుడైన బాల్‌ఠాక్రే కుమారుడూ, అప్పటి మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు. గవర్నర్ బలపరీక్ష నిర్ణయంతో ఉద్ధవ్ జూన్ 29న రాజీనామా చేశారు. ఆ మర్నాడే బీజేపీ అండతో శిందే సీఎం కుర్చీ ఎక్కారు. శిందే, ఆయనతో బయటకొచ్చి పార్టీ తమదేనన్న మరో 15 మంది అనర్హత కథ కొన్నాళ్ళుగా కోర్టులో నలుగుతోంది.
తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి శిందే సర్కార్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ కోరుతుంటే, కోర్టు వ్యాఖ్యలెలా ఉన్నా తమను కొనసాగనివ్వడమే ప్రజాస్వామ్య విజయమని శిందే, ఫడ్నవీస్‌లు జబ్బలు చరుస్తున్నారు. విస్తృత ధర్మాసనంలో కథ ఏ కొత్త మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమను కాదని ప్రత్యర్థులతో కూటమి కట్టిన మునుపటి మిత్రపక్షం శివసేనను నిలువునా చీల్చడంలో బీజేపీ ఇప్పటికే సఫలమైంది. సొంతంగా చక్రం తిప్పేందుకు అదను కోసం చూస్తోంది. అది రుచించకున్నా, బీజేపీ దోస్తీ లేకుండా శిందే సేన మనుగడ కష్టం.
మరోపక్క తన వెంట మిగిలిన కొద్దిమందీ చేజారిపోకుండా కాపాడుకోవడం ఉద్ధవ్ ముందున్న సవాలు. ఈ పరిస్థితుల్లో తాజా తీర్పు ఉద్ధవ్‌కు నైతికంగా బలమిచ్చింది. కోర్టు తీర్పుతో కుర్చీ దక్కకున్నా, గవర్నర్ అవాంఛనీయ పాత్రతో ప్రత్యర్థులు అధికారం చేజిక్కించుకున్న తీరును తప్పుబట్టడమే ఊరట.
అనర్హతలపై స్పీకర్ సత్వరమే నిర్ణయించాలనీ కోర్ట్ చెప్పడం గమనార్హం. అందుకే, ముందే అన్నట్టు తీర్పు వచ్చినా, న్యాయం ఇంకా జరగాల్సి ఉంది. కోర్టు లోపల ఒక దశ పోరాటం ముగిసి ఉండవచ్చు. మరోదశ మిగిలివుంది. కోర్టు బయట కూడా ఉద్ధవ్ తదితరుల నైతిక పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుంది. సుప్రీమ్ వ్యాఖ్యలతోనైనా మన రాజ్యాంగ వ్యవస్థలు దిద్దలేని తప్పిదాలకు దూరంగా ఉంటాయా?
సరిదిద్దలేని మహా తప్పిదాలు
Published Fri, May 12 2023 3:05 AM | Last Updated on Fri, May 12 2023 3:05 AM
Comments
Please login to add a commentAdd a comment