ఢిల్లీ: శివసేన కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నైతిక విజయంగా భావిస్తోంది థాక్రేకు చెందిన శివసేన వర్గం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న రాజ్యాంగ ధర్మాసనం.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కిందటి ఏడాది శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితుల్లో.. బలనిరూపణ పరీక్షకు వెళ్లకుండానే ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఇవాళ్టి తీర్పులో ప్రధానంగా ప్రస్తావించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. ఒకవేళ థాక్రే గనుక రాజీనామా చేసి ఉండకపోయి ఉంటే.. ఈ కోర్టు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేదని స్పష్టం చేసింది.
► విప్‌ను నియమించాల్సింది రాజకీయ పార్టీ. అంతేగానీ శాసనసభా పక్షం కాదు. కాబట్టి, ఏక్‌నాథ్ షిండే క్యాంప్ నియమించిన విప్ చెల్లుబాటు కాదు. కాబట్టి, శివసేన విప్‌గా భరత్ గోగావాలేను నియమిస్తూ హౌజ్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు.
► అలాగే.. ఒక పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను, లేదంటే పార్టీల మధ్య నెలకొన్న కలహాలను బలనిరూపణ పరీక్ష పరిష్కరించలేదు.
► ఆ సమయంలో ఉద్దవ్ థాక్రే పార్టీ మెజార్టీ కోల్పోయారనే అధికారిక సమాచారం నాటి గవర్నర్ వద్ద లేదు. అయినా ఆయన బలనిరూపణకు ఆదేశించారు. ఆయనది రాజకీయ జోక్యం.. తొందరపాటు నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు కూడా అని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
► గవర్నర్ విచక్షణాధికారం అమలు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు కానిస్టిట్యూషన్ బెంచ్ అభిప్రాయపడింది.
► అయితే.. బలపరీక్షకు వెళ్లకుండా ఉద్దవ్ థాకక్రే రాజీనామా చేసిన క్రమంలో.. బీజేపీ మద్దతు ద్వారా మెజార్టీ ఉందని ప్రకటించుకున్న షిండే వర్గాన్ని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్ సరైన పనే చేశారని బెంచ్ అభిప్రాయపడింది. అలాగే.. బలనిరూపణకు ముందుకు వెళ్లలేని సీఎంను.. ఇవాళ తన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించమని అడిగే హక్కు కూడా ఉండదు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
► చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మొత్తం 141 పేజీల తీర్పు కాపీని ఈ కేసు కోసం సిద్ధం చేసింది.
► ఈ సందర్భంగా 2018 నాబమ్ రెబియా కేసు(తన తొలగింపును కోరుతూ తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు స్పీకర్ అనర్హత ప్రక్రియను ప్రారంభించలేరని)ను ప్రస్తావించిన బెంచ్.. ఆ కేసులోనూ పలు అంశాలపై నిర్ణయాలు జరగలేదని, కాబట్టి విస్తృత ధర్మాసనానికి అంశాల్ని బదిలీ చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో.. శివసేన కేసులో ఇంకా తుది తీర్పు రాలేదనే భావించాలి.
► ఇక సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయమని పేర్కొన్న ఉద్దవ్ థాక్రే.. ఇప్పుడున్న సీఎం, డిప్యూటీ సీఎంలకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మాదిరే రాజీనామా చేయాలంటూ ఉద్దవ్ థాక్రే పిలుపు ఇచ్చారు.
► మరోవైపు సుప్రీం కోర్టు తమకు అనుకూలంగానే ఉందని షిండే వర్గం ప్రకటించుకుంది. మహారాష్ట్రలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment