కర్ణాటకలో రాష్ట్రపతి పాలన? | Floor test to President rule in karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

Published Sun, Jul 21 2019 4:56 AM | Last Updated on Sun, Jul 21 2019 2:23 PM

Floor test to President rule in karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్‌ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్‌ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్‌ ఇప్పటికే  కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ కశ్యప్‌ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్‌ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్‌ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు?
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్‌ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే..  
► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు
► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు
► గవర్నర్‌ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే
► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే
► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు


రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన
► 1971, మార్చి 9:  వీరేంద్ర పాటిల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది  (ఏడాది మీద ఒక్క రోజు)
► 1977, డిసెంబర్‌ 31: ముఖ్యమంత్రి దేవరాజ్‌ (కాంగ్రెస్‌)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారు(59 రోజులు)
► 1989, ఏప్రిల్‌ 21: ఎస్‌.ఆర్‌.బొమ్మై  ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు)
► 1990, అక్టోబర్‌ 10: వీరేంద్ర పాటిల్‌ ప్రభుత్వం బర్తరఫ్‌ (ఏడు రోజులు)
► 2007, అక్టోబర్‌ 9: బీజేపీ–జేడీఎస్‌ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు)
► 2007, నవంబర్‌ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు)


నేడు సీఎల్పీ భేటీ
బెంగళూరు: కాంగ్రెస్‌ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్‌ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్‌ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు.  

ఆయనే కీలకం!
కర్ణాటకలో 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్‌ తన తెలివితేటలూ, పంచ్‌ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్‌–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు.


రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్‌ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలవడంతో రమేశ్‌ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్‌ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు..
కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్‌ పెద్దల ప్రశ్నకు రమేశ్‌ కుమార్‌ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్‌ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement