బెంగళూరు: తననేవరూ కిడ్నాప్ చేయలేదు అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగా విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను కిడ్నాప్ అయ్యానంటూ వస్తోన్న వార్తలపై శ్రీమంత్ పాటిల్ స్పందించారు.
‘వ్యక్తిగత పని మీద ముంబై వెళ్లిను. బాగా అలసి పోయాను. ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాను. అంతే తప్ప నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు’ అంటూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రీమంత్ పాటిల్. ఇదిలా ఉండగా పాటిల్‌ను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారని.. ఆయన వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సావధి ఉన్నారని డి.కె.శివకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయి అన్నారు శివకుమార్.
Comments
Please login to add a commentAdd a comment