Kumar Swamy
-
బీజేపీతో పొత్తు గురించి చర్చలు
శివాజీనగర: లోకసభ ఎన్నికలకు బీజేపీ, జేడీఎస్ కూటమి ఏర్పాటు గురించి చర్చలు ఆరంభంలో ఉన్నాయి, సీట్ల పంపకాలపై ఇంతవరకు చర్చలు కాలేదని జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి తెలిపారు. శనివారం నగరంలో పద్మనాభనగరలో ఉన్న తండ్రి దేవెగౌడ ఇంటికి కుమార వచ్చి రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, నా ఆరోగ్యం గురించి మాట్లాడాను, మాజీ సీఎం యడియూరప్ప మా పార్టీ, దేవెగౌడ, నా గురించి మంచిగా మాట్లాడారు. పొత్తు బీజేపీకి, జేడీఎస్‌కు తప్పనిసరి కాదు, పరస్పరం విశ్వాసం, గౌరవం ముఖ్యం. కార్యకర్తల సమావేశం జరిపి వారి అభిప్రాయం తీసుకోవాలని దేవెగౌడ సూచించారని చెప్పారు. నేడు పార్టీ సమావేశం ఈ నేపథ్యంలో నగరంలో ప్యాలెస్ మైదానంలో ఆదివారం జేడీఎస్ సమావేశం జరగనుంది, లోక్‌సభ ఎన్నికల పొత్తు గురించి చర్చించే అవకాశముంది. దేవెగౌడ, కుమారస్వామి సహా ఎమ్మెల్యే, ఎంపీల వరకు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కర్ణాటక: జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. -
జాతీయ పార్టీ కోసం పరిశీలనలో మూడు పేర్లు
-
కుమార ‘మంగళం’
సాక్షి బెంగళూరు: దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నెల మొదటి వారంలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గవర్నర్ విధించిన గడువులు కూడా ముగిశాయి. చివరి అంకంగా స్పీకర్ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో సభా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. పరస్పర విమర్శలు, క్యాంపు రాజకీయాలతోనే ఏడాదంతా గడిచిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం సంకీర్ణంపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని స్థానాలన్నిటినీ దాదాపు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. బీజేపీ పరోక్ష ప్రోద్బలంతో సంకీర్ణానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. అయితే, వీరిని అసెంబ్లీకి హాజరుకావాలంటూ బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే తీవ్ర హెచ్చరికలు చేసినా రాజీనామా చేసిన వారు తిరిగి వచ్చేందుకు నిరాకరించడంతో కుమారస్వామి సర్కారు పతనానికి దారులు పడ్డాయి. నాలుగు రోజులుగా చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం సభలో బల నిరూపణకు సిద్ధం కావాలని స్పీకర్ గడువు విధించారు. అయితే, తనకు బుధవారం వరకు సమయం ఇవ్వాలని సీఎం కుమారస్వామి కోరగా ఆయన నిరాకరించారు. దీంతో మంగళవారం యథావిధిగా అసెంబ్లీ సమావేశమయింది. సాయంత్రం సభలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయిందిలా.. ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో పడకుండా ఇప్పటి దాకా ముంబై వంటి చోట్ల తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, హోటళ్లలో బస ఏర్పాటు చేసిన అధికార, ప్రతిపక్షాలు మంగళవారం నాటి బలపరీక్షకు ప్రత్యేకంగా అసెంబ్లీకి బస్సుల్లో తరలించాయి. కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది, బీఎస్పీ సభ్యుడు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు మొత్తం 20 మంది మంగళవారం సభకు గైర్హాజరయ్యారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 225 నుంచి 204(స్పీకర్ మినహా)కు తగ్గింది. మ్యాజిక్ ఫిగర్ 103 కాగా, తీర్మానానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి సభా కార్యకలాపాలను నిర్వేదంతో చూస్తూ తన స్థానంలో కూర్చుండిపోయారు. బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొనలేదు. సర్కారు కూలిపోయినట్లు ప్రకటించగానే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆనందోత్సాహాలుపెల్లుబికాయి. బీజేపీ పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను అభినందించారు. సంతోషంగా త్యజిస్తున్నా: కుమారస్వామి బలపరీక్షకు ముందు సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా ప్రసంగించారు. రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన నిధుల వివరాలను చదివి వినిపించారు. పలు అభివృద్ధి పనులు కేటాయించినా ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా తిరుగుబాటు చేశారని వాపోయారు. అయితే కుమారస్వామి తనకు మూడు గంటల వ్యవధి ఇవ్వాలని కోరగా, త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదని, తాను అధికారం కోసం పాకులాడలేదన్నారు. సీఎం కుర్చీని సంతోషంగా వదిలివేస్తున్నట్లు తెలిపారు. బల పరీక్షను వాయిదాలు వేసి స్పీకర్‌ను నొప్పించినందుకు క్షమిం చాలని కోరారు. సభాపతిని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 10 రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ‘మాకూ సిగ్గుంది. ఇంకా అధికారంలో కొన సాగలేం. అయినా మేం చేసిన తప్పేంటి? నిజాయతీతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషిచేశాం. రాజీనామా తర్వాత నేను ఎక్కడికీ పారిపోను. నన్ను ఎందుకు తప్పించారో ప్రజలు కూడా తెలుసుకోవాలి. కుర్చీ శాశ్వతం కాదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నించింది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదు. అదే జరిగితే, ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం’ అని అన్నారు. కుమారస్వామి రాజీనామా విశ్వాస పరీక్షలో ఓటమి అనంతరం సీఎం కుమారస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్.. మరో ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా, బల పరీక్షలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వని బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత్రి మాయావతి ప్రకటించారు. అపవిత్ర మైత్రికి చెల్లుచీటీ: యడ్యూరప్ప కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ నేతలు కమీషన్ల కోసం పని చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ –జేడీఎస్ అపవిత్ర మైత్రికి కాలం చెల్లిపోయిందన్నారు. 2018 ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం ఉప ఎన్నికలో మరో సీటును గెలుచుకుని 105కు బలం పెంచుకుంది. గత ఏడాది మేలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే యడ్యూరప్ప వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటయింది. స్పీకర్, నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 సభ్యులున్న అసెంబ్లీలో రెబెల్స్ రాజీనామాలకు ముందు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం బలం 117. ఇందులో స్పీకర్ కాకుండా కాంగ్రెస్ 78, జేడీఎస్ (37), బీఎస్పీ (1), నామినేటెడ్ (1)సభ్యులున్నారు. ప్రజాస్వామ్యం ఓడింది: రాహుల్ ‘ప్రజాస్వామ్యం, నిజాయితీ, రాష్ట్ర ప్రజల తీర్పు’ ఓడిపోయాయి అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘సంక్షోభాలు సృష్టించిన వారి లక్ష్యం నేరు నెరవేరింది’ అని బీజేపీనుద్దేశించి అన్నారు. తదుపరి సీఎం యడ్యూరప్ప! న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలనేదానిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తదుపరి సీఎం అవుతారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ, ‘సీఎం పదవిని చేపట్టేది యడ్యూరప్పేనన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులతో కూడిన పార్టీ అగ్రనాయకత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కర్ణాటకకే చెందిన ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ యడ్యూరప్పకే సీఎం అవకాశాలు అత్యధికంగా ఉన్నప్పటికీ, పార్టీ జాతీయ నాయకత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మోదీ, షాతో మాట్లాడాక గవర్నర్‌ను కలుస్తాం: యడ్యూరప్ప పార్టీ కేంద్ర నాయకత్వంలోని మోదీ, అమిత్ షాతో సంప్రదింపులు జరిపిన అనంతరం తాము గవర్నర్‌ను కలుస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారనీ, వారి ప్రభుత్వం కూలిపోవడం ప్రజా విజయమని ఆయన అన్నారు. విశ్వాసపరీక్షలో బీజేపీ పక్షానే నిలిచిన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి అభివృద్ధిలో నవశకం మొదలవుతుందని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల్లోనే.. న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు గడ్డు రోజులు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుని, దేశవ్యాప్తంగా కేవలం 52 స్థానాల్లో గెలుపుతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన ఆ పార్టీని కర్ణాటక పరిణామాలు మరో దెబ్బతీశాయి. సంకీర్ణ భాగస్వామి అయిన కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ‘చే’జారింది. 2018లో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ అధికారాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం ‘చేతి’లో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే ఉన్నాయి. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాదిలో అధికారం పంచుకుంటున్న ఏకైక రాష్ట్రాన్ని కూడా కోల్పోవాల్సి రావడం పార్టీకి దెబ్బగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ముచ్చటగా ముగ్గురే! ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలు వీరే న్యూఢిల్లీ : కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగిన ముఖ్యమంత్రులు ముగ్గురే. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. ఎస్.నిజలింగప్ప (1962–68), డీ దేవరాజ ఉర్స్ (1972–77), సిద్దరామయ్య (2013–18) మాత్రమే విజయవంతంగా తమ పదవీకాలాన్ని ముగించగలిగారు. బీజేపీ నుంచి కానీ జేడీఎస్ నుంచి కానీ ఎవరూ ఐదేళ్లు సీఎంగా నిలవలేకపోయారు. గతంలో బీజేపీ సంకీర్ణంలో భాగంగా సీఎం పదవి చేపట్టిన కుమారస్వామి రెండేళ్లలోపే గద్దె దిగారు. ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్ 2007 వరకు మాత్రమే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మరోసారి 2018 మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి.. విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో 2019 జూలై 23న రాజీనామా చేశారు. బీజేపీ విషయానికి వస్తే.. 2007లో తొలిసారి సీఎం అయిన యడ్యూరప్ప జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారం రోజులకే పదవీచ్యుతులయ్యారు. మరోసారి, 2018 మే 17 నుంచి 23 వరకే అధికారంలో కొనసాగి, మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటివరకు 25 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సంక్షోభం సాగిందిలా.. 2019 జూలై 1: కుమారస్వామి సర్కార్‌తో విభేదాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా. జూలై 6: రాజీనామా చేసిన మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని స్పీకర్ ప్రకటన. రెబెల్స్ అంతా విమానంలో ముంబైకి వెళ్లారు. జూలై 7: అమెరికా నుంచి తిరిగొచ్చిన కుమారస్వామి జూలై 8: మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్, శంకర్. బీజేపీకి మద్దతు. జూలై 9: 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగా లేవన్న స్పీకర్. సరైన ఫార్మాట్లో పంపాలని సూచన. సీఎల్పీ భేటీ. 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా. మరో ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా. జూలై 10: ముంబైలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని ముగ్గురు అసంతృప్త నేతల్ని బుజ్జగించడానికి కాంగ్రెస్ నేత శివకుమార్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి నిరాకరించి పోలీసుల సాయాన్ని అభ్యర్థించారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె.సుధాకర్ రాజీనామా జూలై 11: స్పీకర్ తమ రాజీనామాలు చెల్లవని తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన రెబెల్ ఎమ్మెల్యేలు జూలై 17: రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనన్న సుప్రీంకోర్టు. దానికి నిర్దిష్ట సమయం అంటూ లేదని, సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టీకరణ. తన రాజీనామాను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి. జూలై 18: ఇదే రోజు కర్ణాటకలో సీఎం కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండేది. అయితే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సహా 21 మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను అపహరించిందంటూ సభలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణలు. సభకు హాజరుకావడంపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తే, విప్ జారీ చేసి ఉపయోగం ఉండదని, దీనిపై స్పష్టత కావాలంటూ వాదించిన కాంగ్రెస్. విశ్వాసపరీక్ష జరగకుండా సభ వాయిదా వేయడంతో సభలోనే రాత్రంతా కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన జూలై 19: శుక్రవారం సభలో విశ్వాస పరీక్ష జరపాలని గవర్నర్ వజూభాయ్ రెండుసార్లు సీఎం కుమారస్వామికి లేఖలు రాశారు. అయినా సీఎం, స్పీకర్ ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా జూలై 22: సభలో బలాన్ని నిరూపించుకోవడానికి బుధవారం వరకూ స్పీకర్‌ని గడువు కోరిన కుమారస్వామి. నిరాకరించిన స్పీకర్. విశ్వాస పరీక్షపై కాలయాపన ఎవరికీ మంచిది కాదని హితవు. విశ్వాస తీర్మానం చర్చకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రసంగాన్ని తగ్గించాలంటూ స్పీకర్ అసహనం. అధికార, విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే సభ వాయిదా. జూలై 23: ఎట్టకేలకు బలపరీక్ష నిర్వహణ. కుప్పకూలిన కుమారస్వామి సర్కార్. గైర్హాజరైన 21 మంది ఎమ్మెల్యేలు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు. సభలో బలాబలాలు మొత్తం సభ్యులు (1 నామినేటెడ్ సహా) 225 సభకు హాజరైనవారు (స్పీకర్‌తో) 205 మ్యాజిక్ ఫిగర్ 103 విశ్వాసానికి అనుకూలంగా 99 విశ్వాసానికి వ్యతిరేకంగా 105 హాజరుకాని వారు 20 -
అయ్యో ‘కుమార’ కూల్చేశారా
సాక్షి, బెంగళూరు: దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక సంక్షోభం ముగిసింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ పార్టీ, కాపాడుకోడానికి మరో పార్టీ రచించిన వ్యూహాలన్నీంటికి నేటితో తెరపడింది. బీజేపీ అనుకున్నట్లుగానే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. సీఎం కుమారస్వామి ఉద్వేగ ప్రసంగం అనంతరం.. స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్ష నిర్వహించారు. మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. తొలుత ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ ఆదేశించడంతో వారు ఆశీనులయ్యారు. ఓటింగ్ ముగిసే వరకు అసెంబ్లీ తలుపులను పూర్తిగా మూసివేశారు. అనంతరం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విశ్వాస పరీక్షలో ప్రభుత్వ ఓడినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన నేటితో ముగిసింది. మరోవైరు సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతకుమందు విశ్వాస పరీక్షపై సీఎం కుమార స్వామి భావోద్వేగంగా మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, సీఎంగా కన్నడ ప్రజలకు ఎంతో చేశానని ఉద్వేగంగా మాట్లాడారు. త్వరలో కుమారస్వామి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో రెండు రోజులపాటు బార్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగిసేలా కనిపిస్తోంది. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారం రోజు సాయంత్ర 6 గంటలకు ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు, విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన స్పీకర్ నేడు తప్పనిసరిగా బల పరీక్ష నిర్వహించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే సోమవారం రెబల్స్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా వారంత తన ముందు హాజరుకావాలని 16 మంది సభ్యులకు సమన్లు జారీచేశారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు రెబల్స్‌పై అనర్హత వేటు వేయాలని స్వీకర్‌కు చెప్పడంతో ఆయన సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తయిన వెంటనే బలపరీక్ష ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేడో, రేపో తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న వారి అభ్యర్థనకు ధర్మాసనం నిరాకరించింది. విశ్వాస పరీక్షలో తాము జోక్యం చేసుకోలేని స్పష్టం చేస్తూ.. ఇవాళే బలపరీక్ష చేపట్టాలని తాము స్వీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తేల్చిచెప్పింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషిన్‌ను రేపు విచారిస్తామని తెలిపింది. ‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. కాగా విశ్వాస పరీక్షపై గవర్నర్ ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌ను లేఖ రాయగా.. వాటిని రమేష్ కుమార్ ధిక్కరించారు. దీంతో బలనిరూపణపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంకానుంది. -
సీఎం వాచీ చోరీకి గురైనదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన వాచీ రూ.70లక్షలు విలువ చేసేదంటూ రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మరో బాంబ్ పేల్చారు. ఆ వాచీ ఇంతకుముందు చోరీకి గురైందని ఆరోపించారు. ఎన్ఆర్ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి ఇంట్లో చోరీకి గురైన వాచ్, సిద్ధరామయ్య ధరిస్తున్న లగ్జరీ వాచ్ ఒకేలా ఉన్నాయంటూ సుధాకర్ శెట్టి స్నేహితుడొకరు తనకు స్వయంగా చెప్పారంటూ వెల్లడించారు. అయితే సుధాకర్ శెట్టి మాత్రం ఇందులో నిజం లేదని, తన ఇంట్లో చోరీకి గురైనవాచ్, సీఎం సిద్ధరామయ్య వద్ద ఉన్న వాచ్ వేర్వేరని చెబుతున్నారు. విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ....‘నేను సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన సందర్భంలో మీడియాలో ఆ వాచ్‌ను చూసిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి తన స్నేహితుని ద్వారా నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్ తన ఇంట్లో చోరీకి గురైన వాచ్ అని, స్వయంగా కలిసి అన్ని వివరాలను చెబుతానని అన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేశారు. ఈ విషయంలోకి తనను లాగవద్దని అంటున్నారు. అయినా నేను ఆయనకు ధైర్యం చెప్పాను. 2015 జూలై 7న బెంగళూరులోని కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో సుధాకర్ శెట్టి తన ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రెండు రోలెక్స్ వాచ్‌లు, ఓ వజ్రాలు పొదిగిన వాచ్‌తో పాటు కొన్ని బంగారు, వజ్ర ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు’ అని వివరించారు. ఇక లగ్జరీ వాచ్ విషయమై సీఎం సిద్ధరామయ్య చెబుతున్న మాటలు కట్టు కథల్లా అనిపిస్తున్నాయని విమర్శించారు. నిజంగానే సిద్ధరామయ్య ప్రాణస్నేహితుడు ఆ వాచ్‌ను బహూకరించి ఉంటే ఆ విషయం చెప్పడానికి సీఎం ఇన్ని రోజులు ఎందుకు వేచి చూశారంటూ కుమారస్వామి ప్రశ్నించారు. కుమారస్వామిది దిగజారుడు రాజకీయం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కుమారస్వామి పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ఏవో ఆరోపణలు చేయడం కుమారస్వామికి అలవాటే. ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలను నేను ఇప్పటికే వెల్లడించా. ఈ వాచ్‌పై నా స్నేహితుడు ఇప్పటికే అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఆ వాచ్ నాది కాదు : ఇక ఈ వివాదంలో ముఖ్య వ్యక్తి అయిన డాక్టర్ సుధాకర్ శెట్టి ఈ అంశంపై స్పందించారు. ‘నేను నా భార్య ఇద్దరం డాక్టర్లమే. 35 ఏళ్లుగా విదేశాల్లో ఉంటూ కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాం. మా ఇంట్లో దొంగతనం జరిగి ఖరీదైన వాచ్‌లు పోయిన విషయం నిజమే. అయితే సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్, మా ఇంట్లో చోరీకి గురైన వాచ్ ఒకటే అనడంలో నిజం లేదని సుధాకర్ శెట్టి స్పష్టం చేశారు. -
మాజీ సీఎం కొడుకుతో పూరీ సినిమా
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. జెట్ స్పీడ్‌తో సినిమాను రెడీ చేసే పూరీ ఆ సినిమా పబ్లిసిటీ విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటాడు. సినిమాకు హైప్ క్రియేట్ చేయటం, హీరోయిజాన్ని కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయటం పూరీకి తెలిసినట్టుగా మరే దర్శకుడికి తెలియదేమో. అందుకే స్టార్ వారసులను ఇంట్రడ్యూస్ చేయడానికి పూరీనే బెస్ట్ ఛాయిస్‌గా ఫీల్ అవుతారు. ఇప్పటికే మెగా వారసుడు రామ్ చరణ్‌తో పాటు, శాండల్‌వుడ్ స్టార్హీరో రాజ్‌కుమార్ తనయుడు పునీత్ రాజ్‌కుమార్‌ను పరిచయం చేసిన పూరీ.. ఇప్పుడు మరో క్రేజీ హీరోను పరిచయం చేస్తున్నాడు. అయితే ఈసారి ఓ రాజకీయ నాయకుడి కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నాడు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. రానా హీరోగా నటించిన లీడర్ సినిమా రీమేక్ తోనే నిఖిల్ గౌడ హీరోగా పరిచయం కావాల్సి ఉన్నా, అప్పట్లో కుదరలేదు. దీంతో మాస్ హీరోగా ఎంట్రీ ఇద్దామని భావిస్తున్ననిఖిల్, పూరీ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లోఫర్ షూటింగ్లో బిజీగా ఉన్న పూరీ.. ఆ సినిమా పూర్తయిన తర్వాత నిఖిల్ గౌడ లాంచింగ్ సినిమా పని మొదలుపెట్టనున్నాడు. -
బీజేపీ గూటికి అబ్దుల్ అజీమ్!
5న అధికారిక చేరిక సాక్షి,బెంగళూరు: జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీమ్ భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. గత కొన్నినెలలుగా జేడీఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటు న్న ఆయన వచ్చేనెల 5న బీజేపీ పంచన చేరనున్నారు. ‘గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాను. ఎవరు మతవాదులనేది ఇన్నేళ్ల కాలంలో గుర్తించాను. అందుకే బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యాను’ అని అబ్దుల్ అజీమ్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా అబ్దుల్ అజీమ్ ఇప్పటికే అనేకసార్లు జేడీఎస్ పార్టీతో పాటు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అంతేకాదు కుమారస్వామి వైఖరిని నిరసిస్తూ బహిరంగ లేఖ లు కూడా రాస్తూ వచ్చారు. అయినా జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అబ్దుల్ అజీమ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా కాలం గా అబ్దుల్ అజీమ్ జేడీఎస్‌ని వీడనున్నారనే వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఈ విషయాన్ని అజీమ్ ధృవీకరించలేదు. కాగా బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా సమ్మతించడంతో పాటు బీజేపీ కోర్‌కమిటీ కూడా అబ్దుల్ అజీమ్ చేరికకు ఆమోదం తెలపడంతో ఆయన ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ధృవీకరించినట్లు సమాచారం. జేడీఎస్‌కు అధికారికంగా తన రాజీనామాను అందజేసిన అనంతరం వచ్చేనెల 5న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి సమక్షంలో అబ్దుల్ అజీమ్ కమలదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీ సమావేశాలు నడిపేందుకు ప్రభుత్వం వెనకడుగు....
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని చర్చించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి మండిపడ్డారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సైతం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. హాసనలోని హాసనాంబ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గృహనిర్మాణ సహకార సంఘానికి చెందిన ఇళ్ల పంపిణీలో తాను అక్రమాలకు పాల్పడ్డానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపితే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని, స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై విమర్శలు చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నభాగ్య పధకం పూర్తిగా విఫలమైందని, అన్నభాగ్య పథకం పూర్తిగా ధనవంతులు, దళారులకు ప్రయోజనాలు చేకూరుస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. డి.కె.శివకుమార్ అద్దాల మేడలో కూర్చున్నారని, అక్రమంగా ఆస్తులను సంపాదించడంతో పాటు ఆ సంపదతో మంత్రి పదవిని కూడా పొందారని మండిపడ్డారు. అదే సందర్భంలో దేవెగౌడ కుటుంబం అద్దాల మేడలో లేదని, వీధుల్లో సామాన్య ప్రజలతోనే వారి సమస్యలను చర్చిస్తూ ఉందని అన్నారు. జేడీఎస్‌లో 11 మంది సభ్యులతో ఒక కోర్ కమిటీని రూపొందించామని, మరో రెండు మూడు రోజుల్లో కోర్ కమిటీలోని సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కోర్ కమిటీని ప్రకటించిన అనంతరం జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం జేడీఎస్ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. అందువల్ల త్వరలోనే జేడీఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో కలిసి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. -
గడ్డుకాలం...
సాక్షి, బెంగళూరు : ప్రస్తుతం జేడీఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. నాయకుల మధ్య భేదాబిప్రాయాలు ఉన్నమాట వాస్తవమని వాటిని కొలిక్కి తెచ్చే సామర్థ్యం తనకుందన్నారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ బృహత్ సమావేశంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయడానికి అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యక్షంగానే జేడీఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్‌లో చేరమని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటినీ నిషిత దృష్టితో గమనిస్తున్నానన్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ వయసులో కూడా పార్టీని పటిష్ట పరిచే సామర్థ్యం తనకుందన్నారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉన్నవారు తనతో పాటు ఉండవచ్చునని లేదా పార్టీని వదిలీ ఇతర పార్టీలోకి వెళ్లవచ్చునని పునరుద్ఘాటించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకుడు రేవణ్ణ ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమన్నారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కుమారస్వామి కాంగ్రెస్‌లో చేరుతున్నారని పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జేడీఎస్ కుటుంబ పార్టీ అనే అపవాదును పోగొట్టడానికి ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఇదే వేదికపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంలో సిద్ధరామయ్య ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. పార్టీలోని అందరి నాయకులను కలుపుకుని పోయి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని కుమారస్వామి చెప్పుకొచ్చారు. వేదిక నుంచి దిగిపోయిన జేడీఎస్ నాయకులు దేవెగౌడ ప్రసంగం తర్వాత వేదికపై ఉన్న పలువురు నాయకులు మాట్లాడటానికి పోటీ పడ్డారు. ఒకరి చేతిలో ఉన్న మైకును మరొకరు బలవంతంగా లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది. దీంతో నొచ్చుకున్న పార్టీ సీనియర్ నాయకులు ఎం.సి.నాణయ్య, పుట్టణ్ణ, రేవణ్ణ వేదిక దిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా వేదిక కింద ఉన్న ఓ కార్యకర్త మైకును తీసుకుని ‘ఇతర పార్టీలోకి వెళ్లే వారి విషయం కాదు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న వారిపై దృష్టి సారించండి. బ్యాటరాయణపుర, యశ్వంతపుర నియోజక వర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ.’ అంటూ గట్టిగా మాట్లాడుతుండంగానే మరో నాయకుడు అతని వద్ద నుంచి మైకును లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కల్పించుకున్న దేవెగౌడ ‘ఇలాంటి కార్యకర్తలే కావాలి. అతని వద్దమైకును బలవంతంగా తీసుకోకండి. ఇలా చేస్తే మన మధ్య విభేదాలు బయటపడ్డాయనే మీడియా వాఖ్యానిస్తుంది.’ అని పేర్కొన్నారు. తర్వాత కుమారస్వామితో పాటు పలువురు నాయకులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో వేదిక పై నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. -
నేను కరెక్ట్‌గానే ఉన్నా
కేపీఎస్సీ-11 నియామకాల రద్దుపై సీఎం ఉప ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా సాక్షి, బళ్లారి : కేపీఎస్సీ-11 నియామకాల రద్దుపై తాను కచ్చితంగా వ్యవహరిస్తున్నానని, తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. పనిపాట లేక మాజీ సీఎం కుమారస్వామి ఈ విషయాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం మాజీ ఎమ్మెల్యే నారా సూర్య నారాయణరెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2011 సంవత్సరంలో జరిగిన కేపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సీఐడీ నివేదిక ఇవ్వడంతోనే నియామకాలు రద్దు చేసిననట్లు ప్రకటించామని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వేసుకునే వచ్చే నేతలను ఏమనాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో బళ్లారితో పాటు సదలిగి, శికారిపుర ఉప ఉన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. బళ్లారిలో కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని, దీనికితోడు బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి పార్టీలోకి చేరడం అభ్యర్థుల విజయవకాశాలను మెరుగు పరుస్తుందన్నారు. బోరుబావిలో పడిన బాలుడు తిమ్మణ్ణను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. దురదృష్టవశాత్తు బాలుడు ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఈ ఘటనకు సంబంధించి సస్పెండ్ అయిన అధికారులను తిరిగి నియమించే విషయమై పోలీసుల నివేదిక అందిన తర్వాత పరిశీలిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వర, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.