దళానికి షాక్ ! | Dalani a shock! | Sakshi
Sakshi News home page

దళానికి షాక్ !

Published Sun, Jun 12 2016 1:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Dalani a shock!

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ   ఎనిమిది మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు
ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ఎం.ఫరూక్ ఓటమి
కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులు,  బీజేపీ అభ్యర్థికి విజయమాల

 

బెంగళూరు: రాష్ట్ర శాసనసభ నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాభవం నుంచి తేరుకోకముందే రాజ్యసభ ఎన్నికల్లో సైతం దళం నాయకత్వానికి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటెయ్యడం ద్వారా ధిక్కారస్వరం వినిపించారు. దీంతో జేడీఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎం. ఫారూక్ ఓటమిని చవిచూశారు. కర్ణాటక శాసనసభ నుంచి రాజ్యసభలోని నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ మాజీ కేంద్ర మంత్రులు ఆస్కార్‌ఫెర్నాండెజ్, జైరాంరమేష్‌లతో పాటు మూడో అభ్యర్థిగా కే.సీ రామమూర్తిని అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దించగా ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, జేడీఎస్ నుంచి పారిశ్రామిక వేత్త ఎం. ఫరూక్ పోటీపడిన విషయం తెలిసిందే. రాష్ట్రశాసన సభ నుంచి నామినేట్ అయిన ఎమ్మెల్యే మినహా మిగిలిన 224 మంది రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దీంతో రాజ్యసభ అభ్యర్థి కనీసం 45 ఓట్లు పొందితేనే గెలుపు సాధ్యమవుతుంది. ఇక శనివారం జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన ఆస్కార్‌ఫెర్నాండెజ్‌కు 46 ఓట్లు, జైరాం రమేష్‌కు  46 ఓట్లు, కే.సీ రామమూర్తికి 52 ఓట్లు  రావడంతో వారు   గెలుపొందారు. అదేవిధంగా  బీజేపీ అభ్యర్థి నిర్మలాసీతారామన్‌కు 47 ఓట్లు రావడంతో ఆమె కూడా విజయం సాధించారు. అయితే జేడీఎస్ అభ్యర్థి ఎం.ఫరూక్‌కు కేవలం 33 ఓట్లు రావడంతో ఆయన రాజ్యసభలోకి అడుగు పెట్టలేకపోయారు.


ఎమినిది మంది క్రాస్ ఓటింగ్....
రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎం.ఫారూక్‌ను ప్రకటించినప్పటి నుంచి దళం అధినాయకుల పై  ఆపార్టీ ఎమ్మెల్యేలు జమీర్‌అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, ఇక్బాల్ అన్సారి, అఖండశ్రీనివాసమూర్తి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ పోలింగ్ రోజున ఈ ఐదు మందికి తోడు బండిసిద్దేగౌడ, గోపాలయ్య, భీమేగౌడలు కూడా దళం అధినాయకత్వం పై ధిక్కారస్వరం వినిపించారు. ఈ ఎనిమిది మంది శాసనసభ్యులు ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి పోలింగ్ జరిగిన విధానసౌధలోని 106 గదికి శనివారం మధ్యాహ్నం పోలీసు బంధోభస్తుమధ్య చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల పోలింగ్ బహిరంగ విధానంలో జరగడంతో ఈ ఎనిమిది మంది తాము ఓటును ఎవరికి వేశామన్న విషయం పార్టీ ఏజెంటుగా వ్యవహరించిన ఎమ్మెల్యే రేవణ్ణకు చూపించడం ఇక్కడ గమనార్హం.

 
రెండు ఫిర్యాదులు కొట్టివేత...

రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించి, తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీకు ఓటు వేశారని అందువల్ల వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోకూడదని జేడీఎస్ పార్టీ రాష్ర్ట ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అనారోగ్య నెపం చూపుతూ నిబంధనలకు విరుద్ధంగా కలబుర్గి శాసనసభ్యుడు రామకృష్ణ ఓటును ఎమ్మెల్సీ గోవిందరాజు చేత కాంగ్రెస్ వేయించిందని దళం నాయకులు మరో ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. ఈ రెండు ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించి నిర్ణయం వెలువడే వరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిలిపి వేసింది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న విషయాలకు అవసరమైన ఆధారాలను జేడీఎస్ పార్టీ చూపించకపోవడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ జేడీఎస్ రెండు ఫిర్యాదులను కొట్టివేసింది. దీంతో నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమమై గంటలోపు ఫలితాలు వెలువడ్డాయి.

 
వరుసగా 21 ఓట్లు, 1 ఓటు ‘సంపాదించిన’ కే.సీ రామమూర్తి, ఫరూక్...
ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి కే.సీ రామమూర్తికి 52 ఓట్లు వచ్చినట్లు తేలింది. కాగా, కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో 123 సంఖ్యాబలం ఉంది. ఇందులో ఆ పార్టీ మొదటి, రెండో అభ్యర్థులైన ఆస్కార్‌ఫెర్నాండెజ్, జైరామ్ రమేష్‌కు చెరో 46 ఓట్లు పోను 31 ఓట్లు మిగిలుతాయి. అయితే మూడో అభ్యర్థి అయిన కే.సీ రామమూర్తి గెలుపునకు ఈ ఓట్లు సరిపోవు. అయితే ఓట్ల లెక్కింపు తర్వాత ఆయనకు అందరి అభ్యర్థుల కంటే ఎక్కువగా 52 ఓట్లు తెచ్చుకున్నట్లు తేలింది. దీంతో కే.సీ రామమూర్తి తన గెలుపునకు 31 ఓట్లకు అదనంగా మరో 21 ఓట్లు సంపాదించుకున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జేడీఎస్‌కు శాసనసభలో 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడగా మిగిలిన 32 మంది ఓట్లు ఫారూక్‌కు పడాల్సి ఉంది. అయితే ఓట్ల లెక్కింపు తర్వాత ఆయనకు 33 ఓట్లు వచ్చినట్లు తేలింది. దీంతో ఫారూక్‌కు అదనంగా వచ్చిన ఓటు స్వతంత్ర అభ్యర్థి వేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఆ స్వతంత్ర అభ్యర్థి ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement