కుమార ‘మంగళం’ | Kumaraswamy Government Collapse In Floor Test In Karnataka | Sakshi
Sakshi News home page

కుమార ‘మంగళం’

Published Wed, Jul 24 2019 2:00 AM | Last Updated on Wed, Jul 24 2019 2:05 AM

Kumaraswamy Government Collapse In Floor Test In Karnataka - Sakshi

సాక్షి బెంగళూరు: దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నెల మొదటి వారంలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గవర్నర్‌ విధించిన గడువులు కూడా ముగిశాయి. చివరి అంకంగా స్పీకర్‌ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్‌ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో సభా వాతావరణం వేడెక్కింది.  

ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి కాంగ్రెస్, జేడీఎస్‌ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. పరస్పర విమర్శలు, క్యాంపు రాజకీయాలతోనే ఏడాదంతా గడిచిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం సంకీర్ణంపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని స్థానాలన్నిటినీ దాదాపు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. బీజేపీ పరోక్ష ప్రోద్బలంతో సంకీర్ణానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. అయితే, వీరిని అసెంబ్లీకి హాజరుకావాలంటూ బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే తీవ్ర హెచ్చరికలు చేసినా రాజీనామా చేసిన వారు తిరిగి వచ్చేందుకు నిరాకరించడంతో కుమారస్వామి సర్కారు పతనానికి దారులు పడ్డాయి. నాలుగు రోజులుగా చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం సభలో బల నిరూపణకు సిద్ధం కావాలని స్పీకర్‌ గడువు విధించారు. అయితే, తనకు బుధవారం వరకు సమయం ఇవ్వాలని సీఎం కుమారస్వామి కోరగా ఆయన నిరాకరించారు. దీంతో మంగళవారం యథావిధిగా అసెంబ్లీ సమావేశమయింది. సాయంత్రం సభలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.  

తీర్మానం వీగిపోయిందిలా.. 
ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో పడకుండా ఇప్పటి దాకా ముంబై వంటి చోట్ల తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, హోటళ్లలో బస ఏర్పాటు చేసిన అధికార, ప్రతిపక్షాలు మంగళవారం నాటి బలపరీక్షకు ప్రత్యేకంగా అసెంబ్లీకి బస్సుల్లో తరలించాయి. కాంగ్రెస్‌–జేడీఎస్‌లకు చెందిన 17 మంది, బీఎస్‌పీ సభ్యుడు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు మొత్తం 20 మంది మంగళవారం సభకు గైర్హాజరయ్యారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 225 నుంచి 204(స్పీకర్‌ మినహా)కు తగ్గింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 103 కాగా, తీర్మానానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి సభా కార్యకలాపాలను నిర్వేదంతో చూస్తూ తన స్థానంలో కూర్చుండిపోయారు. బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొనలేదు. సర్కారు కూలిపోయినట్లు ప్రకటించగానే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆనందోత్సాహాలుపెల్లుబికాయి. బీజేపీ పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను అభినందించారు.  

సంతోషంగా త్యజిస్తున్నా: కుమారస్వామి 
బలపరీక్షకు ముందు సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా ప్రసంగించారు. రెబల్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన నిధుల వివరాలను చదివి వినిపించారు. పలు అభివృద్ధి పనులు కేటాయించినా ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా తిరుగుబాటు చేశారని వాపోయారు. అయితే కుమారస్వామి తనకు మూడు గంటల వ్యవధి ఇవ్వాలని కోరగా, త్వరగా ముగించాలని స్పీకర్‌ సూచించారు. సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదని,  తాను అధికారం కోసం పాకులాడలేదన్నారు. సీఎం కుర్చీని సంతోషంగా వదిలివేస్తున్నట్లు తెలిపారు. బల పరీక్షను వాయిదాలు వేసి స్పీకర్‌ను నొప్పించినందుకు క్షమిం చాలని కోరారు. సభాపతిని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 10 రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ‘మాకూ సిగ్గుంది. ఇంకా అధికారంలో కొన సాగలేం. అయినా మేం చేసిన తప్పేంటి? నిజాయతీతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషిచేశాం. రాజీనామా తర్వాత నేను ఎక్కడికీ పారిపోను. నన్ను ఎందుకు తప్పించారో ప్రజలు కూడా తెలుసుకోవాలి. కుర్చీ శాశ్వతం కాదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నించింది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదు.  అదే జరిగితే, ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం’ అని అన్నారు.  

కుమారస్వామి రాజీనామా 
విశ్వాస పరీక్షలో ఓటమి అనంతరం సీఎం కుమారస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ వజూభాయ్‌ వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్‌.. మరో ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.   కాగా, బల పరీక్షలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వని బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు అధినేత్రి మాయావతి ప్రకటించారు.

అపవిత్ర మైత్రికి చెల్లుచీటీ: యడ్యూరప్ప  
కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతలు కమీషన్‌ల కోసం పని చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ –జేడీఎస్‌ అపవిత్ర మైత్రికి కాలం చెల్లిపోయిందన్నారు. 2018 ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం ఉప ఎన్నికలో మరో సీటును గెలుచుకుని 105కు బలం పెంచుకుంది. గత ఏడాది మేలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే యడ్యూరప్ప వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయింది. స్పీకర్, నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి 225 సభ్యులున్న అసెంబ్లీలో రెబెల్స్‌ రాజీనామాలకు ముందు కాంగ్రెస్, జేడీఎస్‌ ప్రభుత్వం బలం 117. ఇందులో స్పీకర్‌ కాకుండా కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ (37), బీఎస్‌పీ (1), నామినేటెడ్‌ (1)సభ్యులున్నారు. 

ప్రజాస్వామ్యం ఓడింది: రాహుల్‌ 
‘ప్రజాస్వామ్యం, నిజాయితీ, రాష్ట్ర ప్రజల తీర్పు’ ఓడిపోయాయి అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘సంక్షోభాలు సృష్టించిన వారి లక్ష్యం నేరు నెరవేరింది’ అని బీజేపీనుద్దేశించి అన్నారు.    

తదుపరి సీఎం యడ్యూరప్ప!
న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలనేదానిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తమ పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప తదుపరి సీఎం అవుతారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ, ‘సీఎం పదవిని చేపట్టేది యడ్యూరప్పేనన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితరులతో కూడిన పార్టీ అగ్రనాయకత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కర్ణాటకకే చెందిన ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ యడ్యూరప్పకే సీఎం అవకాశాలు అత్యధికంగా ఉన్నప్పటికీ, పార్టీ జాతీయ నాయకత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 

మోదీ, షాతో మాట్లాడాక గవర్నర్‌ను కలుస్తాం: యడ్యూరప్ప 
పార్టీ కేంద్ర నాయకత్వంలోని మోదీ, అమిత్‌ షాతో సంప్రదింపులు జరిపిన అనంతరం తాము గవర్నర్‌ను కలుస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారనీ, వారి ప్రభుత్వం కూలిపోవడం ప్రజా విజయమని ఆయన అన్నారు. విశ్వాసపరీక్షలో బీజేపీ పక్షానే నిలిచిన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి అభివృద్ధిలో నవశకం మొదలవుతుందని పేర్కొన్నారు.  

4 రాష్ట్రాల్లోనే.. 
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు గడ్డు రోజులు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుని, దేశవ్యాప్తంగా కేవలం 52 స్థానాల్లో గెలుపుతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన ఆ పార్టీని కర్ణాటక పరిణామాలు మరో దెబ్బతీశాయి. సంకీర్ణ భాగస్వామి  అయిన కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ‘చే’జారింది. 2018లో కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ అధికారాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం ‘చేతి’లో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే ఉన్నాయి. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాదిలో అధికారం పంచుకుంటున్న ఏకైక రాష్ట్రాన్ని కూడా కోల్పోవాల్సి రావడం పార్టీకి దెబ్బగానే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు.

ముచ్చటగా ముగ్గురే! 
ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలు వీరే
న్యూఢిల్లీ : కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగిన ముఖ్యమంత్రులు ముగ్గురే. వారు కూడా కాంగ్రెస్‌ పార్టీ వారే కావడం గమనార్హం. ఎస్‌.నిజలింగప్ప (1962–68), డీ దేవరాజ ఉర్స్‌ (1972–77), సిద్దరామయ్య (2013–18) మాత్రమే విజయవంతంగా తమ పదవీకాలాన్ని ముగించగలిగారు. బీజేపీ నుంచి కానీ జేడీఎస్‌ నుంచి కానీ ఎవరూ ఐదేళ్లు సీఎంగా నిలవలేకపోయారు. గతంలో బీజేపీ సంకీర్ణంలో భాగంగా సీఎం పదవి చేపట్టిన కుమారస్వామి రెండేళ్లలోపే గద్దె దిగారు. ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్‌ 2007 వరకు మాత్రమే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మరోసారి 2018 మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి.. విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో 2019 జూలై 23న రాజీనామా చేశారు. బీజేపీ విషయానికి వస్తే.. 2007లో తొలిసారి సీఎం అయిన యడ్యూరప్ప జేడీఎస్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారం రోజులకే పదవీచ్యుతులయ్యారు. మరోసారి, 2018 మే 17 నుంచి 23 వరకే అధికారంలో కొనసాగి, మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటివరకు 25 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు.   

సంక్షోభం సాగిందిలా.. 

  •   2019 జూలై 1: కుమారస్వామి సర్కార్‌తో విభేదాలతో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా.
  •  జూలై 6: రాజీనామా చేసిన మరో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు. మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని స్పీకర్‌ ప్రకటన. రెబెల్స్‌ అంతా విమానంలో ముంబైకి వెళ్లారు. 
  •  జూలై 7: అమెరికా నుంచి తిరిగొచ్చిన కుమారస్వామి 
  •  జూలై 8: మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్, శంకర్‌. బీజేపీకి మద్దతు.  
  •  జూలై 9: 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగా లేవన్న స్పీకర్‌. సరైన ఫార్మాట్‌లో పంపాలని సూచన. సీఎల్పీ భేటీ. 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా. మరో ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ రాజీనామా. 
  •  జూలై 10: ముంబైలో ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోని ముగ్గురు అసంతృప్త నేతల్ని బుజ్జగించడానికి కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి నిరాకరించి పోలీసుల సాయాన్ని అభ్యర్థించారు.  మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్‌ కె.సుధాకర్‌ రాజీనామా 
  •  జూలై 11: స్పీకర్‌ తమ రాజీనామాలు చెల్లవని తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన రెబెల్‌ ఎమ్మెల్యేలు  
  • జూలై 17: రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనన్న సుప్రీంకోర్టు. దానికి నిర్దిష్ట సమయం అంటూ లేదని, సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్‌ ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టీకరణ. తన రాజీనామాను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి.  
  • జూలై 18: ఇదే రోజు కర్ణాటకలో సీఎం కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండేది. అయితే 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సహా 21 మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను అపహరించిందంటూ సభలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ఆరోపణలు. సభకు హాజరుకావడంపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తే, విప్‌ జారీ చేసి ఉపయోగం ఉండదని, దీనిపై స్పష్టత కావాలంటూ వాదించిన కాంగ్రెస్‌. విశ్వాసపరీక్ష జరగకుండా సభ వాయిదా వేయడంతో సభలోనే రాత్రంతా కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన 
  •  జూలై 19: శుక్రవారం సభలో విశ్వాస పరీక్ష జరపాలని గవర్నర్‌ వజూభాయ్‌ రెండుసార్లు సీఎం కుమారస్వామికి లేఖలు రాశారు. అయినా సీఎం, స్పీకర్‌ ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా 
  •  జూలై 22: సభలో బలాన్ని నిరూపించుకోవడానికి బుధవారం వరకూ స్పీకర్‌ని గడువు కోరిన కుమారస్వామి. నిరాకరించిన స్పీకర్‌. విశ్వాస పరీక్షపై కాలయాపన ఎవరికీ మంచిది కాదని హితవు. విశ్వాస తీర్మానం చర్చకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రసంగాన్ని తగ్గించాలంటూ స్పీకర్‌ అసహనం. అధికార, విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే సభ వాయిదా.  
  •  జూలై 23: ఎట్టకేలకు బలపరీక్ష నిర్వహణ. కుప్పకూలిన కుమారస్వామి సర్కార్‌. గైర్హాజరైన 21 మంది ఎమ్మెల్యేలు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు.

సభలో బలాబలాలు
మొత్తం సభ్యులు (1 నామినేటెడ్‌ సహా)     225
సభకు హాజరైనవారు (స్పీకర్‌తో)             205
మ్యాజిక్‌ ఫిగర్‌                                    103  
విశ్వాసానికి అనుకూలంగా                    99 
విశ్వాసానికి వ్యతిరేకంగా                      105 
హాజరుకాని వారు                               20

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement