ముందేనా!
♦ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల శకునాలు
♦ ‘ఉప’ గెలుపుతో కాంగ్రెస్‌లో ఊపు
♦ సై అంటున్న బీజేపీ
♦ జేడీఎస్‌కు దగ్గరగా హస్తం
షెడ్యూల్ ప్రకారమైతే 2018 మే లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ వేసవితో సంబంధం లేకుండా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏడాది వరకు ఆగడం కంటే ముందే ఎదురెళ్లి అధికార కాంతను వరిద్దామని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష బీజేపీ రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కసరత్తు జరుగుతోందా? ఇందుకు పార్టీలకు అతీతంగా నాయకులందరూ సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలతో ఈ దిశగా రాష్ట్ర రాజకీయాలు ప్రయాణిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుండ్లుపేట, నంజనగూడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో హస్తం నాయకులు ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య మంచి ఊపు మీద ఉన్నారు. రానున్న శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని ఆయనే నడిపించారు. ఫలితాలతో... తమ సర్కారుపై అంత ప్రజా వ్యతిరేకత లేదని తేలినట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ అధికారం తథ్యమని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తాను వచ్చే ఎన్నికల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పిన సిద్ధరామయ్య తిరిగి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా తానే సీఎం అని ప్రకటించుకున్నారు. అధిష్టానం అంగీకరిస్తే 2018 మే పోలింగ్‌కు బదులుగా ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులోనే సిద్ధు శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లవచ్చని విశ్లేషకుల భావన.
పీసీసీ పీఠానికి డిమాండ్
ఇక ముందస్తు ఎన్నికల వ్యూహాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎప్పుడూ లేని విధంగా తీవ్ర పై పోటీ నెలకొంది. ‘టికెట్ల పంపకం సమయంలో అన్ని విధాలుగా లాభపడవచ్చు’ అన్న విషయం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌గా ఆరేళ్లు పూర్తి చేసిన పరమేశ్వర్ ఇంకా కొనసాగడానికి అవసరమైతే హోం మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలు ముందస్తు ఎన్నికలు రావచ్చొనదానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కమలనాథుల కసరత్తు
భారతీయ జనతా పార్టీకి దక్షిణ పథాన బలం ఉన్న రాష్ట్ర కర్ణాటకనే. ఒకటి రెండుసార్లు అధికార పీఠం చేపట్టింది కూడా. ఈసారి పూర్తిబలంతో ఉత్తరప్రదేశ్ తరహాలో కైవసం చేసుకోవాలని బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు ఆరునెలల ముందు పంచాయతీ స్థాయిల్లో పార్టీ పరిస్థితి పై రహస్య నివేదికను పార్టీ అధినేత అమిత్‌షా తెప్పించుకున్నారు. అదే ఇక్కడా చేస్తున్నారు. చివరికి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పకు కూడా సదరు సమాచారం చేరకూడదన్న కఠిన ఆదేశాలతో పార్టీ స్థితిపై నివేదిక సిద్ధం అవుతోంది.
స్థానిక నాయకుల ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వొచ్చో, ఇప్పటి వరకూ స్థానికంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన నాయకులు 30 పాయింట్ల నివేదికను ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇక ముందుస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇతర పార్టీలకు చెందిన చాలా మంది విపక్షబీజేపీలోకి చేరి రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు.కాంగ్రెస్, బీజేపీలు రెండు సోషల్ మీడియాలోనూ ముమ్మర ప్రచారం చేపట్టాయి.
జేడీఎస్‌తో కాంగ్రెస్ దోస్తీ
శత్రువుకు శత్రువు మిత్రుడన్న విషయం తెలిసిందే. బీజేపీ అంటే పడని జేడీఎస్‌తో కాంగ్రెస్ సఖ్యత కనబరుస్తోంది. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడలు ఇప్పటికే రెండుసార్లు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాను మరో నెలరోజుల్లోపు విడుదల చేయనున్నట్లు జేడీఎస్ చెప్పడానికి కారణం ముందస్తు ఎన్నికలను ఊహించబట్టే. 2018లో రావాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖరుకు వచ్చినా ఆశ్చర్యంలేదని తెలుస్తోంది.