rubber stamp
-
నేను రబ్బర్ స్టాంప్ కాదు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరిలో తనకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలు సాగిస్తున్న వ్యవహారాలపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి పెదవి విప్పారు. తన ట్విట్టర్లో తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంప్‌ను కాదు అని మండిపడ్డారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రతిపక్షాలు ఏకమై ముందుకు సాగుతున్న విషయం తెలిసిం దే. ఆమెను వెనక్కు పంపించాలన్న నినాదంతో రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ మంత్రిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్ని సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని అఖిలపక్షం వేగవంతం చేసింది. తనకు వ్యతిరేకంగా గత వారం పది రోజులుగా పుదుచ్చేరిలో వ్యవహారాలు సాగుతున్నా, కిరణ్‌బేడి మాత్రం మౌనంగానే పరిశీలిస్తూ వచ్చారు. అయితే, తనను వెనక్కు పంపించాలని, డిస్మిస్ చేయాలన్న నినాదాల్ని అఖిలపక్షం అందుకోవడంతో మౌనాన్ని వీడారు. బుధవారం తన ట్విట్టర్లో ఆమె స్పందించారు. పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే నగర కమిషనర్ జయచంద్రన్కు అనుకూలంగా తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరు వ్యవహరించినా ఉపేక్షించబోనని స్పష్టంచేశారు. మంచి పనులు లక్ష్యంగా, మార్పు ధ్యేయంగా తాను ముందుకు సాగుతుండడం స్వలాభా పరులకు ఆటంకంగా మారిందని చురకలు అంటించారు. అందుకే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, మార్చేయాల్సిందేనని కొందరు, తప్పించాల్సిందేనని మరి కొందరు, వెనక్కు పంపించాల్సిందేని ఇంకొందరు..ఇలా ఎవరికి వారు నినాదాల్ని అందుకున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా తనకు ఉన్న అధికారాల మేరకు ముందుకు సాగుతున్నానని, ప్రజలకు మంచి చేయాలన్న తపన తనలో ఉన్నా, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు సాగడం శోచనీయమన్నారు. స్వలాభా పరులు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ రబ్బర్ స్టాంపును కాదు అని మరో ట్వీట్ ప్రకటనలో కిరణ్ స్పందించి ఉండడం గమనార్హం. -
రబ్బరుస్టాంపులా ఉండను: కిరణ్ బేడీ
హైదరాబాద్: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడి లెఫ్టినెంట్ జనరల్ కిరణ్ బేడీకి మధ్య పొరపొచ్చాలు ముదురుతున్నాయి. పాలనా బాధ్యతలు చూసుకోవాల్సిన తనను పుదుచ్చేరి ప్రభుత్వం రబ్బరు స్టాంపులా మాత్రమే ఉండమంటోందని మంగళవారమిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బేడీ ఆరోపించారు. ఎల్జీ బాధ్యతలేమిటో తెలుసుకోవాలని వారికి చెప్పానని, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఎల్జీగా తన రెండేళ్ల పదవీకాలం ముగియగానే(వచ్చే ఏడాది మే 29) పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. -
మహిళాశక్తి రబ్బరు స్టాంపు కారాదు..
ఐకాస మహిళ విభాగ ప్రతినిధి సరోజినీ గంజుఠాకూరే బాపట్ల టౌన్: మహిళా ప్రతినిధులు రబ్బరు స్టాంపులుగా మారరాదని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ ప్రతినిధి సరోజిని గంజుఠాకూరే అన్నారు. స్థానిక మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆదివారం మహిళా రాజకీయ ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజని గంజుఠాకూరే మాట్లాడుతూ పురుషులు స్త్రీలకు షాడో ప్రతినిధులుగా వ్యవహరించడం తగదన్నారు. మహిళలే నిర్ణయాత్మక శక్తులుగా ఎదగాలని ఆకాక్షించారు. కార్యాలయాలు, విద్యా సంస్థల వంటి ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల వేధింపులు నిరోధక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ మరో ప్రతినిధి నవనీత సిన్హా మాట్లాడుతూ మహిళల వేధింపులకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ చక్రపాణి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం మాజీ డైరెక్టర్ కృష్ణకుమారి, విజయవాడ వాసవ్య మహిళా మండలి నాయకురాలు రష్మి పాల్గొన్నారు. -
నెల్లూరు మేయర్ కు చెక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ అజీజ్‌కు టీడీపీ లక్ష్మణ రేఖను గీ సింది. కార్పొరేషన్లో మేయర్‌కు విస్తృత అధికారాలు లేకుండా అజీజ్‌ను రబ్బర్‌స్టాంప్‌లా వాడుకోవాలని భావిస్తునట్లు విశ్వసనీ య సమాచారం. అందులో భాగంగానే నెల్లూరుకు చెందిన తమ్ముళ్ల సూచన మేరకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించి కట్టడి చేసినట్లు ప్రచారం జరుగుతోం ది. మేయర్‌గా ఎన్నికైన తొలినాళ్లలో అజీజ్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారం, అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్లు తెస్తానని పదేపదే చెప్పారు. ఈ విషయంలో ఆయనకు ప్రభుత్వం నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిధుల కోసం ఆయన పంపిన నివేదికను సాంకేతిక కారణాలతో సున్నితంగా తోసిపుచ్చినట్లు సమాచారం. తాజాగా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల విషయంలోనూ మేయర్‌కు అవమానం జరిగినట్లు తెలిసింది. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఏకంగా తానే మేయర్‌నని బ్యానర్లు కట్టించుకున్న ఘటన మేయర్ అజీజ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రాజకీయంగా నష్టపోతున్నానని లోలోన మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అటువంటిదేం లేదని అంటున్నాయి. అసహనంతో తప్పుల మీద తప్పులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరిన మేయర్ అజీజ్ ఇటుపార్టీలో, అటు కార్పొరేషన్‌పై పట్టు సాధించలేక కొందరు కార్పొరేటర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులను ఉపయోగించుకుని వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా బుధవారం 54వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆయన అనుచరులపై టీడీపీ నేతలతో దౌర్జన్యానికి దిగారు. రంగనాయకులపేటలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఏకంగా పోలీసులతోనే కార్పొరేటర్లపై అధికార జులుం చూపించారు. ఎటువంటి గొడవలు లేకపోయినా.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను టార్గెట్ చేసుకుని దౌర్జన్యంగా గెంటివేయించారు. పొలీసులు కొందరు కార్పొరేటర్ల చొక్కాలు పట్టుకుని లాగి బయటకు వెళ్లగొట్టారు. దుర్భాషలాడుతూ బయటకు గెంటివేశారు. నాలుగురోజుల క్రితం నగరంలోని ఓ జిమ్ నిర్వాహకుడితో గొడవపడి, తన అధికార బలంతో ఏకంగా ఆ జిమ్‌ను మూయించిన ఘనత నగర ప్రథమ పౌరుడైన మేయర్‌కే దక్కిందని పలువురు చర్చింకుంటున్నారు. తాము అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటినేవీ పట్టించుకోకుండా... మేయర్‌గా తన బాధ్యతలను మరచి గిల్లికజ్జాలకు సమయం కేటాయిస్తున్నట్లు నగరవాసులు విమర్శిస్తున్నారు. ఇకనైనా గిల్లికజ్జాలు మాని సహచర సభ్యులపై దూకుడు ప్రదర్శించటం కంటే.. వారి సహకారంతో నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. -
రబ్బర్ స్టాంపును కాను : గవర్నర్
బెంగళూరు : శాసన, రాజ్యాంగ వ్యవస్థలు నాణేనికి రెండు ముఖాలని, రాజ్ భవన్ ఎప్పటికీ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రం కాకూడదని కొత్త గవర్నర్ వజూభాయ్ రుఢాభాయ్ వాలా అన్నారు. తాను ఈ పదవిలో ఉన్నంత వరకు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతానే తప్ప, ఎవరికో రబ్బర్ స్టాంపులా వ్యవహరించబోనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్తుడైనప్పటికీ, ఇప్పుడు గవర్నర్ కనుక రాజ్యాంగ ఆశయాలను కాపాడాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్ భవన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా, ప్రజల కోసం ఉన్న కార్యాలయంలా తీర్చి దిద్దుతానని చెప్పారు. ఒక రాష్ట్రం సంక్షేమ ప్రాంతం కావాలంటే ఒకరి నుంచే సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరూ సహకారం అందించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి సూచనలివ్వడంతో పాటు మార్గదర్శనం చేయడం గవర్నర్ కర్తవ్యమన్నారు. ప్రధానికి ఆప్తుడైనందునే తనను గవర్నర్‌గా నియమించారనడం సరికాదని అన్నారు. గుజరాత్లో ఆర్థిక శాఖ మంత్రిగా 18 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని వెల్లడించారు. కనుక ప్రజా సమస్యలేమిటో తనకు బాగా తెలుసునని చెప్పారు. సంక్షేమ రాష్ట్రం కావాలంటే నిర్ణీత వ్యవధిలో ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ప్రతి శాసన సభ్యుడు, మంత్రి భుజం భుజం కలిపినందున అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు. కర్ణాటకలోనూ అపార సహజ వనరులున్నాయని, ప్రభుత్వం కోరితే సలహాలు ఇస్తానని తెలిపారు. గత గవర్నర్ ఏం చేశారో, రాబోయే గవర్నర్ ఏం చేస్తారో...తనకు అవసరమని, కర్ణాటకలో తాను ఉన్నంత వరకు ప్రజల పక్షాన పని చేస్తానని వివరించారు. రాజ్ భవన్ అంటే కేవలం పుస్తక పఠనానికి, విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. గవర్నర్ ఎవరికో రబ్బర్ స్టాంపులా పని చేయరాదని చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అన్ని రకాల సహకారాలు అందిస్తానని తెలిపారు. చెడు దారిలో వెళుతుంటే హెచ్చరించడం తన కర్తవ్యమని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ఎవరిపైనో పగ తీర్చుకోవడం....లాంటి ఉద్దేశాలు తనకు లేనే లేవని స్పష్టం చేశారు. కేంద్రానికి తొత్తుగా పని చేయడానికి తనను ఇక్కడికి పంపలేదంటూ, గవర్నర్ పదవిని నిబాయించే సామర్థ్యం తనకు ఉందని చెప్పారు. కర్ణాటకలో ఉన్నంత వరకు సమర్థంగా, నిష్పక్షపాతంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.