సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో పుదుచ్చేరి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీఎం నారాయణస్వామి సర్కారు పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్‌లా మారింది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో సోమవారం బల పరీక్ష సాగేనా అనే చర్చ బయలు దేరింది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ‘నారాయణ’ సర్కారు భవిత తేలనుంది. పుదుచ్చేరిలో సాగుతున్న రసవత్తర రాజకీయం గురించి తెలిసిందే. మైనారిటీలో పడ్డ సీఎం నారాయణస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఇన్‌చార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలతో సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవుతున్న సమయంలో ఆదివారం ఊహించని మలుపులు తప్పలేదు. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్‌డౌన్..మొదలైనట్టుగానే పరిస్థితులు నెలకొన్నాయి.
మరో ఇద్దరు రాజీనామా..
2016 ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడితో అధికార వార్‌కే అధిక సమయం కేటాయించిన సీఎం నారాయణస్వామి, తాజాగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోకతప్పలేదు. గత ఏడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిరుగుబావుటా ఎగురవేసిన నాటి నుంచి దినదిన గండం అన్నట్టుగా ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి నారాయణస్వామికి తప్పలేదు. 28 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 15 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మె ల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో మైనారిటీలో ప్రభుత్వం పడింది.
ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. వరుస రాజీనామాలతో ప్రస్తుతం సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 9కిచేరగా, మిత్రపక్షం డీఎంకే సంఖ్య 2 తగ్గింది. స్వతంత్ర అభ్యర్థి అండగా ఉన్నా, అధికార బలాన్ని నిరూపించుకునేంత సంఖ్య నారాయణ చేతిలో ప్రస్తుతం లేదని చెప్పవచ్చు. నారాయణ మాట్లాడుతూ తాజా పరిమాణాలపై చర్చించామని రేపు నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
బలపరీక్ష సాగేనా?....
ప్రస్తుతం డీఎంకే–కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిని కలుపుకుంటే అధికార పక్షం సభ్యుల సంఖ్య 12గా ఉంది. ప్రతి పక్షాల విషయానికి వస్తే ఎన్‌ఆర్ కాంగ్రెస్–7, అన్నాడీఎంకే–4, బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటే, అధికార పక్షం కన్నా, ప్రతి పక్ష బలమే ఎక్కువ. ఈ దృష్ట్యా, బల పరీక్ష సాగేనా లేదా తన పదవికి నారాయణ రాజీనామా చేసేనా ప్రశ్న బయలురింది. తాజా పరిణామాల గురించి స్పీకర్ శివకొళుందు మీడియాతో మాట్లాడుతూ మరో ఇద్దరు రాజీనామా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. చట్టనిపుణులతో చర్చించి బలపరీక్షకు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది సోమవారం ఉదయం తేలుతుందన్నారు. వెంకటేషన్ తన పదవికి రాజీనామా చేసినా, తాను డీఎంకేలోనే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం.
చదవండి: సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు
కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం
Comments
Please login to add a commentAdd a comment