నేను రబ్బర్ స్టాంప్ కాదు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరిలో తనకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలు సాగిస్తున్న వ్యవహారాలపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి పెదవి విప్పారు. తన ట్విట్టర్‌లో తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంప్‌ను కాదు అని మండిపడ్డారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రతిపక్షాలు ఏకమై ముందుకు సాగుతున్న విషయం తెలిసిం దే. ఆమెను వెనక్కు పంపించాలన్న నినాదంతో రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ మంత్రిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్ని సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని అఖిలపక్షం వేగవంతం చేసింది. తనకు వ్యతిరేకంగా గత వారం పది రోజులుగా పుదుచ్చేరిలో వ్యవహారాలు సాగుతున్నా, కిరణ్‌బేడి మాత్రం మౌనంగానే పరిశీలిస్తూ వచ్చారు.
అయితే, తనను వెనక్కు పంపించాలని, డిస్మిస్ చేయాలన్న నినాదాల్ని అఖిలపక్షం అందుకోవడంతో మౌనాన్ని వీడారు. బుధవారం తన ట్విట్టర్‌లో ఆమె స్పందించారు. పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే నగర కమిషనర్ జయచంద్రన్‌కు అనుకూలంగా తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరు వ్యవహరించినా ఉపేక్షించబోనని స్పష్టంచేశారు.
మంచి పనులు లక్ష్యంగా, మార్పు ధ్యేయంగా తాను ముందుకు సాగుతుండడం స్వలాభా పరులకు ఆటంకంగా మారిందని చురకలు అంటించారు. అందుకే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, మార్చేయాల్సిందేనని కొందరు, తప్పించాల్సిందేనని మరి కొందరు, వెనక్కు పంపించాల్సిందేని ఇంకొందరు..ఇలా ఎవరికి వారు నినాదాల్ని అందుకున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్‌గా తనకు ఉన్న అధికారాల మేరకు ముందుకు సాగుతున్నానని, ప్రజలకు మంచి చేయాలన్న తపన తనలో ఉన్నా, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు సాగడం శోచనీయమన్నారు. స్వలాభా పరులు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంపును కాదు అని మరో ట్వీట్ ప్రకటనలో కిరణ్ స్పందించి ఉండడం గమనార్హం.