vidhana sowdha
-
Karnataka: జూలై 19–22 టెన్త్ పరీక్షలు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షలకు సిద్ధమైంది. మంత్రి సురేశ్‌కుమార్ సోమవారం విధానసౌధలో వివరాలను వెల్లడించారు. జూలై 19న గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పరీక్ష జరుగుతుంది. జూలై 22న భాషా సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది. 8.76 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పరీక్ష రాయనున్నారు. 7,306 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితాలకు కలిసి ఒక పరీక్ష, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లకు ఒక పరీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. చదవండి: దివ్యాంగుల వసతి గృహంలో కీచక హెచ్ఎం.. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
ఒక్కరోజు ఆగితే తిరుగులేదు
కర్ణాటక,శివాజీనగర: బల పరీక్ష నిరూపణ ప్రక్రియను మంగళవారం కూడా వాయిదా పడేటట్లు చూసుకోవాలి, బుధవారం నుంచి అదృష్టమే మారిపోతుంది అని జ్యోతిష్యులు ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి సూచించినట్లు వదంతులు విహరించాయి. జ్యోతిష్యుల సలహా ప్రకారమే కుమారస్వామి విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని సమాచారం. ఆయన జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతారన్నది తెలిసిందే. మంగళవారం కూడా బలపరీక్ష జరగకుండా ఉంటే, బుధవారం నుంచి గ్రహబలం అనుకూలిస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన పదేపదే స్పీకర్‌ను కలిసి వాయిదాకు గడువు కోరడంతో పాటు గవర్నర్ ఆదేశాలనూ పక్కనపెడుతూ వచ్చారు. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు’
బెంగళూరు: తననేవరూ కిడ్నాప్ చేయలేదు అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగా విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను కిడ్నాప్ అయ్యానంటూ వస్తోన్న వార్తలపై శ్రీమంత్ పాటిల్ స్పందించారు. ‘వ్యక్తిగత పని మీద ముంబై వెళ్లిను. బాగా అలసి పోయాను. ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాను. అంతే తప్ప నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు’ అంటూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రీమంత్ పాటిల్. ఇదిలా ఉండగా పాటిల్‌ను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారని.. ఆయన వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సావధి ఉన్నారని డి.కె.శివకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయి అన్నారు శివకుమార్. -
కర్నాటకం క్లైమాక్స్ నేడే
సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పీకర్ రమేశ్‌ను డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసేందుకు వీలుగా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఈ విషయమై తాను అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు. దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్‌తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్‌డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్ జనరల్ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం.. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్‌ను కిడ్నాప్ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్వచ్చింది. పాటిల్ వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్‌ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్. మాకు పోలీస్ భద్రత కావాలి. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్ ఫొటోలతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ‘బీజేపీ డౌన్‌డౌన్’ ‘ఆపరేషన్ కమల డౌన్‌డౌన్’ అని నినాదాలు చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్ రమేశ్ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్ పాటిల్ అదృశ్యంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియోను విడుదల చేశారు. అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా.. విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. గవర్నర్‌తో బీజేపీ బృందం భేటీ విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ వజూభాయ్‌వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్ షెట్టర్ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్‌వాలా స్పీకర్‌ను ఆదేశించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ బలపరీక్షకు దూరంగా ఉన్నారు. కుమారస్వామికి గవర్నర్ లేఖ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్ ధ్రువీకరించారు. విప్ అంటే? చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్‌లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్‌ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్‌ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు. విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్‌లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్‌లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్‌లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్‌పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్‌కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్‌కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్‌కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ -
స్పీకర్ కోర్టులో బంతి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటక రాజకీయం గురువారం మరింత రసవత్తరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ రమేశ్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించట్లేరని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ఎమ్మెల్యేలను కలవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరంతా ప్రత్యేక విమానాల్లో ముంబై నుంచి కర్ణాటకలోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి పోలీస్ భద్రత మధ్య లగ్జరీ బస్సులో విధానసౌధ(అసెంబ్లీ)లోని స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సాయంత్రం 6 నుంచి గంటపాటు సమావేశమైన స్పీకర్ రమేశ్‡.. వారు మరోసారి సమర్పించిన రాజీనామా లేఖల్ని స్వీకరించారు. సమావేశం అనంతరం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఈసారి సరైన ఫార్మాట్లో సమర్పించారు. ఈ రాజీనామాలను శాసనసభ్యులు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా? లేదా? అనేది సమీక్షిస్తా. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు, రాబోయే ఫలితానికి నేను ఎంతమాత్రం బాధ్యుడ్ని కాదు’ అని రమేశ్ స్పష్టం చేశారు. రాజీనామాలు సమర్పించిన అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం అసెంబ్లీ స్పీకర్ రమేశ్‌ను ఆదేశించింది. వీరి రాజీనామాలపై తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం సూచించింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు విమానాశ్రయం నుంచి విధానసౌధ వరకూ వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. వీరంతా గురువారం సాయంత్రం 6 గంటలకు స్పీకర్‌తో భేటీ కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడ్డ కొన్నిగంటల్లోనే స్పీకర్ రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు తొలుత అందిన, పెండింగ్‌లో ఉన్న విజ్ఞప్తులపై తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్ కోర్టుకు విన్నవించారు. కాబట్టి రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరారు. అయితే ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున స్పీకర్ పిటిషన్‌ను రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులు కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేలకే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. విధానసౌధ వద్ద 144 సెక్షన్ కర్ణాటక అసెంబ్లీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విధానసౌధకు 2 కి.మీ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన నగర కమిషనర్ అలోక్ కుమార్.. ఈ నిషేధాజ్ఞలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. సౌమ్యా రెడ్డి(జయనగర–బెంగళూరు), సుబ్బారెడ్డి(బాగేపల్లి), మహంతేశ్ కౌజలగి(రాయభాగ), అంజలి నింబాళ్కర్(ఖానాపుర)లు త్వరలోనే రాజీనామా చేస్తారని సమాచారం. మనస్సాక్షి ఆధారంగా నిర్ణయం: స్పీకర్ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా స్పందించిందని స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ‘10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుసుకోవాలనీ, వారి రాజీనామాలను స్వీకరించాలని అత్యున్నత న్యాయస్థానం నన్ను కోరింది. ఒకవేళ ఈ రాజీనామాలను ఆమోదిస్తే, అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ చేసిన విజ్ఞప్తులు చెల్లకుండాపోతాయి. ఒకవేళ నేను ఈ ప్రక్రియను ఆదరాబాదరాగా చేపడితే మొత్తంగా అన్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విషయంలో నేను మనస్సాక్షి ఆధారంగా ముందుకెళతా. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు నన్ను కోరింది. 10 మంది శాసనసభ్యులతో గురువారం జరిగిన భేటీని వీడియో తీయించాను. శుక్రవారం ఈ వీడియోను సుప్రీంకోర్టుకు సమర్పిస్తాను. అలాగే ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే రాజీనామాలు సమర్పించారా.. అనే విషయమై రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. నేనేమీ మెరుపువేగంతో పనిచేయలేను. ప్రజలకు, రాష్ట్రానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్ప నేను ఎవ్వరికీ జవాబుదారీ కాదు’ అని వెల్లడించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై తాను కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో కలత చెందానని స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్‌వాలాను జూలై 6న కలిశారనీ, ఆ రోజున తాను కార్యాలయంలోనే ఉన్నానన్నారు. అయితే తాను సొంతపనిపై బయటకు వెళ్లగా, ఎమ్మెల్యేలు కనీస సమాచారం ఇవ్వకుండా తన కార్యాలయానికి వచ్చారని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పరిస్థితులు గందరగోళంగా, రోతపుట్టించేలా తయారయ్యాయని రమేశ్ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో భేటీకి ముందు రమేశ్ మీడియాతో మాట్లాడుతూ..‘వాళ్లు(శాసనసభ్యులు) నా కార్యాలయానికి రావాలనుకుంటే నేను అడ్డుకునేవాడిని కాదు. ఇందుకోసం వాళ్లు సుప్రీంకోర్టు వరకూ ఎందుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. శాసనసభ్యుల్ని కలుసుకోవడానికి నేను ఏనాడూ నిరాకరించలేదు‘ అని స్పష్టం చేశారు. స్పీకర్‌పై అభిశంసన? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించజాలదని రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య ఉన్న అధికారాల విభజనే ఇందుకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో ఓస్థాయి దాటి అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేదనీ, తమ అభిప్రాయాలను మాత్రమే చెప్పగలదని స్పష్టం చేశారు. మరోవైపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యుల మద్దతున్న నేపథ్యంలో స్పీకర్ రమేశ్ కుమార్‌పై ‘అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ద్రవ్య బిల్లు(ఓటాన్ అకౌంట్)ను ప్రవేశపెట్టనుంది. రాజీనామా ప్రసక్తే లేదు: సీఎం ‘అసలు నేనెందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు నేను రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? 2009–10 సమయంలో కొంత మంది మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం యడ్యూరప్పను వ్యతిరేకించారు. అప్పుడాయన రాజీనామా చేయలేదే’ అని సీఎం కుమారస్వామి అన్నారు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అసెంబ్లీకొస్తున్న సీఎం కుమారస్వామి బీజేపీ నేతలతో మంత్రి మహేశ్ రహస్య భేటీ సాక్షి, బెంగళూరు: సీఎం కుమారస్వామి సన్నిహితుడు, మంత్రి సా.రా.మహేశ్ గురువారం రాత్రి బెంగళూరులో కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పతో రహస్యంగా భేటీ అయ్యారు. బీజేపీతో జేడీఎస్ మైత్రి కోసమే మహేశ్ రంగంలోకి దిగారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి మహేశ్ స్పందిస్తూ.. తాను బీజేపీ నేతలను అనుకోకుండా కలిశానని తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకు తాను వెళ్లగా బీజేపీ నేతలు కనిపించారనీ, దీంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానని స్పష్టం చేశారు. -
మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించారు
బెంగుళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాష్ట్ర విధాన సౌధలో ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. ప్రస్తుతం స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కార్యాలయంగా ఉన్న రెండు గదులను సిద్ధరామయ్యకు కుమారస్వామి ప్రభుత్వం కేటాయించింది. సిద్ధరామయ్యకు ఎలాంటి పదవీ లేనప్పటికి ఆయనకు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించడం ఏంటని హాట్ టాపిక్‌గా మారింది. కాగా మాజీ స్పీకర్ కేబీ కోలివాడ్ ఆ కార్యాలయాన్ని వినియోగించిన కాలంలో 68 లక్షల ఖర్చుతో దాన్ని ఆధునీకరించారు. కాంగ్రెస్ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సిద్ధరామయ్యకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించలేదన్న విషయం తెలిసిందే. -
అక్కడ ప్రమాణం చేస్తే.. ఐదేళ్లు కష్టమే!
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేశారు. గత చరిత్ర చూస్తే విధానసౌధ ఆవరణలో ప్రమాణస్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఐదేళ్లు పదవిలో లేరు. గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో నిర్వహించేవారు. కానీ 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు. అదేఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణంచేసినా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో మళ్లీ పదవిని పోగొట్టుకున్నారు. 1990లో సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణం చేసిన బంగారప్ప కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. కావేరీ జాలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో ఆయన రెండేళ్లలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006లో బీజేపీ మద్దతుతో విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి కేవలం 20 నెలలే పరిపాలించగలిగారు. యడ్యూరప్పకూ చుక్కెదురే.. కర్ణాటకలో 2008లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పట్లో విధానసౌధ ముందు అట్టహాసంగా, ఎంతో ఆడంబరంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి దూరమయ్యారు. -
ఆఫీస్‌లో అశ్లీలం!
నీలి చిత్రాల వీక్షణకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పోతోంది. సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో అమరిపోతున్న నేపథ్యంలో నేటి యువత చాలావరకూ అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసలవుతోంటే, మరోవైపు బాధ్యతాయుత పదవుల్లో ఉండే ఉద్యోగులు కూడా వీటి బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా కర్ణాటకలో మరోసారి నీలి చిత్రాల వీక్షణ కలకలం సృష్టిస్తోంది. అప్పట్లో ఇద్దరు మంత్రులు సాక్షాత్తూ నిండు శాసనసభలో తమ మొబైల్లో బూతు చిత్రాలు వీక్షిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అనంతరం తమ పదవులను కూడా వదులుకోవల్సి వచ్చింది. ఈ జాఢ్యం ఈసారి ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. కర్ణాటకలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు పని ఎగ్గొట్టి మరీ ‘అశ్లీల సైట్లు’ చూస్తున్నారని సీఐడీకి సీబీఐ సమాచారమిచ్చింది. విధాన సౌధలో ఈ పోకడ ఎక్కువగా కనిపించిందని పేర్కొంది. ప్రజలకు మంచి పాలనను అందించాల్సిన విధాన సౌధలో ప్రస్తుతం 'నీలి' నీడలు కమ్ముకున్నాయి. సీబీఐలోని సైబర్ నిపుణులు ఉగ్రవాద వ్యతిరేక నిఘా వేసినప్పుడు ఈ విషయం బయటపడింది. విధాన సౌధలో నీలి చిత్రాల వీక్షణ గురించి సీఐడీకి ఎప్పటికప్పుడు సీబీఐ సమాచారం చేరవేసినట్లు తెలిసింది. ‘ప్రభుత్వ పనంటే భగవంతుని పని’ అని రాష్ట్ర పాలనకు మూల స్థానమైన విధాన సౌధపై తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటుంది. అయితే అందులో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు ఆ నినాద స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సీబీఐ, సీఐడీకి సమాచార నివేదికను ఇచ్చింది. ఉద్యోగులు పని ఎగ్గొట్టి ‘అశ్లీల సైట్లు’ చూస్తున్నారన్నది నివేదిక సారాంశం. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఇంటర్నెట్ కార్యకలాపాలను సీబీఐ పర్యవేక్షిస్తుంది. కర్.నిక్.ఇన్‌తో ఇంటర్నెట్ ప్రొటోకాల్‌ను విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రభుత్వోద్యోగులు అశ్లీల చిత్రాలను చూస్తున్నారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐలోని సైబర్ నిపుణులు ఉగ్రవాద వ్యతిరేక నిఘా వేసినప్పుడు ఈ విషయం బయటపడింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైనప్పటి నుంచీ గత రెండేళ్లుగా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు సీబీఐ పర్యవేక్షణలో ఉన్నాయి. విధాన సౌధలో నీలి చిత్రాల వీక్షణ గురించి సీఐడీకి ఎప్పటికప్పుడు సీబీఐ సమాచారం చేరవేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వోద్యోగులు నీలి చిత్రాలను వీక్షిస్తున్నారన్న నిగూఢ సమాచారంపై తగు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అశ్లీల చిత్రాలను చూసే అవకాశం లభిస్తోంది. సొంత సాధనాల నుంచి అశ్లీల చిత్రాలను చూడవచ్చేమో కానీ, అధికారిక కంప్యూటర్లలో అలాంటి వాటిని వీక్షించడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు రావడమే కాకుండా శిక్ష కూడా ఉంటుంది. సీబీఐ నుంచి ఇలాంటి నివేదిక అందిందా, లేదా అని ఆరా తీస్తే సీఐడీ అధికారులు పెదవి విప్పడం లేదు. మరోవైపు అశ్లీల చిత్రాల వీక్షణంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐడీ అధికారులు చెప్పటం విశేషం. కాగా ఇటీవలే చైనాలో ఇంటర్నెట్ కేంద్రాల్లో అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్న ఐదు వేల మందికి పైగా నెటిజన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆ దేశంలోని నెటిజన్లలో పెను సంచలనం సృష్టించింది. చైనాలో దాదాపు 40 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. వీరిలో సింహభాగం మంది అశ్లీల వీడియోలను వీక్షించేందుకే ఇంటర్నెట్ కేంద్రాలను వినియోగిస్తున్నారు.