Lt. Governor Kiran Bedi
-
కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!
-
కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!
పుదుచ్చేరి: అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంగ్ గవర్నర్ కిరణ్ బేడీకి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం, ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎల్జీ కిరణ్ బేడీ ఓ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌గా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు అంటించడం మరో వివాదానికి దారితీసింది. తవళకుప్పం జంక్షన్లో కిరణ్ బేడీ.. ఓ హిట్లర్ అని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు బేడీని ఏకంగా జర్మనీ నియంత హిట్లర్‌గా చిత్రీకరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల నియామకమైన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై భగ్గుమంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై, కిరణ్ బేడీపై తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే, వాపపక్షాలు, వీసీకేలు మూకుమ్మడిగా బేడీ చర్యలను వ్యతిరేకించడంతో పాటు ఆమెను వెనక్కు పంపాలని, డిస్మిస్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై 8న ఈ పార్టీలు బంద్ ను చేపట్టి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని ఆందోళనకు దిగారు. మరోవైపు బేడీ మాత్రం ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు తప్పు చేసినా బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో గ్రూపులో అవినీతి వివరాలను వెల్లడిస్తుండటం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. తాను రబ్బర్ స్టాంప్‌ను కానని, అన్యాయాన్ని ప్రశ్నించే అధికారంతో పాటు ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ బేడీ అంటున్నారు. -
నేను రబ్బర్ స్టాంప్ కాదు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరిలో తనకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలు సాగిస్తున్న వ్యవహారాలపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి పెదవి విప్పారు. తన ట్విట్టర్లో తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంప్‌ను కాదు అని మండిపడ్డారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రతిపక్షాలు ఏకమై ముందుకు సాగుతున్న విషయం తెలిసిం దే. ఆమెను వెనక్కు పంపించాలన్న నినాదంతో రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ మంత్రిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్ని సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని అఖిలపక్షం వేగవంతం చేసింది. తనకు వ్యతిరేకంగా గత వారం పది రోజులుగా పుదుచ్చేరిలో వ్యవహారాలు సాగుతున్నా, కిరణ్‌బేడి మాత్రం మౌనంగానే పరిశీలిస్తూ వచ్చారు. అయితే, తనను వెనక్కు పంపించాలని, డిస్మిస్ చేయాలన్న నినాదాల్ని అఖిలపక్షం అందుకోవడంతో మౌనాన్ని వీడారు. బుధవారం తన ట్విట్టర్లో ఆమె స్పందించారు. పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే నగర కమిషనర్ జయచంద్రన్కు అనుకూలంగా తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరు వ్యవహరించినా ఉపేక్షించబోనని స్పష్టంచేశారు. మంచి పనులు లక్ష్యంగా, మార్పు ధ్యేయంగా తాను ముందుకు సాగుతుండడం స్వలాభా పరులకు ఆటంకంగా మారిందని చురకలు అంటించారు. అందుకే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, మార్చేయాల్సిందేనని కొందరు, తప్పించాల్సిందేనని మరి కొందరు, వెనక్కు పంపించాల్సిందేని ఇంకొందరు..ఇలా ఎవరికి వారు నినాదాల్ని అందుకున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా తనకు ఉన్న అధికారాల మేరకు ముందుకు సాగుతున్నానని, ప్రజలకు మంచి చేయాలన్న తపన తనలో ఉన్నా, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు సాగడం శోచనీయమన్నారు. స్వలాభా పరులు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంపును కాదు అని మరో ట్వీట్ ప్రకటనలో కిరణ్ స్పందించి ఉండడం గమనార్హం.