దళ్‌కు చుక్కెదురు !
మండలి ఎన్నికల్లో రెండో అభ్యర్థి పరాజయం
కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు బాహాటంగా ప్రకటించిన జేడీఎస్ ఎమ్మెల్యే
నాలుగు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్
రెండో ప్రాధాన్యత ఓటుతో రెండు స్థానాలు గెలుచుకున్న బీజేపీ
‘దళం’లో మండలి చిచ్చు !
క్రాస్ ఓటింగ్‌పై మథనం
బెంగళూరు : రాష్ట్ర శాసనసభ నుంచి శాసన మండలికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి చుక్కెదురైంది. ఆ పార్టీ ఎన్నికల బరిలో దించిన ఇద్దరు అభ్యర్థుల్లో కేవలం ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. అంతేకాకుండా రెండో అభ్యర్థికి జేడీఎస్ నాయకులే ఓటు వేయకపోవడం గమనార్హం. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తర ఫున ఎన్నికల బరిలో నలుగురు గెలుపొందగా, ప్రధాన విపక్ష భారతీయ జనతా పార్టీ కూడా తన ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకుంది. శాసనసభ నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులకు కనీసం 29 ఓట్లు రావాల్సి ఉంది. ఈ లెక్కన జేడీఎస్ పార్టీ అసెంబ్లీలో తనకు గల ఎమ్మెల్యేల సంఖ్యాబలం (40) అనుసరించి కేవలం ఒక్క అభ్యర్థిని మాత్రమే గెలిపించుకోవడానికి అవకాశం ఉంది. అయితే పార్టీ తరఫున నారాయణస్వామితో పాటు వెంకటపతిని రెండో అభ్యర్థిగా శాసనమండలి ఎన్నికల్లో బరిలో దించింది. కాగా, శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఆ పార్టీ మొదటి అభ్యర్థి నారాయణస్వామి 30 ఓట్లు పొంది గెలుపు సాధించారు.
అయితే రెండో అభ్యర్థి అయిన డాక్టర్ వెంకటపతికి కేవలం ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో జేడీఎస్ పార్టీలో మొదటి అభ్యర్థికి పోను మిగిలిన 10 ఓట్లు అయినా రెండో అభ్యర్థికి పడలేదని స్పష్టమవుతోంది. దీంతో ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఓటింగ్ అనంతరం జేడీఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు జమీర్ అహ్మద్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ‘నా ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ హర్షద్ వేశాను. ఈ విషయమై మా పార్టీ ఏ చర్యతీసుకున్నా నేను సిద్ధమే. నాతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మరో నలుగురి విషయం నాకు తెలియదు.’ అని చెప్పడం ఇక్కడ గమనార్హం. మొత్తంగా శాసనసభ నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో దళం రెండో అభ్యర్థి ఓడిపోయి ఆ పార్టీకి చుక్కెదురు కావడమే కాకుండా దళంలో నివురుగప్పి ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటపడినట్లైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నాలుగు స్థానాలు ‘హస్త’గతం...
శాసనమండలిలో నామినేటెడ్ ఎమ్మెల్యే, స్పీకర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ లెక్కన ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తనకు ఉన్న సంఖ్యా బలాన్ని (124) అనుసరించి పార్టీ అభ్యర్థులుగా అల్లం వీరభద్రప్ప, ఆర్.బీ తిమ్మాపుర, వీణా అచ్చయ్య, రిజ్వాన్ హర్షద్‌ను ఎన్నికల బరిలో దించిన విషయం తెలిసిందే. శాసనమండలి అభ్యర్థులకు కనీసం 29 ఓట్లు రావాల్సి ఉండగా వీరు నలుగురూ వరుసగా 32, 33, 31,34 ఓట్లను పొంది గెలుపొందారు. వీరికి వచ్చినఓట్లను అనుసరించి ఆ పార్టీ శాసనసభ్యులతో పాటు ఇతర పార్టీలతో పాటు కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసినట్లు తెలుస్తోంది.
రెండో ప్రాధాన్యత ఓటుతో కమల వికాసం... శాసనమండలిలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం 44. దీంతో ఆ పార్టీ సొంత బలంతో కేవలం ఒక్క అభ్యర్థిని గెలుపించుకోవ డానికి వీలవుతుంది. అయితే కమలం నాయకులు సోమణ్ణతో పాటు లెహర్‌సింగ్ రెండో అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించారు. వీరిలో సోమణ్ణకు 31 ఓట్లు రాగా లెహర్‌సింగ్‌కు మొదటి ప్రాధాన్యతగా 27 ఓట్లు వచ్చాయి. అయితే ఆయకు పోటీగా నిలిచిన వెంకటపతితో పోలిస్తే ఎక్కువగా రెండో ప్రాధాన్యత ఓట్లు రావడం వల్ల కమలం రెండో అభ్యర్థి లెహర్‌సింగ్ రెండోప్రాధాన్యత ఓటుతో గట్టెక్కి రెండోసారి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. కాగా, మొత్తం 225 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అందులో రిజ్వాన్‌హర్షద్, నారాయణస్వామికి పోలైన మొత్తం ఓట్లలో చెరొక ఓటు చెల్లుబాటుకాలేదు. దీంతో మిగిలిన 223 ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓట్లగా పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులకు కలిపి 130 ఓట్లు పడగా బీజేపీ 58 ఓట్లు, జేడీఎస్‌కు 35 ఓట్ల పడ్డట్టు స్పష్టమవుతోంది.