దళంలో అసమ్మతి గళం
జేడీఎస్‌లో పెరుగుతున్న విభేదాలు
కార్యకర్తల నిర్ణయానికి బద్ధుడినౌతానన్న
బసవరాజ్ హొరట్టి
పార్టీ పదవులేవీ చేపట్టబోనన్న
జమీర్ అహ్మద్
బెంగళూరు : జేడీఎస్‌లో అసమ్మతి స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్టీ అధినాయకత్వం తమకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇదే విధమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అబ్దుల్ అజీమ్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో జేడీఎస్ ఎమ్మె ల్సీ బసవరాజ్ హొరట్టి కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుబ్లీలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బసవరాజ్ హొరట్టి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. జేడీఎస్‌ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా హుబ్లీలో ఆదివారం జేడీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి మాట్లాడుతూ...‘పార్టీలో నా మాటకు అసలు గౌరవమే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నా సూచనలు పాటిం చలేదు. పార్టీ అధినాయకత్వం మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం ఏం చేయాలనేది కార్యకర్తలే నిర్ణయిస్తారు. కార్యకర్తల నిర్ణయమేదైనా అందుకు బద్ధుడినౌతాను’ అని పేర్కొన్నారు. దీంతో బసవరాజ్ హొరట్టి కూడా పార్టీ వీడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
పార్టీ పదవులేవీ చేపట్టను...
ఇక జేడీఎస్ నేత కుమారస్వామితో ఎప్పటికప్పుడు విభేదిస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆదివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జమీర్ అహ్మద్ మాట్లాడుతూ....‘నేను జేడీఎస్ పార్టీ వీడను. ఈ పార్టీ కేవలం కుమారస్వామి కష్టంతో ఏర్పాటైన పార్టీ కాదు, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు జేడీఎస్ కార్యకర్తలందరి కష్టంతో ఈ పార్టీ అభివృద్ధి చెందింది. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనను. అంతేకాదు పార్టీ పదవులేవీ చేపట్టను కూడా’ అని వెల్లడించారు. అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీలో ఎంత కాలం కొనసాగుతారనేది రాజకీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.