కర్నాటకంలో కాంగ్రెస్‌ సీఎం! | HD Kumaraswamy to vacate Karnataka CM post | Sakshi
Sakshi News home page

కర్నాటకంలో కాంగ్రెస్‌ సీఎం!

Published Mon, Jul 22 2019 4:36 AM | Last Updated on Mon, Jul 22 2019 8:59 AM

HD Kumaraswamy to vacate Karnataka CM post - Sakshi

అసెంబ్లీలో శివకుమార్, పరమేశ్వరలతో మాట్లాడుతున్న సీఎం కుమారస్వామి(ఫైల్‌)

బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి డి.కె.శివకుమార్‌ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్‌ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్‌ ఈ ప్రకటన చేశారు.

బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్‌ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్‌
ముంబైలోని రినైసెన్స్‌ హోటల్‌లో ఉంటున్న రెబెల్‌ ఎమ్మెల్యేలు శివకుమార్‌ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్‌ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్‌ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే  ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు.

కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే..
విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేశ్‌ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్‌ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు.  అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ నేతలు బెంగళూరులోని ‘తాజ్‌వివంత హోటల్‌’లో, బీజేపీ నేతలు ‘హోటల్‌ రమద’లో సమావేశమై చర్చించారు.

‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్‌..
బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్‌.నగేశ్, ఆర్‌.శంకర్‌లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్‌ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం.

సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప
కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప తెలిపారు.  ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్‌ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్‌ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు.

దయచేసి వెనక్కి రండి: సీఎం
ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్‌ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్‌) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్‌ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో ఎవరి బలమెంత?
కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది  పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement