సొంత గూటికి పైలట్‌! | Sachin Pilot Meets Rahul Gandhi and Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

సొంత గూటికి పైలట్‌!

Published Tue, Aug 11 2020 4:05 AM | Last Updated on Tue, Aug 11 2020 4:31 AM

Sachin Pilot Meets Rahul Gandhi and Priyanka Gandhi  - Sakshi

రాహుల్‌తో సచిన్‌ పైలట్‌(ఫైల్‌)

న్యూఢిల్లీ/జైపూర్‌: రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పార్టీలోకి తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ పునః ప్రవేశానికి రంగం సిద్ధమైంది. పైలట్‌ సోమవారం పార్టీ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో సమావేశమయ్యారు. దాంతో, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రాజస్తాన్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారనే వార్తల నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ పార్టీ అగ్ర నేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

రాహుల్‌ గాంధీతో సచిన్‌ పైలట్‌ భేటీ అనంతరం.. కాంగ్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్‌ పార్టీ,  రాష్ట్రంలో ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేస్తారని అందులో పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మకమైన, స్పష్టతతో కూడిన చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘పైలట్, ఇతర ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారాలను సూచించేందుకు త్వరలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు’ అని అందులో స్పష్టం చేశారు.

మరోవైపు, పైలట్‌ తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ సోమవారం ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను కలిశారు. గహ్లోత్‌ నివాసంలో జరిగిన ఆ భేటీ అనంతరం.. ‘ప్రభుత్వం క్షేమం. రేపటికి అంతా చక్కబడుతుంది’ అని శర్మ వ్యాఖ్యానించారు. దాదాపు నెల క్రితం 18 మంది ఎమ్మెల్యేలతో పైలట్‌ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేసి, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన విషయం, గహ్లోత్‌ సర్కారు మనుగడకు ముప్పుగా పరిణమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గహ్లోత్, పైలట్‌లు తమ మద్దతుదారులను హోటళ్లలో ఉంచి, క్యాంప్‌ రాజకీయాలు నడుపుతున్నారు.

రెబెల్స్‌పై చర్యలుండవు
రాహుల్‌ గాంధీ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పైలట్‌ మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చేందుకు వీలుగా ఒక ఫార్మూలా సైతం సిద్ధమైందని వెల్లడించాయి. రాహుల్, ప్రియాంకలతో పైలట్‌ రెండు గంటలకు పైగా సమావేశమయ్యారని, పైలట్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై అగ్రనేతలిద్దరూ సానుకూలంగా స్పందించారని తిరుగుబాటు నేతకు సన్నిహితులైన నాయకులు తెలిపారు. రెబెల్‌ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, పదవుల నుంచి తొలగించినవారికి మళ్లీ మంత్రి పదవులు ఇస్తామని పైలట్‌కు హామీ ఇచ్చారన్నాయి. అయితే, గహ్లోత్‌  శాసనసభలో బల నిరూపణకు సిద్ధమైతే.. తన వర్గం ఎమ్మెల్యేలతో సహా అనుకూలంగా ఓటేయాలని పైలట్‌కు వారు స్పష్టం చేసినట్లు సమాచారం. పైలట్‌ వర్గం ఎమ్మెల్యేల్లో మరి కొందరు కూడా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  ఈ పరిస్థితుల్లో పార్టీలోకి మళ్లీ వెళ్లక తప్పని పరిస్థితులు పైలట్‌కు నెలకొన్నాయన్నారు.

త్రిసభ్య కమిటీ
పైలట్‌ వర్గం లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రియాంక గాంధీ, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌లతో పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ ఒక త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు.

జూలై 12 నుంచి..
దాదాపు నెల క్రితం, జూలై 12న రాజస్తాన్‌ పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. తను సహా 19 మంది ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేశారు. తమవైపు 30 మంది వరకు ఎమ్మెల్యేలున్నారన్నారు. దాంతో ఒక్కసారిగా రాజస్తాన్‌ రాజకీయాలు వేడెక్కాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్, పైలట్‌ను పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించింది.

మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని, ప్రభుత్వాన్ని నిలబెడ్తానని గహ్లోత్‌ హామీ ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయన వైపే నిలిచింది. ఇదంతా బీజేపీ కుట్ర అని, భారీ ఆఫర్లు ఇస్తూ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీశారని గహ్లోత్‌ ఆరోపించారు. తన ఆరోపణలకు మద్దతుగా కేంద్ర మంత్రి షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ, వ్యాపారవేత్త సంజయ్‌ జైన్‌ల ఆడియోటేప్‌లను చూపారు. వారిపై కేసులు పెట్టారు. అలాగే, తన వర్గం ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్‌కు తరలించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరారు. దాంతో, పైలట్, ఆయన వర్గం కోర్టును ఆశ్రయించింది.

పదవి కోసం పాకులాడను
పదవి కోసం తాను పాకులాడనని సచిన్‌ పైలట్‌ పేర్కొన్నారు. విలువల కోసమే తన పోరాటమన్నారు. తనకు పదవి ఇచ్చింది పార్టీనేనని, కావాలనుకుంటే ఆ పదవిని పార్టీ మళ్లీ వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం పైలట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) పెట్టిన దేశద్రోహం కేసు, రాష్ట్రంలో పాలన తీరు సహా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను భేటీలో లేవనెత్తాను. వాటిని సమయానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొందరు నాపై కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాజకీయాల్లో బురదజల్లే వ్యవహార శైలికి నేను వ్యతిరేకం’ అని పైలట్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement