పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి కృష్ణారావు తన శాసన సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. యానాంకు చెందిన ఆయన 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రతిపక్షం ఒక సభ్యుడిని తమ వైపునకు లాగేసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
‘ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు’ చెప్పి గత నెల జనవరి 7వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఆమోదించకపోవడంతో తాజాగా ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. రాజకీయంగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తానని మల్లాడి కృష్ణారావు తెలిపారు. నెల రోజులుగా కృష్ణారావు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు. అధికారికంగా కేటాయించిన కారును వినియోగించడం లేదు.
తాజాగా ఆయన రాజీనామాతో సీఎం నారాయణ్‌స్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. పుదుచ్చేరి ప్రభుత్వంలో మొత్తం 33 (నామినేటెడ్‌తో కలిపి) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధనవేలు అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది.
ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతిపక్షాల బలం 14 (ఎన్‌ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. ప్రభుత్వ బలం బార్డర్‌లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని ప్రతిపక్షం లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 1996 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment