small parties
-
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
కొంచెం తేడా వచ్చినా సీట్లు గల్లంతే.. ఆ మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోరులో మెజార్టీ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ చిన్న పార్టీల జోరు పెరిగిపోతూ ఉండడంతో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కడం పరిపాటిగా మారింది. దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటునూ ఒడిసిపట్టడం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు కీలకంగా మారింది... అధికార వ్యతిరేకత, చిన్న పార్టీల జోరు ఈ రెండూ కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని శాసిస్తున్నాయి. వరసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం లేని కన్నడ నేలపై అత్యంత తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలవడం సాధారణంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాల్లో విజేతలు 3 వేల కంటే తక్కువ మార్జిన్‌తో గట్టెక్కారు. గత ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 36% ఓట్లతో 104 స్థానాల్లో విజయం సాధిస్తే, 38% ఓట్లు సాధించిన కాంగ్రెస్ మాత్రం 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! మన ప్రజాస్వామ్యంలోని ఈ వైచిత్రి కారణంగా అత్యధిక ఓట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే సవాల్‌గా మారింది. అందుకే ఈసారి పార్టీలన్నీ ఒక్క ఓటు కూడా పోకుండా క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తూ బూత్ మేనేజ్మెంట్కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మూడు ఎన్నికల ముచ్చట గత మూడు ఎన్నికల్లోనూ అన్ని పార్టీలకు స్వల్ప మార్జిన్ పెద్ద తలనొప్పిగా మారింది. 2008 ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు 5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో గెలుపొందారు. అంటే 31% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొన్నట్టయింది. 2013 ఎన్నికల దగ్గరకి వస్తే 5 శాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల శాతం 30గా ఉంది. గత ఎన్నికల్లో 28% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొంది. గత మూడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ, జేడీ(ఎస్) పార్టీల సగటు గెలుపు ఆధిక్యం 12 శాతం ఉండగా, కాంగ్రెస్‌కు 11 శాతం ఉంది. 1980ల వరకు ఏ రాష్ట్రంలోనైనా గెలుపు ఆధిక్యాలు చాలా ఎక్కువగా దాదాపుగా 30% అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండేవి. తర్వాత ప్రాంతీయ పార్టీలు పెరగడం, పార్టీల సామాజిక సమీకరణలు వంటివి ప్రధానంగా మారి ఓట్ల ఆధిక్యానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. పార్టీల్లో టెన్షన్ టెన్షన్ ఈసారి ఎవరి ఓటు బ్యాంకుకి గండిపడుతుందా అని మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. మొత్తం 224 స్థానాలకు గాను అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 100 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. వీటితో కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు నష్టమనే అంచనాలున్నాయి. బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. ఆప్ అన్ని స్థానాల్లోనూ పోటీ పడుతోంది. ఈ పార్టీల ప్రభావం గత ఎన్నికల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీ నమోదైన 30 సీట్లపై ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ఏదైనా నియోజకవర్గంలో హోరాహోరి పోరు నెలకొన్నప్పుడు చిన్న పార్టీలు రెండు నుంచి మూడు వేలు ఓట్లు సంపాదించినా అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎన్నికల్లో గెలవలేకపోయినా ఫలితాలను మార్చే సత్తా కలిగి ఉంటారు’’అని బెంగుళూరుకి చెందిన రాజకీయ విశ్లేషకుడు నరేంద్రపాణి అభిప్రాయపడ్డారు. నోటాకే ఎక్కువ ఓట్లు! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వాటిలో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెసే నెగ్గింది. అలంద్, బాదామి, గడగ్, హిరెకెరూర్, కంగ్డోల్, మాస్‌కి, పావగడలో అభ్యర్థుల గెలుపులో ఓట్ల కంటే నోటాకే ఎక్కువ పడ్డాయి. ► 1985 నుంచి ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాల్లో బొటాబొటి మెజార్టీతోనే నేతలు గట్టెక్కారు. ► 25 శాతానికి పైగా స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. విజేతలకు, పరాజితులకు మధ్య తేడా 5, అంతకంటే తక్కువ శాతమే ఉంది. ► గత మూడు దశాబ్దాల్లో కేవలం 5 శాతం స్థానాల్లో మాత్రమే భారీ మెజార్టీ నమోదైంది. ► విజేతలు, పరాజితులకు వచ్చిన ఓట్లు, వాటి మధ్య తేడాలను విశ్లేషిస్తే ఓటరు గాలివాటంగా పోకుండా ఎంతో మేధోమథనం చేసి ఓటేస్తున్నాడని తేటతెల్లమవుతుంది. ► మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులిద్దరికీ ఓట్లు 5 శాతం తేడా వస్తే హోరాహోరీగా పోరు సాగిందని, 20 శాతం కంటే ఎక్కువ ఉంటే ఓటరు నిర్ణయాత్మకంగా స్పందించారని అంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు
లక్నో: ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఇప్పట్నుంచే ఆ రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అందులోనూ చిన్న పార్టీల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ పార్టీలపై ప్రధాన పార్టీలు వల వేశాయి. వారిని తమ వైపు లాక్కుంటే ఓట్లు చీలకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్లాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వందల ఓట్లను ఈ పార్టీలు దక్కించుకున్నా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అధికంగా ఉంది. దీంతో డజనుకి పైగా చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కెలకి దిగుతున్నాయి. అధిక సీట్లను ఆశిస్తూ బేరసారాలకు దిగుతున్నాయి. 2017 ఎన్నికల్లో వివిధ చిన్న పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో విజయాన్ని సాధించినట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సమాజ్‌వాదీ పార్టీ చెబుతూ ఉంటే, బీజేపీ కూడా వారితో పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగతంగా బలపడి తాము ఒంటరిపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మార్చి 14తో ముగియనుంది. ఆలోపే రాష్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ సత్తా ఎంత అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీ(యూ), ఆర్పీఐ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన నిషాద్ పార్టీకి దాదాపుగా ఆరు లోక్‌సభ స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక అప్నాదళ్ (ఎస్), ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు (ఎస్బీఎస్పీ) ఓబీసీల్లోని కుర్మీ వర్గంపై పట్టు ఉంది. బీజేపీతో కలిసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్బీఎస్పీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్న ప్రకాశ్ రాజ్‌భర్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. తూర్పు యూపీలో యాదవుల తర్వాత రాజ్భర్ల ప్రాబల్యమే ఎక్కువ. ఇటీవల ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ ఆధ్వర్యంలో 10 చిన్నాచితకా పార్టీలతో భగధారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. ఈ కూటమిలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 100 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలైనా తమతో చేతులు కలపవచ్చునని ఆ కూటమి పిలుపునిచ్చింది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి రాష్ట్రీయ లోక్ దళ్, మహన్ దళ్, జన్వాడీ సోషలిస్టు పార్టీ, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు ఉంది. మహన్ దళ్ పార్టీకి శక్య, సైని, మౌర్య, కుష్వాహ ఓబీసీ వర్గాల్లో పట్టు ఉంది. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాల్లో వీరి ఓట్లే దాదాపు నలభై శాతం వరకు ఉన్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాడీ సోషలిస్టు పార్టీకి బింద్, కశ్మప్ వర్గాల్లో మంచి పట్టు ఉంది. డజనుకు పైగా జిల్లాల్లో ఈ పార్టీ తన ప్రభావాన్ని చూపించగలదు. శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ బీజేపీయేతర పార్టీలతో చేతులు కలపాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లోకి తొంగి చూస్తే.. ► 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ► 2017 ఎన్నికల్లో ఏకంగా 290 పార్టీలు పోటీ చేశాయి ► ఎస్బీఎస్పీ పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో గెలిచింది. ఈ పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో 34.14 శాతం ఓట్లను కొల్లగొట్టింది. ► అప్నాదళ్ (ఎస్) 11 స్థానాల్లో పోటీ చేసి 39.21 శాతం ఓట్లను సాధించింది. మొత్తం అన్ని స్థానాల ఓట్ల పరంగా చూస్తే 0.98 శాతం ఓట్లను దక్కించుకున్నట్టయింది. ► పీస్ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. అయితే తాము పోటీ చేసిన స్థానాల్లో 1.56 శాతం ఓట్లను సాధించింది. మొత్తం ఓట్లలో 0.26% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ► 2017 ఎన్నికల్లో 32 చిన్న పార్టీలకు 5 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు వచ్చాయి. ► మరో ఆరు చిన్న పార్టీలు 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే, ఇంకో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు 56 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టాయి. -
చిన్న పార్టీల దారెటు?
ముంబై: ఫడ్నవీస్ ప్రభుత్వం త్వరలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇటీవలి ఎన్నికల్లో చిన్న పార్టీల నుంచి 16 మంది, స్వతంత్రులు 13 మంది ఎమ్మెల్యేలయ్యారు. అసెంబ్లీలోని మొత్తం 288 మందిలో మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ ‘ఇతర’ ఎమ్మెల్యేల్లో తమ వైపు ఏడుగురున్నారని శివసేన, తమవైపు 14 మంది ఉన్నారని బీజేపీ చెబుతున్నాయి. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌కు ఎన్సీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది ఇప్పటి వరకు కచ్చితంగా వెల్లడి కాలేదు. అయితే, వీరు కాకుండా పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కమలదళం చెబుతోంది. ఆ నలుగురు కీలకం బలపరీక్ష నేపథ్యంలో.. మేజిక్ మార్క్ 145కి చేరేందుకు బీజేపీ ముఖ్యంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. వారు నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించినవారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో ప్రత్యక్ష సంబంధాలున్నావారు. గణేశ్ నాయక్, బాబన్‌రావు మాజీ ఎన్సీపీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలున్నవారు. అందుకే బీజేపీ వీరిపై ఆధారపడుతోంది. -
పేరుకే చిన్న ... పెర్ఫార్మెన్స్ మిన్న
చూడటానికి అవి చిన్న పార్టీలే. కానీ దేశ రాజకీయాల్లో వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. సంకర్ణరాజకీయాల యుగం మొదలయ్యాక ఈ చిరు పార్టీలు పెను ప్రభావం చూపుతున్నాయి. 1989 నుంచి ప్రతి ఎన్నికలోనూ ఈ బుల్లి పార్టీలు కనీసం 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నాయి. గత ఎన్నికల్లోనైతే ఈ పార్టీలన్నీ కలిపి 5.34 కోట్ల వోట్లను పొందాయి. రాష్ట్రీయ ఆమ్ పార్టీ, జనతా రాజ్ పార్టీ, హమ్ సబ్ కీ పార్టీ, గరీబ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల పేరు కూడా మనకు తెలియదు. కానీ వీటిలో కొన్ని పార్టీలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. దేశంలో చిన్న చిన్న రాజకీయపార్టీల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిలో చాలా పార్టీలకు గుర్తింపు కూడా లేదు. 1989 లో చిరు పార్టీల సంఖ్య 77. గత లోకసభ ఎన్నికల్లో ఈ పార్టీల సంఖ్య 321 కి చేరుకుంది. ఈ సారి ఎన్నికల్లో 1600 కి పైగా గుర్తింపు లేని పార్టీలు బరిలో ఉండొచ్చునన్నది అంచనా. వీటి ఓట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 1999 లో ఇవన్నీ కలిపి పదహారు సీట్లు, 2.1 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. 2004 లో 20 సీట్లు, 3.5 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. గత లోకసభ ఎన్నికల్లో 21 సీట్లు, 5.34 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. చిరు పార్టీల పెను బలాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వీటితో అవగాహనకు వచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర లోని రాష్ట్రీయ సమాజ్ పక్ష్, స్వాభిమాన్ పక్ష్ , బీహార్ లో రాష్ట్రీయ లోక సమతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో లోకసత్తా పార్టీ, ఉత్తరప్రదేశ్ లో అప్నా దళ్, తమిళనాడులో ఎండీఎంకె, డీఎండీకె, కే ఎండీకె, పీఎంకే లతో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్దగా ఎలాంటి ప్రయత్నాలనూ చేస్తున్నట్టు కనిపించడం లేదు.