లక్నో: ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఇప్పట్నుంచే ఆ రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అందులోనూ చిన్న పార్టీల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ పార్టీలపై ప్రధాన పార్టీలు వల వేశాయి. వారిని తమ వైపు లాక్కుంటే ఓట్లు చీలకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్లాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వందల ఓట్లను ఈ పార్టీలు దక్కించుకున్నా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అధికంగా ఉంది.
దీంతో డజనుకి పైగా చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కెలకి దిగుతున్నాయి. అధిక సీట్లను ఆశిస్తూ బేరసారాలకు దిగుతున్నాయి. 2017 ఎన్నికల్లో వివిధ చిన్న పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో విజయాన్ని సాధించినట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సమాజ్‌వాదీ పార్టీ చెబుతూ ఉంటే, బీజేపీ కూడా వారితో పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగతంగా బలపడి తాము ఒంటరిపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మార్చి 14తో ముగియనుంది. ఆలోపే రాష్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఏ పార్టీ సత్తా ఎంత
అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీ(యూ), ఆర్‌పీఐ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన నిషాద్ పార్టీకి దాదాపుగా ఆరు లోక్‌సభ స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక అప్నాదళ్ (ఎస్), ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు (ఎస్‌బీఎస్‌పీ) ఓబీసీల్లోని కుర్మీ వర్గంపై పట్టు ఉంది. బీజేపీతో కలిసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్‌బీఎస్‌పీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్న ప్రకాశ్ రాజ్‌భర్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. తూర్పు యూపీలో యాదవుల తర్వాత రాజ్‌భర్‌ల ప్రాబల్యమే ఎక్కువ.
ఇటీవల ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ ఆధ్వర్యంలో 10 చిన్నాచితకా పార్టీలతో భగధారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. ఈ కూటమిలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 100 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలైనా తమతో చేతులు కలపవచ్చునని ఆ కూటమి పిలుపునిచ్చింది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి రాష్ట్రీయ లోక్ దళ్, మహన్ దళ్, జన్‌వాడీ సోషలిస్టు పార్టీ, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు ఉంది. మహన్ దళ్ పార్టీకి శక్య, సైని, మౌర్య, కుష్వాహ ఓబీసీ వర్గాల్లో పట్టు ఉంది. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాల్లో వీరి ఓట్లే దాదాపు నలభై శాతం వరకు ఉన్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జన్‌వాడీ సోషలిస్టు పార్టీకి బింద్, కశ్మప్ వర్గాల్లో మంచి పట్టు ఉంది. డజనుకు పైగా జిల్లాల్లో ఈ పార్టీ తన ప్రభావాన్ని చూపించగలదు. శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ బీజేపీయేతర పార్టీలతో చేతులు కలపాలని ప్రణాళికలు రచిస్తోంది.
గత ఎన్నికల్లోకి తొంగి చూస్తే..
► 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి
► 2017 ఎన్నికల్లో ఏకంగా 290 పార్టీలు పోటీ చేశాయి
► ఎస్‌బీఎస్‌పీ పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో గెలిచింది. ఈ పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో 34.14 శాతం ఓట్లను కొల్లగొట్టింది.
► అప్నాదళ్ (ఎస్) 11 స్థానాల్లో పోటీ చేసి 39.21 శాతం ఓట్లను సాధించింది. మొత్తం అన్ని స్థానాల ఓట్ల పరంగా చూస్తే 0.98 శాతం ఓట్లను దక్కించుకున్నట్టయింది.
► పీస్ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. అయితే తాము పోటీ చేసిన స్థానాల్లో 1.56 శాతం ఓట్లను సాధించింది. మొత్తం ఓట్లలో 0.26% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి.
► 2017 ఎన్నికల్లో 32 చిన్న పార్టీలకు 5 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు వచ్చాయి.
► మరో ఆరు చిన్న పార్టీలు 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే, ఇంకో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి.
► గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు 56 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment