- 5న అధికారిక చేరిక
సాక్షి,బెంగళూరు: జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీమ్ భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. గత కొన్నినెలలుగా జేడీఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటు న్న ఆయన వచ్చేనెల 5న బీజేపీ పంచన చేరనున్నారు. ‘గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాను. ఎవరు మతవాదులనేది ఇన్నేళ్ల కాలంలో గుర్తించాను. అందుకే బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యాను’ అని అబ్దుల్ అజీమ్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కాగా అబ్దుల్ అజీమ్ ఇప్పటికే అనేకసార్లు జేడీఎస్ పార్టీతో పాటు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అంతేకాదు కుమారస్వామి వైఖరిని నిరసిస్తూ బహిరంగ లేఖ లు కూడా రాస్తూ వచ్చారు. అయినా జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అబ్దుల్ అజీమ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా కాలం గా అబ్దుల్ అజీమ్ జేడీఎస్‌ని వీడనున్నారనే వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఈ విషయాన్ని అజీమ్ ధృవీకరించలేదు.
కాగా బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా సమ్మతించడంతో పాటు బీజేపీ కోర్‌కమిటీ కూడా అబ్దుల్ అజీమ్ చేరికకు ఆమోదం తెలపడంతో ఆయన ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ధృవీకరించినట్లు సమాచారం. జేడీఎస్‌కు అధికారికంగా తన రాజీనామాను అందజేసిన అనంతరం వచ్చేనెల 5న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి సమక్షంలో అబ్దుల్ అజీమ్ కమలదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది.