స్పీకర్‌ కోర్టులో బంతి | Karnataka Political Drama Moves to Supreme Court after Speaker ramesh kumar | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ కోర్టులో బంతి

Published Fri, Jul 12 2019 2:59 AM | Last Updated on Fri, Jul 12 2019 4:59 AM

Karnataka Political Drama Moves to Supreme Court after Speaker ramesh kumar - Sakshi

విధానసౌధలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, అసెంబ్లీ స్పీకర్‌ను కలిసేందుకు వస్తున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటక రాజకీయం గురువారం మరింత రసవత్తరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించట్లేరని 10 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ఎమ్మెల్యేలను కలవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరంతా ప్రత్యేక విమానాల్లో ముంబై నుంచి కర్ణాటకలోని హాల్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి పోలీస్‌ భద్రత మధ్య లగ్జరీ బస్సులో విధానసౌధ(అసెంబ్లీ)లోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సాయంత్రం 6 నుంచి గంటపాటు సమావేశమైన స్పీకర్‌ రమేశ్‌‡.. వారు మరోసారి సమర్పించిన రాజీనామా లేఖల్ని స్వీకరించారు. సమావేశం అనంతరం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఈసారి సరైన ఫార్మాట్‌లో సమర్పించారు. ఈ రాజీనామాలను శాసనసభ్యులు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా? లేదా? అనేది సమీక్షిస్తా. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు, రాబోయే ఫలితానికి నేను ఎంతమాత్రం బాధ్యుడ్ని కాదు’ అని రమేశ్‌ స్పష్టం చేశారు. రాజీనామాలు సమర్పించిన అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిపోయారు.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
10 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌ను ఆదేశించింది. వీరి రాజీనామాలపై తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం సూచించింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు విమానాశ్రయం నుంచి విధానసౌధ వరకూ వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. వీరంతా గురువారం సాయంత్రం 6 గంటలకు స్పీకర్‌తో భేటీ కావాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలు వెలువడ్డ కొన్నిగంటల్లోనే స్పీకర్‌ రమేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు తొలుత అందిన, పెండింగ్‌లో ఉన్న విజ్ఞప్తులపై తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్‌ కోర్టుకు విన్నవించారు. కాబట్టి రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరారు. అయితే ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున స్పీకర్‌ పిటిషన్‌ను రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులు కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేలకే వర్తిస్తాయని తేల్చిచెప్పింది.

విధానసౌధ వద్ద 144 సెక్షన్‌
కర్ణాటక అసెంబ్లీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, మరోవైపు ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విధానసౌధకు 2 కి.మీ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్‌ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన నగర కమిషనర్‌ అలోక్‌ కుమార్‌.. ఈ నిషేధాజ్ఞలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. సౌమ్యా రెడ్డి(జయనగర–బెంగళూరు), సుబ్బారెడ్డి(బాగేపల్లి), మహంతేశ్‌ కౌజలగి(రాయభాగ), అంజలి నింబాళ్కర్‌(ఖానాపుర)లు త్వరలోనే రాజీనామా చేస్తారని సమాచారం.

మనస్సాక్షి ఆధారంగా నిర్ణయం: స్పీకర్‌
రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా స్పందించిందని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ‘10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుసుకోవాలనీ, వారి రాజీనామాలను స్వీకరించాలని అత్యున్నత న్యాయస్థానం నన్ను కోరింది. ఒకవేళ ఈ రాజీనామాలను ఆమోదిస్తే, అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌ చేసిన విజ్ఞప్తులు చెల్లకుండాపోతాయి. ఒకవేళ నేను ఈ ప్రక్రియను ఆదరాబాదరాగా చేపడితే మొత్తంగా అన్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విషయంలో నేను మనస్సాక్షి ఆధారంగా ముందుకెళతా. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు నన్ను కోరింది. 10 మంది శాసనసభ్యులతో గురువారం జరిగిన భేటీని వీడియో తీయించాను. శుక్రవారం ఈ వీడియోను సుప్రీంకోర్టుకు సమర్పిస్తాను. అలాగే ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే రాజీనామాలు సమర్పించారా.. అనే విషయమై రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. నేనేమీ మెరుపువేగంతో పనిచేయలేను. ప్రజలకు, రాష్ట్రానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్ప నేను ఎవ్వరికీ జవాబుదారీ కాదు’ అని వెల్లడించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై తాను కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో కలత చెందానని స్పీకర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్‌ వజూభాయ్‌వాలాను జూలై 6న కలిశారనీ, ఆ రోజున తాను కార్యాలయంలోనే ఉన్నానన్నారు. అయితే తాను సొంతపనిపై బయటకు వెళ్లగా, ఎమ్మెల్యేలు కనీస సమాచారం ఇవ్వకుండా తన కార్యాలయానికి వచ్చారని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పరిస్థితులు గందరగోళంగా, రోతపుట్టించేలా తయారయ్యాయని రమేశ్‌ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో భేటీకి ముందు రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘వాళ్లు(శాసనసభ్యులు) నా కార్యాలయానికి రావాలనుకుంటే నేను అడ్డుకునేవాడిని కాదు. ఇందుకోసం వాళ్లు సుప్రీంకోర్టు వరకూ ఎందుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. శాసనసభ్యుల్ని కలుసుకోవడానికి నేను ఏనాడూ నిరాకరించలేదు‘ అని స్పష్టం చేశారు.

స్పీకర్‌పై అభిశంసన?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించజాలదని రాజ్యాంగ నిపుణులు, సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య ఉన్న అధికారాల విభజనే ఇందుకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో ఓస్థాయి దాటి అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేదనీ, తమ అభిప్రాయాలను మాత్రమే చెప్పగలదని స్పష్టం చేశారు. మరోవైపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యుల మద్దతున్న నేపథ్యంలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌పై ‘అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ద్రవ్య బిల్లు(ఓటాన్‌ అకౌంట్‌)ను ప్రవేశపెట్టనుంది.

రాజీనామా ప్రసక్తే లేదు: సీఎం
‘అసలు నేనెందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు నేను రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? 2009–10 సమయంలో కొంత మంది మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం యడ్యూరప్పను వ్యతిరేకించారు. అప్పుడాయన రాజీనామా చేయలేదే’ అని సీఎం కుమారస్వామి అన్నారు.  అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది.

అసెంబ్లీకొస్తున్న సీఎం కుమారస్వామి

బీజేపీ నేతలతో మంత్రి మహేశ్‌ రహస్య భేటీ
సాక్షి, బెంగళూరు: సీఎం కుమారస్వామి సన్నిహితుడు, మంత్రి సా.రా.మహేశ్‌ గురువారం రాత్రి బెంగళూరులో కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌ మురళీధరరావు, బీజేపీ సీనియర్‌ నేత ఈశ్వరప్పతో రహస్యంగా భేటీ అయ్యారు. బీజేపీతో జేడీఎస్‌ మైత్రి కోసమే మహేశ్‌ రంగంలోకి దిగారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి మహేశ్‌ స్పందిస్తూ.. తాను బీజేపీ నేతలను అనుకోకుండా కలిశానని తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకు తాను వెళ్లగా బీజేపీ నేతలు కనిపించారనీ, దీంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement