
ముంబై: ఫడ్నవీస్ ప్రభుత్వం త్వరలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇటీవలి ఎన్నికల్లో చిన్న పార్టీల నుంచి 16 మంది, స్వతంత్రులు 13 మంది ఎమ్మెల్యేలయ్యారు. అసెంబ్లీలోని మొత్తం 288 మందిలో మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ ‘ఇతర’ ఎమ్మెల్యేల్లో తమ వైపు ఏడుగురున్నారని శివసేన, తమవైపు 14 మంది ఉన్నారని బీజేపీ చెబుతున్నాయి. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌కు ఎన్సీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది ఇప్పటి వరకు కచ్చితంగా వెల్లడి కాలేదు. అయితే, వీరు కాకుండా పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కమలదళం చెబుతోంది.
ఆ నలుగురు కీలకం
బలపరీక్ష నేపథ్యంలో.. మేజిక్ మార్క్ 145కి చేరేందుకు బీజేపీ ముఖ్యంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. వారు నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించినవారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో ప్రత్యక్ష సంబంధాలున్నావారు. గణేశ్ నాయక్, బాబన్‌రావు మాజీ ఎన్సీపీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలున్నవారు. అందుకే బీజేపీ వీరిపై ఆధారపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment