CM Narayanaswamy
-
గాంధీ కుటుంబానికి ‘కట్ మనీ’
కారైక్కల్/సాక్షి, చెన్నై: పుదుచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,000 కోట్ల నిధుల నుంచి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి కట్ మనీ పంపించారని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్లే పుదుచ్చేరితోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమయ్యిందని తేల్చిచెప్పారు ఆదివారం పుదుచ్చేరిలోని కారైక్కల్‌లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ప్రతిభావంతులకు చోటు లేదని విమర్శించారు. 2016లో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపించిన నమశ్శివాయంను కాదని, నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలకు నారాయణస్వామి కట్టుబానిస అని ఆక్షేపించారు. కమల వికాసాన్ని అడ్డుకోలేరు పుదుచ్చేరిలో ఈసారి బీజేపీని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలో భారతదేశ ఆభరణంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారాయణస్వామి గాంధీ కుటుంబ సేవలో తరించడం తప్ప ప్రజలకు చేసేందేమీ లేదని తప్పుపట్టారు. పుదుచ్చేరి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గాంధీ కుటుంబానికి చేరవేశారని, ఆఖరికి ఎస్టీ, ఎస్టీల నిధులను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గొప్ప భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. స్పీకర్ శివకొళుందు రాజీనామా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ శివకొళుందు ఆదివారం పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను అందజేశారు. -
పుదుచ్చేరిలో కుప్పకూలిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూప్పకూలింది. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. బలపరీక్ష కోసం సోమవారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. ఆధిపత్యపోరు.. పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్– డీఎంకే, బీజేపీ–ఎన్ఆర్ కాంగ్రెస్ కూటములు బరిలోకి దిగాయి. 15 సీట్లు గెలుపొందడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. సీఎం నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీ మధ్య అధిపత్య పోరు ఆరంభంలో మొదలైంది. పతనం దిశగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పార్టీ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నెల క్రితం మంత్రి నమశ్శివాయం తన పదవికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన అనుచరుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపాయన్దన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు మంత్రి పదవికి, ఈనెల 15న ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేయడంతో సర్కార్ సంక్షోభంలో పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. అయినా, ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలుపుకుని తమకు 14 మంది సభ్యుల బలం ఉందని సీఎం చెప్పారు. ప్రతిపక్షానికి ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో 14 సభ్యుల బలం ఉంది. బలపరీక్షకు సిద్దం కావాలని ఎల్జీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సీఎంను ఆదేశించారు. 21న∙కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం స్పీకర్, స్వతంత్య్ర ఎమ్మెల్యేను కలుపుకున్నా 12కే పరిమితమైంది. గరంగరంగా అసెంబ్లీ సమావేశం సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అధికార పక్షంలో సీఎం నేతృత్వంలో డీఎంకే, స్వతంత్య్ర ఎమ్మెల్యే , స్పీకర్ వీపీ శివకొళుందు (కాంగ్రెస్) కలుపుకుని 12 మందితో బలనిరూపణకు సిద్దమయ్యారు. ప్రధాన ప్రతిపక్షనేత రంగస్వామిసహా మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బలపరీక్ష తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత ఎల్జీ కిరణ్‌బేడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. తర్వాత సీఎం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోగా అధికార పక్ష సభ్యులు ఆయనతో పాటు వాకౌట్ చేశారు. దాంతో, విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే.. సీఎం ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానం వీగిపోయింది, అసెంబ్లీలో ఆయన బలాన్ని నిరూపించుకోలేక పోయారని స్పీకర్ ప్రకటించారు. సీఎం నారాయణస్వామి అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు చేరుకుని మంత్రివర్గ రాజీనామా పత్రాన్ని ఎల్జీకి సమర్పించారు. అనంతరం, విశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకపోవడంపై స్పీకర్‌ను నారాయణస్వామి తప్పుబట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆనందరామన్ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారని, అయినా, ఆయన స్పందించలేదని పేర్కొన్నారు. నిబంధనలను స్పీకర్ పాటించలేదని, ఓటింగ్ జరపకుండానే తీర్మానం వీగిపోయిందని ప్రకటించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం అధికార పక్ష సభ్యులు వాకౌట్ చేసినా, స్పీకర్ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్, విపక్ష నేత ఎన్‌రంగస్వామి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్‌లతో కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామినాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షం కూడా సిద్ధంగా లేని పరిస్థితి నెలకొనడంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. -
ఐసీయూలో ‘నారాయణ’ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో పుదుచ్చేరి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీఎం నారాయణస్వామి సర్కారు పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్లా మారింది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో సోమవారం బల పరీక్ష సాగేనా అనే చర్చ బయలు దేరింది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ‘నారాయణ’ సర్కారు భవిత తేలనుంది. పుదుచ్చేరిలో సాగుతున్న రసవత్తర రాజకీయం గురించి తెలిసిందే. మైనారిటీలో పడ్డ సీఎం నారాయణస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఇన్చార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలతో సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవుతున్న సమయంలో ఆదివారం ఊహించని మలుపులు తప్పలేదు. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్‌డౌన్..మొదలైనట్టుగానే పరిస్థితులు నెలకొన్నాయి. మరో ఇద్దరు రాజీనామా.. 2016 ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడితో అధికార వార్కే అధిక సమయం కేటాయించిన సీఎం నారాయణస్వామి, తాజాగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోకతప్పలేదు. గత ఏడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిరుగుబావుటా ఎగురవేసిన నాటి నుంచి దినదిన గండం అన్నట్టుగా ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి నారాయణస్వామికి తప్పలేదు. 28 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 15 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మె ల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. వరుస రాజీనామాలతో ప్రస్తుతం సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 9కిచేరగా, మిత్రపక్షం డీఎంకే సంఖ్య 2 తగ్గింది. స్వతంత్ర అభ్యర్థి అండగా ఉన్నా, అధికార బలాన్ని నిరూపించుకునేంత సంఖ్య నారాయణ చేతిలో ప్రస్తుతం లేదని చెప్పవచ్చు. నారాయణ మాట్లాడుతూ తాజా పరిమాణాలపై చర్చించామని రేపు నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. బలపరీక్ష సాగేనా?.... ప్రస్తుతం డీఎంకే–కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిని కలుపుకుంటే అధికార పక్షం సభ్యుల సంఖ్య 12గా ఉంది. ప్రతి పక్షాల విషయానికి వస్తే ఎన్ఆర్ కాంగ్రెస్–7, అన్నాడీఎంకే–4, బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటే, అధికార పక్షం కన్నా, ప్రతి పక్ష బలమే ఎక్కువ. ఈ దృష్ట్యా, బల పరీక్ష సాగేనా లేదా తన పదవికి నారాయణ రాజీనామా చేసేనా ప్రశ్న బయలురింది. తాజా పరిణామాల గురించి స్పీకర్ శివకొళుందు మీడియాతో మాట్లాడుతూ మరో ఇద్దరు రాజీనామా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. చట్టనిపుణులతో చర్చించి బలపరీక్షకు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది సోమవారం ఉదయం తేలుతుందన్నారు. వెంకటేషన్ తన పదవికి రాజీనామా చేసినా, తాను డీఎంకేలోనే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం. చదవండి: సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం -
22న బలం నిరూపించుకోండి
సాక్షి ప్రతినిధి, చెన్నై/యానాం: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. ‘విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమం మొత్తం వీడియో రికార్డింగ్ జరగాలి. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగియాలి’అని గవర్నర్ కార్యాలయం ఒక తెలిపింది. అంతకుముందు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి గవర్నర్ బంగ్లా రాజ్‌నివాస్‌లో ఆమె చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీప్ బెనర్జీ పదవీ ప్రమాణం చేయించారు. సీఎం నారాయణస్వామి ఆమెకు పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు. తెలంగాణ, పుదుచ్చేరి అనే కవలపిల్లలను ఎలా చూసుకోవాలో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వలసలు, రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. అయితే ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. -
మంత్రి రాజీనామా.. ప్రమాదంలో ప్రభుత్వం
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి కృష్ణారావు తన శాసన సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. యానాంకు చెందిన ఆయన 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రతిపక్షం ఒక సభ్యుడిని తమ వైపునకు లాగేసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ‘ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు’ చెప్పి గత నెల జనవరి 7వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఆమోదించకపోవడంతో తాజాగా ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. రాజకీయంగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తానని మల్లాడి కృష్ణారావు తెలిపారు. నెల రోజులుగా కృష్ణారావు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు. అధికారికంగా కేటాయించిన కారును వినియోగించడం లేదు. తాజాగా ఆయన రాజీనామాతో సీఎం నారాయణ్‌స్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. పుదుచ్చేరి ప్రభుత్వంలో మొత్తం 33 (నామినేటెడ్‌తో కలిపి) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధనవేలు అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతిపక్షాల బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. ప్రభుత్వ బలం బార్డర్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని ప్రతిపక్షం లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 1996 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. -
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య సమరం..
-
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య సమరం..
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఏ మాత్రం తగ్గడం లేదు. తన మీద పాలకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక, ప్రభుత్వం నుంచి రాజ్ నివాస్‌కు వచ్చే అన్ని రకాల ఫైల్స్, అందులోని వివరాలు, ఆమోద ముద్ర వరకు ప్రజలకు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. అన్ని విషయాల్ని బహిర్గతం చేస్తామంటూ రాజ్‌నివాస్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రకటించడం విశేషం. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వానికి, పథకాలకు వ్యతిరేకంగా కిరణ్ వ్యవహరిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంపించే ఫైల్స్‌ను తుంగలో తొక్కుతున్నారని, అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలన్నీ గవర్నర్ రూపంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొంటూ వస్తున్నారు. ఇది కాస్త ప్రజల్లో ఆగ్రహాన్ని రేపింది. కిరణ్ పర్యటన సాగే ప్రాంతాల్లో ఆందోళనలు, వ్యతిరేకత తప్పడం లేదు. ఆమెను ఘెరావ్ చేయడం, వెనక్కు వెళ్లాలన్న నినాదంతో ప్రజలతో కలిసి పాలకులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాను ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా కిరణ్ దూకుడు పెంచడం గమనార్హం. సీఎం నారాయణస్వామి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టే విధంగా కొత్త ఎత్తుగడ వేశారు. ఇక, అన్నీ బహిర్గతం: తాను ఫైల్స్‌ను పక్కన పెడుతున్నట్టు, పథకాలకు ఆమోదం ఇవ్వడం లేదని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి నిర్ణయం తీసుకున్నారు. రాజ్ నివాస్‌కు వచ్చే అన్ని ఫైల్స్, ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయనున్నట్టు ప్రకటించారు. తమ ఆమోదానికి తగ్గ అన్ని వివరాలను రాజ్ నివాస్ వెబ్సైట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. ఆ మేరకు ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాజ్ నివాస్‌కు వచ్చిన ఫైల్స్, తాము వేసిన ఆమోద ముద్ర వివరాలను ప్రకటించారు. ఇందులో ఉచిత బియ్యం పంపిణీకి రూ.1931 కోట్ల కేటాయింపునకు తగ్గ ఫైల్, ఠాకూర్ కళాశాల పేరు మార్పు, ఆరోగ్యశాఖలో వైద్యుల పోస్టుల భర్తీ, ఆయా సంస్థలకు ట్రస్టీల నియామకం, నామినేటెడ్ పోస్టులు వంటి అంశాలతో కూడిన ఫైల్స్ ఉన్నాయి. ఇక, మీద ప్రతి బుధ, శనివారాల్లో రాజ్ నివాస్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫైల్స్, వాటి స్థితి, ఆమోదం వరకు అన్ని వివరాలను తెలియజేస్తామని కిరణ్ పేర్కొనడం గమనార్హం. తాజాగా, తమను ఢీకొట్టే విధంగా కిరణ్ అడుగుల వేగాన్ని పెంచడం పాలకులకు మింగుడు పడడం లేదని చెప్పవచ్చు. -
కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!
-
కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!
పుదుచ్చేరి: అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంగ్ గవర్నర్ కిరణ్ బేడీకి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం, ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎల్జీ కిరణ్ బేడీ ఓ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌గా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు అంటించడం మరో వివాదానికి దారితీసింది. తవళకుప్పం జంక్షన్లో కిరణ్ బేడీ.. ఓ హిట్లర్ అని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు బేడీని ఏకంగా జర్మనీ నియంత హిట్లర్‌గా చిత్రీకరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల నియామకమైన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై భగ్గుమంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై, కిరణ్ బేడీపై తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే, వాపపక్షాలు, వీసీకేలు మూకుమ్మడిగా బేడీ చర్యలను వ్యతిరేకించడంతో పాటు ఆమెను వెనక్కు పంపాలని, డిస్మిస్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై 8న ఈ పార్టీలు బంద్ ను చేపట్టి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని ఆందోళనకు దిగారు. మరోవైపు బేడీ మాత్రం ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు తప్పు చేసినా బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో గ్రూపులో అవినీతి వివరాలను వెల్లడిస్తుండటం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. తాను రబ్బర్ స్టాంప్‌ను కానని, అన్యాయాన్ని ప్రశ్నించే అధికారంతో పాటు ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ బేడీ అంటున్నారు. -
నేను రబ్బర్ స్టాంప్ కాదు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరిలో తనకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలు సాగిస్తున్న వ్యవహారాలపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి పెదవి విప్పారు. తన ట్విట్టర్లో తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంప్‌ను కాదు అని మండిపడ్డారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రతిపక్షాలు ఏకమై ముందుకు సాగుతున్న విషయం తెలిసిం దే. ఆమెను వెనక్కు పంపించాలన్న నినాదంతో రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ మంత్రిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్ని సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని అఖిలపక్షం వేగవంతం చేసింది. తనకు వ్యతిరేకంగా గత వారం పది రోజులుగా పుదుచ్చేరిలో వ్యవహారాలు సాగుతున్నా, కిరణ్‌బేడి మాత్రం మౌనంగానే పరిశీలిస్తూ వచ్చారు. అయితే, తనను వెనక్కు పంపించాలని, డిస్మిస్ చేయాలన్న నినాదాల్ని అఖిలపక్షం అందుకోవడంతో మౌనాన్ని వీడారు. బుధవారం తన ట్విట్టర్లో ఆమె స్పందించారు. పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే నగర కమిషనర్ జయచంద్రన్కు అనుకూలంగా తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరు వ్యవహరించినా ఉపేక్షించబోనని స్పష్టంచేశారు. మంచి పనులు లక్ష్యంగా, మార్పు ధ్యేయంగా తాను ముందుకు సాగుతుండడం స్వలాభా పరులకు ఆటంకంగా మారిందని చురకలు అంటించారు. అందుకే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, మార్చేయాల్సిందేనని కొందరు, తప్పించాల్సిందేనని మరి కొందరు, వెనక్కు పంపించాల్సిందేని ఇంకొందరు..ఇలా ఎవరికి వారు నినాదాల్ని అందుకున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా తనకు ఉన్న అధికారాల మేరకు ముందుకు సాగుతున్నానని, ప్రజలకు మంచి చేయాలన్న తపన తనలో ఉన్నా, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు సాగడం శోచనీయమన్నారు. స్వలాభా పరులు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంపును కాదు అని మరో ట్వీట్ ప్రకటనలో కిరణ్ స్పందించి ఉండడం గమనార్హం.