సోమవారం విధానసౌధలో మాట్లాడుతున్న మంత్రి డీకే శివకుమార్
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి.
నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన..
విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు.
అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు.
సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్..
సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్‌బుక్‌లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ..
కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది.
అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్‌వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
బలిపశువును చేయొద్దు: స్పీకర్
అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్‌ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment