నసాక్షి, విజయవాడ : పెదలంక డ్రెయిన్ అక్రమాల అంశంలో వేటు పడిన అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పనులు చేయకుండానే పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టిన వ్యవహారంలో నలుగురు అధికారులను ఈ ఏడాది మే ఐదున సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.చక్రధరం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ అజీమ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్ ఉమాశంకర్, ఎస్ రామకృష్ణారావులను సస్పెండ్ చేశారు.
దీన్ని సవాలు చేస్తూ ఈఈ ఎల్ చక్రధరం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణారావు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వీరిని తిరిగి సర్వీస్‌లోకి తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరిని నాన్ ఫోకల్ పోస్టులలో నియమించాలని ఆదేవించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో కృత్తివెన్ను మండలం పెదలంక డ్రెయిన్‌కు చేసిన పనుల కన్నా ఎక్కువ పనులు చేసినట్లు చూపుతూ మార్చి నెలలో బిల్లులు పెట్టారు.
ఐదున్నర కిలోమీటర్ల మేర కాల్వ పూడికతీత పనులు చేసినట్లుగా చూపుతూ 11.45 కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టారు. అయితే క్షేత్ర స్థాయిలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల లోపే పనులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు (ఈఎన్‌సీ) విచారణకు ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన బీవీఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పెదలంక డ్రెయిన్‌లో డ్రెడ్జింగ్ (పూడిక తీత) పనులను జనవరిలో ప్రారంభించింది. మార్చి 15 నాటికే 11.45 కోట్ల రూపాయల పనులు చేసినట్లుగా బిల్లులు పెట్టారు.
ఇది 10 కిలోమీటర్లు పొడవున పని జరగాల్సి ఉంది. మొత్తం రూ.21.32 కోట్ల అంచనాతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అర కిలోమీటరు మాత్రమే పని పూర్తిగా జరిగిందని, కేవలం మూడు కిలోమీటర్లు పొడవున మాత్రమే పని మొదలుపెట్టారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. అయితే ఐదు కిలోమీటర్లు పని జరిగినట్లు రూ.11.45 కోట్లు బిల్లులు పెట్టారు. కాంట్రాక్టర్ నుంచి వచ్చిన బిల్లులను అధికారులు గుడ్డిగా సర్కిల్‌కు పంపించడం వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ప్రభుత్వం సీనియర్ టెక్నికల్ టీమ్‌ను విచారణ కోసం పంపించాలని ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశించింది. ఈ టీమ్ వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించడంతో వీరిపై వేటుపడింది.
పెదలంక డ్రెయిన్ కేసులో అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
Published Sat, Dec 7 2013 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement