
కారైక్కల్/సాక్షి, చెన్నై: పుదుచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,000 కోట్ల నిధుల నుంచి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి కట్ మనీ పంపించారని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్లే పుదుచ్చేరితోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమయ్యిందని తేల్చిచెప్పారు ఆదివారం పుదుచ్చేరిలోని కారైక్కల్‌లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ప్రతిభావంతులకు చోటు లేదని విమర్శించారు. 2016లో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపించిన నమశ్శివాయంను కాదని, నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలకు నారాయణస్వామి కట్టుబానిస అని ఆక్షేపించారు.
కమల వికాసాన్ని అడ్డుకోలేరు
పుదుచ్చేరిలో ఈసారి బీజేపీని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలో భారతదేశ ఆభరణంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారాయణస్వామి గాంధీ కుటుంబ సేవలో తరించడం తప్ప ప్రజలకు చేసేందేమీ లేదని తప్పుపట్టారు. పుదుచ్చేరి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గాంధీ కుటుంబానికి చేరవేశారని, ఆఖరికి ఎస్టీ, ఎస్టీల నిధులను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గొప్ప భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.
స్పీకర్ శివకొళుందు రాజీనామా
పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ శివకొళుందు ఆదివారం పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment