లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకు తన రాజీనామా లేఖను అందజేస్తున్న నారాయణ స్వామి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూప్పకూలింది. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. బలపరీక్ష కోసం సోమవారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు.
ఆధిపత్యపోరు..
పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్– డీఎంకే, బీజేపీ–ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటములు బరిలోకి దిగాయి. 15 సీట్లు గెలుపొందడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. సీఎం నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీ మధ్య అధిపత్య పోరు ఆరంభంలో మొదలైంది.
పతనం దిశగా..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పార్టీ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నెల క్రితం మంత్రి నమశ్శివాయం తన పదవికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన అనుచరుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపాయన్దన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు మంత్రి పదవికి, ఈనెల 15న ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేయడంతో సర్కార్ సంక్షోభంలో పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. అయినా, ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలుపుకుని తమకు 14 మంది సభ్యుల బలం ఉందని సీఎం చెప్పారు. ప్రతిపక్షానికి ఎన్‌ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో 14 సభ్యుల బలం ఉంది. బలపరీక్షకు సిద్దం కావాలని ఎల్జీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సీఎంను ఆదేశించారు. 21న∙కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం స్పీకర్, స్వతంత్య్ర ఎమ్మెల్యేను కలుపుకున్నా 12కే పరిమితమైంది.
గరంగరంగా అసెంబ్లీ సమావేశం
సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అధికార పక్షంలో సీఎం నేతృత్వంలో డీఎంకే, స్వతంత్య్ర ఎమ్మెల్యే , స్పీకర్ వీపీ శివకొళుందు (కాంగ్రెస్) కలుపుకుని 12 మందితో బలనిరూపణకు సిద్దమయ్యారు. ప్రధాన ప్రతిపక్షనేత రంగస్వామిసహా మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బలపరీక్ష తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత ఎల్జీ కిరణ్‌బేడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. తర్వాత సీఎం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోగా అధికార పక్ష సభ్యులు ఆయనతో పాటు వాకౌట్ చేశారు. దాంతో, విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే.. సీఎం ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానం వీగిపోయింది, అసెంబ్లీలో ఆయన బలాన్ని నిరూపించుకోలేక పోయారని స్పీకర్ ప్రకటించారు.
సీఎం నారాయణస్వామి అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు చేరుకుని మంత్రివర్గ రాజీనామా పత్రాన్ని ఎల్జీకి సమర్పించారు. అనంతరం, విశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకపోవడంపై స్పీకర్‌ను నారాయణస్వామి తప్పుబట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆనందరామన్ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారని, అయినా, ఆయన స్పందించలేదని పేర్కొన్నారు. నిబంధనలను స్పీకర్ పాటించలేదని, ఓటింగ్ జరపకుండానే తీర్మానం వీగిపోయిందని ప్రకటించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం అధికార పక్ష సభ్యులు వాకౌట్ చేసినా, స్పీకర్ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని ఎన్‌ఆర్ కాంగ్రెస్ చీఫ్, విపక్ష నేత ఎన్‌రంగస్వామి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లతో కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామినాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రపతికి రాజీనామా లేఖ
సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షం కూడా సిద్ధంగా లేని పరిస్థితి నెలకొనడంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment