Abdul Azim
-
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు. -
కుబ్రా కుటుంబానికి అండగా ఉంటాం
రాయదుర్గం: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురానికి చెందిన కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుబ్రా తల్లిదండ్రులు అబ్దుల్ అజీమ్, షాహిదా, సోదరుడు అబ్దుల్ ఖలీద్‌లను కలిశారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కుబ్రా కుటుంబానికి జీహెచ్ఎంసీ అం డగా ఉంటుంది. వైద్య ఖర్చులన్నీ భరిస్తాం. ఆమె ఆరో గ్య పరిస్థితిని డిప్యూటీ, జోనల్ కమిషనర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సర్జరీ తర్వాత డిశ్చార్జీ అయ్యాక 2 నెలలు పర్యవేక్షించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాం’అని అన్నారు. అందరికీ కృతజ్ఞతలు ‘పెయింటింగ్ చేస్తూ ఎంతో కష్టపడి నా ఇద్దరు పిల్లలను చదివించాను. నా కూతురు ప్రమాదంలో గాయపడటం మమ్మల్ని కలచివేసింది. మేం పేదోళ్లం. చికిత్సకయ్యే వ్యయాన్ని భరించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, నగర మేయర్ భరోసా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని కుబ్రా తండ్రి అన్నారు. ఆదుకునేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. కుబ్రా తల్లిదండ్రులను కడప జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం పరామర్శించారు. రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో ఇద్దరు నేతలు హైదరాబాద్‌కు చెందిన బీబీజీ కంపెనీ ద్వారా అజీమ్‌కు ఆర్థిక సాయం చేశారు. -
రూపాయి లేదు..వైద్యమెలా!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: కష్టాలు, కన్నీళ్లు దిగమింగి బీటెక్ పూర్తి చేసిందామె. ఏడాది క్రితమే అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చి ఎస్సార్ నగర్ హాస్టల్లో ఉంటూ ఓ వైపు ప్రత్యేక కోర్సులు, మరోవైపు ఇంటర్వూ్యలకు హాజరవుతూ అదృష్టా న్ని పరీక్షించుకుంటోంది. శనివారం ఓ కంపెనీ ఇంటర్వూ్యకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. ఇది శనివారం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) దుస్థితి. ప్రసుత్తం ఆమె గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వద్ద కుబ్రా తల్లిదండ్రులు చేతిలో రూపాయి లేక విలవిల.. అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం తండ్రి అబ్దుల్ అజీం. పెయింటర్‌గా సాదాసీదా జీవనం సాగిస్తూ కూతురు కుబ్రాతో పాటు కుమారుడు కాలిఖ్ను ఉన్నత చదువులు చదివించాడు. ఆయన సంపాదనంతా పిల్లల చదువులు, జీవనోపాధికే సరిపోయింది. ప్రమాదం గురించి తెలియగానే కుబ్రా తండ్రి, తల్లి, సోదరుడు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నగ రానికి చేరుకున్న కుబ్రా తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం రూ.లక్షా పది వేలు అయ్యాయని చెప్పారు. కుబ్రాకు ఒళ్లంతా గాయాలున్నాయని, ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని, చెల్లిస్తే మిగతా వైద్యం చేస్తామని తెలిపారు. అప్పటికే హైదరాబాద్‌లోని సమీప బంధువుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఫీజు చెల్లించిన అబ్దుల్ రూ.5 లక్షల కోసం తనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశాడు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రి ఎదుటే భార్య, కుమారుడితో విషాదంగా గడిపేశాడు. చేతిలో రూపాయి లేక కుబ్రాకు వైద్యం ఎలా చేయిం చాలో తెలియక సతమతమవుతున్నాడు. కుబ్రాను ఆస్పత్రిలో చేర్చించిన పోలీసులు ఆపై అటు కన్నెత్తి చూడలేదని వారు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కుబ్రా సోదరుడు ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాము నిరుపేదలమని, రూ.5 లక్షలు చెల్లించే స్థోమత తమకు లేదని తన అక్క ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను వేడుకున్నాడు. -
దళంలో అసమ్మతి గళం
జేడీఎస్‌లో పెరుగుతున్న విభేదాలు కార్యకర్తల నిర్ణయానికి బద్ధుడినౌతానన్న బసవరాజ్ హొరట్టి పార్టీ పదవులేవీ చేపట్టబోనన్న జమీర్ అహ్మద్ బెంగళూరు : జేడీఎస్‌లో అసమ్మతి స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్టీ అధినాయకత్వం తమకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇదే విధమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అబ్దుల్ అజీమ్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో జేడీఎస్ ఎమ్మె ల్సీ బసవరాజ్ హొరట్టి కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుబ్లీలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బసవరాజ్ హొరట్టి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. జేడీఎస్‌ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా హుబ్లీలో ఆదివారం జేడీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి మాట్లాడుతూ...‘పార్టీలో నా మాటకు అసలు గౌరవమే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నా సూచనలు పాటిం చలేదు. పార్టీ అధినాయకత్వం మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం ఏం చేయాలనేది కార్యకర్తలే నిర్ణయిస్తారు. కార్యకర్తల నిర్ణయమేదైనా అందుకు బద్ధుడినౌతాను’ అని పేర్కొన్నారు. దీంతో బసవరాజ్ హొరట్టి కూడా పార్టీ వీడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీ పదవులేవీ చేపట్టను... ఇక జేడీఎస్ నేత కుమారస్వామితో ఎప్పటికప్పుడు విభేదిస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆదివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జమీర్ అహ్మద్ మాట్లాడుతూ....‘నేను జేడీఎస్ పార్టీ వీడను. ఈ పార్టీ కేవలం కుమారస్వామి కష్టంతో ఏర్పాటైన పార్టీ కాదు, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు జేడీఎస్ కార్యకర్తలందరి కష్టంతో ఈ పార్టీ అభివృద్ధి చెందింది. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనను. అంతేకాదు పార్టీ పదవులేవీ చేపట్టను కూడా’ అని వెల్లడించారు. అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీలో ఎంత కాలం కొనసాగుతారనేది రాజకీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. -
బీజేపీ గూటికి అబ్దుల్ అజీమ్!
5న అధికారిక చేరిక సాక్షి,బెంగళూరు: జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీమ్ భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. గత కొన్నినెలలుగా జేడీఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటు న్న ఆయన వచ్చేనెల 5న బీజేపీ పంచన చేరనున్నారు. ‘గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాను. ఎవరు మతవాదులనేది ఇన్నేళ్ల కాలంలో గుర్తించాను. అందుకే బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యాను’ అని అబ్దుల్ అజీమ్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా అబ్దుల్ అజీమ్ ఇప్పటికే అనేకసార్లు జేడీఎస్ పార్టీతో పాటు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అంతేకాదు కుమారస్వామి వైఖరిని నిరసిస్తూ బహిరంగ లేఖ లు కూడా రాస్తూ వచ్చారు. అయినా జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అబ్దుల్ అజీమ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా కాలం గా అబ్దుల్ అజీమ్ జేడీఎస్‌ని వీడనున్నారనే వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఈ విషయాన్ని అజీమ్ ధృవీకరించలేదు. కాగా బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా సమ్మతించడంతో పాటు బీజేపీ కోర్‌కమిటీ కూడా అబ్దుల్ అజీమ్ చేరికకు ఆమోదం తెలపడంతో ఆయన ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ధృవీకరించినట్లు సమాచారం. జేడీఎస్‌కు అధికారికంగా తన రాజీనామాను అందజేసిన అనంతరం వచ్చేనెల 5న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి సమక్షంలో అబ్దుల్ అజీమ్ కమలదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది. -
అబ్దుల్ అజీమ్ 8/8
జింఖానా, న్యూస్‌లైన్: అపెక్స్ సీసీ జట్టు బౌలర్ అబ్దుల్ అజీమ్ (8/8) తన బౌలింగ్‌తో రుషిరాజ్ జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 106 పరుగుల తేడాతో రుషిరాజ్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అపెక్స్ సీసీ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సయ్యద్ జావిద్ అలీ (67), సయ్యద్ పాషా అలీ (60) అర్ధ సెంచరీలతో రాణించారు. రుషిరాజ్ బౌలర్ మహ్మద్ అలీమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రుషిరాజ్... అజీమ్ ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. మల్లికార్జున్ (45) మినహా మిగిలినవారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జట్టు బ్యాట్స్‌మన్ సుందర్ (106 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో యంగ్ సిటిజన్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. వికాస్ (103) సెంచరీతో చెలరేగగా... రతన్ (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. గ్రీన్‌ల్యాండ్స్ బౌలర్ శ్రీచరణ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన గ్రీన్‌ల్యాండ్స్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. యంగ్ సిటిజన్ బౌలర్ కరణ్ 5 వికె ట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు సత్యం సీసీ: 189/8 (నరేష్ 35; శ్రీనివాస్ 4/45); కాంకార్డ్: 132 (శ్రీనివాస్ 45, అక్బర్ 43; విశ్వనాథ్ 5/16). అభినవ్ కోల్ట్స్: 179 (అషీర్ 37; సతీష్ 4/46); ఎంపీ బ్లూస్: 183/5 (శ్రీనివాస్ 40, సతీష్ 40 నాటౌట్). పీఎన్ యంగ్‌స్టర్స్: 146/7 (సులేమాన్ 4/33); మహావీర్: 147/7 (రాజ్‌కిరణ్ 34, విజేందర్ 52). విక్టర్: 136 (శ్రవణ్ 3/40); రోహిత్ ఎలెవన్: 139/5 (సాయిరామ్ 35, రణ్‌జీత్ 51 నాటౌట్; భాను కుమార్ 5/40). ఎంపీ యంగ్మెన్స్: 130 (విజయ్ 3/15); పీకేసీసీ: 93 (నితిన్ 4/40, ఉదయ్ 3/15). సెయింట్ మేరీస్: 70 (తరుణ్ 3/40); యూత్ సీసీ: 71/1 (అరుణ్ 39). కల్నల్ అక్రిలిక్: 85 (బషీర్ 6/44); షాలిమార్: 89/5 (అల్తాఫ్ 3/10). -
పెదలంక డ్రెయిన్ కేసులో అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
నసాక్షి, విజయవాడ : పెదలంక డ్రెయిన్ అక్రమాల అంశంలో వేటు పడిన అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పనులు చేయకుండానే పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టిన వ్యవహారంలో నలుగురు అధికారులను ఈ ఏడాది మే ఐదున సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.చక్రధరం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ అజీమ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్ ఉమాశంకర్, ఎస్ రామకృష్ణారావులను సస్పెండ్ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఈఈ ఎల్ చక్రధరం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణారావు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వీరిని తిరిగి సర్వీస్‌లోకి తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరిని నాన్ ఫోకల్ పోస్టులలో నియమించాలని ఆదేవించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో కృత్తివెన్ను మండలం పెదలంక డ్రెయిన్‌కు చేసిన పనుల కన్నా ఎక్కువ పనులు చేసినట్లు చూపుతూ మార్చి నెలలో బిల్లులు పెట్టారు. ఐదున్నర కిలోమీటర్ల మేర కాల్వ పూడికతీత పనులు చేసినట్లుగా చూపుతూ 11.45 కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టారు. అయితే క్షేత్ర స్థాయిలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల లోపే పనులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు (ఈఎన్సీ) విచారణకు ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన బీవీఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పెదలంక డ్రెయిన్‌లో డ్రెడ్జింగ్ (పూడిక తీత) పనులను జనవరిలో ప్రారంభించింది. మార్చి 15 నాటికే 11.45 కోట్ల రూపాయల పనులు చేసినట్లుగా బిల్లులు పెట్టారు. ఇది 10 కిలోమీటర్లు పొడవున పని జరగాల్సి ఉంది. మొత్తం రూ.21.32 కోట్ల అంచనాతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అర కిలోమీటరు మాత్రమే పని పూర్తిగా జరిగిందని, కేవలం మూడు కిలోమీటర్లు పొడవున మాత్రమే పని మొదలుపెట్టారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. అయితే ఐదు కిలోమీటర్లు పని జరిగినట్లు రూ.11.45 కోట్లు బిల్లులు పెట్టారు. కాంట్రాక్టర్ నుంచి వచ్చిన బిల్లులను అధికారులు గుడ్డిగా సర్కిల్‌కు పంపించడం వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీనియర్ టెక్నికల్ టీమ్‌ను విచారణ కోసం పంపించాలని ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశించింది. ఈ టీమ్ వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించడంతో వీరిపై వేటుపడింది.