సీఎం వాచీ చోరీకి గురైనదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన వాచీ రూ.70లక్షలు విలువ చేసేదంటూ రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మరో బాంబ్ పేల్చారు. ఆ వాచీ ఇంతకుముందు చోరీకి గురైందని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి ఇంట్లో చోరీకి గురైన వాచ్, సిద్ధరామయ్య ధరిస్తున్న లగ్జరీ వాచ్ ఒకేలా ఉన్నాయంటూ సుధాకర్ శెట్టి స్నేహితుడొకరు తనకు స్వయంగా చెప్పారంటూ వెల్లడించారు. అయితే సుధాకర్ శెట్టి మాత్రం ఇందులో నిజం లేదని, తన ఇంట్లో చోరీకి గురైనవాచ్, సీఎం సిద్ధరామయ్య వద్ద ఉన్న వాచ్ వేర్వేరని చెబుతున్నారు.
విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ....‘నేను సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన సందర్భంలో మీడియాలో ఆ వాచ్‌ను చూసిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి తన స్నేహితుని ద్వారా నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్ తన ఇంట్లో చోరీకి గురైన వాచ్ అని, స్వయంగా కలిసి అన్ని వివరాలను చెబుతానని అన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేశారు. ఈ విషయంలోకి తనను లాగవద్దని అంటున్నారు. అయినా నేను ఆయనకు ధైర్యం చెప్పాను. 2015 జూలై 7న బెంగళూరులోని కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ శెట్టి తన ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రెండు రోలెక్స్ వాచ్‌లు, ఓ వజ్రాలు పొదిగిన వాచ్‌తో పాటు కొన్ని బంగారు, వజ్ర ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు’ అని వివరించారు. ఇక లగ్జరీ వాచ్ విషయమై సీఎం సిద్ధరామయ్య చెబుతున్న మాటలు కట్టు కథల్లా అనిపిస్తున్నాయని విమర్శించారు. నిజంగానే సిద్ధరామయ్య ప్రాణస్నేహితుడు ఆ వాచ్‌ను బహూకరించి ఉంటే ఆ విషయం చెప్పడానికి సీఎం ఇన్ని రోజులు ఎందుకు వేచి చూశారంటూ కుమారస్వామి ప్రశ్నించారు.
కుమారస్వామిది దిగజారుడు రాజకీయం
కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కుమారస్వామి పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ఏవో ఆరోపణలు చేయడం కుమారస్వామికి అలవాటే. ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలను నేను ఇప్పటికే వెల్లడించా. ఈ వాచ్‌పై నా స్నేహితుడు ఇప్పటికే అఫిడవిట్ కూడా ఇచ్చారు.
ఆ వాచ్ నాది కాదు : ఇక ఈ వివాదంలో ముఖ్య వ్యక్తి అయిన డాక్టర్ సుధాకర్ శెట్టి ఈ అంశంపై స్పందించారు. ‘నేను నా భార్య ఇద్దరం డాక్టర్లమే. 35 ఏళ్లుగా విదేశాల్లో ఉంటూ కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాం. మా ఇంట్లో దొంగతనం జరిగి ఖరీదైన వాచ్‌లు పోయిన విషయం నిజమే. అయితే సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్, మా ఇంట్లో చోరీకి గురైన వాచ్ ఒకటే అనడంలో నిజం లేదని సుధాకర్ శెట్టి స్పష్టం చేశారు.