ముంబై: శివసేన విషయంలో.. సుప్రీం కోర్టు తమకున్న చివరి ఆశాకిరణమని పేర్కొన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పేర్కొన్నారు. షిండే(ప్రస్తుత ముఖ్యమంత్రి) వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం.. కేటాయించడం తెలిసిందే. ఈ పరిణామంపై ఇవాళ(సోమవారం) సుప్రీం కోర్టును ఆశ్రయించింది థాక్రే వర్గం. ఆపై ఉద్దేవ్ థాక్రే మీడియాతో మాట్లాడారు.
ఒక పార్టీ పేరు, గుర్తు నేరుగా ఒక వర్గానికి కేటాయించిన సందర్భం గతంలో ఏనాడూ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. ములాయం సింగ్ ఏనాడూ కోర్టుకు వెళ్లలేదు. అందుకే సమాజ్‌వాదీ పార్టీ నేరుగా అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లింది. మరి అలాంటప్పుడు ఎన్నిక సంఘం ఎందుకు అంత ఆదరా బాదరాగా పార్టీ పేరును, గుర్తును షిండే వర్గానికి కేటాయించింది. అసలు ఎన్నికల సంఘానికి కేవలం గుర్తుల నియంత్రణ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని గుర్తుచేశారాయన.
అలాగే దేశంలో ఎన్నికల కమిషన్‌ను రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్లను ప్రజలే ఎన్నుకోవాలని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎన్నికల సంఘం వేచి ఉండాల్సిందని థాక్రే పేర్కొన్నారు.
ఇవాళ మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? నా దగ్గర ఏమీ లేకుండా పోయింది. ప్రతీది నా నుంచి దోచుకున్నారు. అయినా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని నేను అడగాలనుకుంటున్నాను. మరో వర్గం మా పార్టీ పేరు, గుర్తు తీసేసుకున్నప్పటికీ.. థాక్రే అనే మా పేరును మాత్రం లాక్కోలేరు. బాలాసాహెబ్ థాక్రే(బాల్ థాక్రే) కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఢిల్లీ సహాయంతో కూడా వాళ్లు దానిని పొందలేరు అని తీవ్ర అసంతృప్తిగా వ్యక్తం చేశారాయన.
ప్రజాస్వామ్యిక సంస్థల సాయంతోనే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని థాక్రే ఆవేశపూరితంగా మాట్లాడారు. ఇవాళ బీజేపీ మనకు ఏదైతే చేసిందో.. ఎవరితోనైనా చేయగలదు. ఇది ఇలాగే కొనసాగితే.. 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు అనేవి కనిపించవు. నేనెప్పుడూ హిందుత్వాన్ని విడిచిపెట్టలేదు, హిందువులెవరైనా ఇప్పుడు మాట్లాడాలి అని పేర్కొన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment