vajubhai vala
-
కర్ణాటక సీఎంపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తీరుపై బుధవారం గవర్నర్ వజూభాయ్ వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా సంబంధమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈశ్వరప్ప చెప్పారు. తనకు తెలియకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. యడియూరప్పకు సన్నిహితుడిగా ఈశ్వరప్ప పేరు పొందారు. ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. -
యెడ్డీ కేబినెట్లో మరో 10 మంది
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 10 మంది ఫిరాయింపు నేతలు తాజా విస్తరణలో కేబినెట్ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఆ 10 మంది నేతలు గత డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా గురువారం ఉదయం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తవారికి ఈనెల 8వ తేదీన శాఖలు కేటాయించనున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. గతేడాది జూలైలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వారిలో డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన 10 మంది ఇప్పుడు మంత్రివర్గంలో చేరారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన 17 మందికి న్యాయం చేస్తానని గతంలో యడియూరప్ప హామీ కూడా ఇచ్చారు. బీజేపీ వారికి నో!: తాజా విస్తరణతో కర్ణాటకలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 28కి చేరింది. తదుపరి విస్తరణలో మరో ఆరుగురికి స్థానం కల్పించే అవకాశముంది. ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించలేదు. ఉమేశ్ కట్టి, అరవింద్ లింబావలి, సీపీ యోగేశ్వర్ అనే ముగ్గురు బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామని వివరణ ఇచ్చారు. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు ఆశావహుల నుంచి భారీగా ఒత్తిడి వచ్చిన నేపథ్యంలోనే సొంత పార్టీ వారికి ప్రస్తుతానికి అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. అవకాశం కల్పించకపోతే పార్టీని వీడుతామనే హెచ్చరికలు కూడా వారినుంచి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 117 మంది సభ్యులున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కింది వీరికే ఎస్టీ సోమశేఖర్, రమేశ్ జార్కిహోళి, ఆనందసింగ్, కె.సుధాకర్, భైరతి బసవరాజు, శివరామ్ హెబ్బార్, బీసీ పాటిల్, కె.గోపాలయ్య, కేసీ నారాయణెగౌడ, శ్రీమంత పాటిల్. -
కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక 32వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(76) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతో పాటు మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ, కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ నేత శోభాకరంద్లాజే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ఈ వేడుకకు వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. యెడ్డీకి అమిత్ షా ఫోన్.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో బీజేపీ అధిష్టానం చకచకా పావులు కదిపింది. పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శుక్రవారం ఉదయాన్నే యడియూరప్పకు ఫోన్‌చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా అపాయింట్మెంట్ తీసుకున్న యడియూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనీ, సభలో మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ వజూభాయ్‌వాలా సాయంత్రం 6–6.15 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించారు. యడియూరప్ప ఇప్పటికే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మరోసారి ఎన్నుకోలేదు. 29న అసెంబ్లీలో బలపరీక్ష.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక యడియూరప్ప స్పందిస్తూ.. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు బలపరీక్షను చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను సంప్రదించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు యడియూరప్ప విజ్ఞప్తి మేరకు సోమవారం సభను నిర్వహిస్తానని స్పీకర్ చెప్పారు. యడ్యూరప్ప కాదు.. యడియూరప్ప! కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు. న్యుమరాలజీ ప్రభావంతో యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. 2007లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిరావడంతో న్యుమరాలజీ ప్రకారం యడియూరప్ప తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే ఇది కలిసిరాకపోవడంతో ఈ బీజేపీ నేత తన పాత పేరునే వాడాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమా? ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుం టుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగు రిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ రమేశ్ మిగిలిన 14 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే/ అనర్హత వేటేస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 105 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇదే జరిగితే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గట్టెక్కుతుంది. అయితే 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం అస్పష్టత నెలకొంది. ప్రజానుకూల పాలన అందిస్తాం: అమిత్ షా కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైన, రైతు, ప్రజానుకూల పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్పకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కలహాలవల్లే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందనీ, తమ ప్రమేయం లేదన్నారు. మండిపడ్డ కాంగ్రెస్, జేడీఎస్.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేయడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీకి అండగా నిలిచిన వజూభాయ్‌వాలా సాయంతో రాజ్యాంగ విరుద్ధంగా కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. అవినీతి రారాజు, జైలు పక్షి యడియూరప్ప రాజకీయ ప్రలోభాల విషయంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి అధికారంలోకి వచ్చారు’ అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. కర్ణాటక బీజేపీకి ప్రయోగశాలగా మారిపోయిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యడియూరప్ప వరాల జల్లు కర్ణాటకలో రైతులు, చేనేత కార్మికులకు సీఎం యడియూరప్ప వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎంపికైన రైతులకు అదనంగా రూ.4000ను రెండు విడతల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.100 కోట్ల మేర ఉన్న అప్పులను మాఫీ చేస్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ విషయంలో అన్నిపక్షాలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 15 ఏళ్లకే ఆరెస్సెస్ కార్యకర్త కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తన స్వగ్రామం శికారిపురలో ఒక రైలు మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2007లో.. 2007 నవంబర్‌లో తొలిసారి యడియూరప్ప సీఎం అయ్యారు. జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు. కొత్త పార్టీ.. మళ్లీ విలీనం ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీ పెట్టారు. 2014లో కేజేపీని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ, దీనిపై కాంగ్రెస్, జేడీ(ఎస్) కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు వెంటనే బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. కేవలం 3 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్డీ మే 19న బలపరీక్షకు కాస్త ముందు రాజీనామా చేశారు. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
కర్ణాటక కేబినెట్ విస్తరణ
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వజూభాయివాలా 8 మంది కాంగ్రెస్ నేతల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పొత్తులో భాగంగా కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్ కు ఆరు, జేడీఎస్‌కు రెండు సీట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రమేశ్ జార్కిహొళితో పాటు కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగేందుకు అంగీకరించని స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను మంత్రి పదవుల నుంచి సంకీర్ణ ప్రభుత్వం తప్పించింది. కాంగ్రెస్ తరఫున సతీశ్ జార్కిహోళి, తుకారాం, పరమేశ్వర్ నాయక్, రహీంఖాన్, సీఎస్ శివళి, ఎంటీబీ నాగరాజు, ఆర్బీ తిమ్మాపుర(ఎమ్మెల్సీ), ఎంబీ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే తమ తరఫున మంత్రులను ఖరారు చేస్తామని జేడీఎస్ అంటోంది.. కుమారస్వామి కేబినెట్లో 34 ఖాళీల్లో జేడీఎస్‌కు 12, కాంగ్రెస్‌కు 22 స్థానాలు దక్కేలా ఒప్పందం కుదిరింది. తాజా విస్తరణ నేపథ్యంలో కర్ణాటకలో మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. మరోవైపు ఈసారి కూడా విస్తరణలో చోటుదక్కని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి, బీసీ పాటిల్ ఆందోళనకు దిగారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాజీ సీఎం సిద్దరామయ్య మాట తప్పారని కాంగ్రెస్ నేత బీకే సంగమేశ్ ఆరోపించారు. -
కేబినెట్లోకి కొత్తగా ఎనిమిది మంది!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి శనివారం తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. జేడీఎస్- కాంగ్రెస్ కూటమి పదవుల సర్దుబాటులో భాగంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరి చేత గవర్నర్ వజూభాయి వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాకుండా మరో 19 మంది ఎమ్మెల్యేలకు వివిధ కార్పోరేషన్లకు చైర్పర్సన్లుగా అవకాశం కల్పించిన సీఎం, మరో తొమ్మిది మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. కాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇద్దరు మంత్రుల(మున్సిపల్, అటవీ మంత్రిత్వ శాఖ మంత్రులు)ను పదవుల నుంచి తొలగించారు. మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడిన కర్ణాటక మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి రాజ్‌భవన్ వద్ద నిరసనకు దిగారు. కొత్త మంత్రులు వీరే.. 1. సతీశ్ జర్కిహోలి 2. రహీమ్ ఖాన్ 3. శివల్లి 4. ఎంటీబీ నాగరాజ్ 5. తుకారాం 6. ఎంబీ పాటిల్ 7. పరమేశ్వర్ నాయక్ 8. ఆర్బీ తిమ్మాపుర్ Karnataka Governor Vajubhai Vala administers oath to new State cabinet ministers at Raj Bhavan in Bengaluru. #Karnataka pic.twitter.com/zlFhh9cE36 — ANI (@ANI) December 22, 2018 -
‘కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని నిలిపేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏడీహెచ్‌ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్‌ఎం తన పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా సోమవారం సాయంత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది తెలియాల్సిఉంది. గతవారం యడ్యూరప్పను సీఎం చేసిన ఇదే కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై జేడీయూ-కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఫలితాంగా మే 19న అసెంబ్లీలో బలపరీక్షలో జరగడం, డివిజన్ ఓటింగ్‌కు ముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే గవర్నర్.. కుమారస్వామినా ఆహ్వానించడం తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ శుక్రవారం నియమించారు. సభలో అత్యంత అనుభవజ్ఞుడిని కాకుండా బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. సభలోని సభ్యుల్లో అత్యంత అనుభవజ్ఞుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సంప్రదాయం. అలా చూస్తే ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆర్వీ దేశ్‌పాండే అత్యంత అనుభవజ్ఞుడు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోపయ్య నాలుగుసార్లే ఎమ్మెల్యే అయ్యారు. కానీ గవర్నర్ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. గవర్నర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరించడం బాధాకరమనీ, ఆయన నిర్ణయం విస్తుగొల్పిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూ రావ్ అన్నారు. కళంకితుడైన, గతంలో స్పీకర్‌గా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన అదే వ్యక్తిని మళ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ విధులు ఇవే.. కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం ప్రొటెం స్పీకర్ విధులు. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేసినా లేదా మరణించినా కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనన్నారు. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్‌లు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించనుంది. ఈ కేసును జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేటాయిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా సభ్యులుగాగల ధర్మాసనం కాంగ్రెస్, జేడీఎస్‌ల పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే విచారించనుంది. బల పరీక్ష 4 గంటలకు జరగాల్సి ఉండగా, అంతకు ముందే విచారణ చేపట్టనుండటం గమనార్హం. గతంలో సుప్రీం మొట్టికాయలు 2008లోనూ బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జగదీశ్ షెట్టర్ స్పీకర్‌గా నియమితులు కాగా, బోపయ్య డిప్యూటీ స్పీకర్ అయ్యారు. షెట్టర్ రాజీనామా అనంతరం 2009 నుంచి 2013 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. బోపయ్య స్పీకర్ పదవిలో ఉండగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చింది. విశ్వాసపరీక్షలో యడ్యూరప్పను గెలిపించేందుకు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 16 మందిపై బోపయ్య అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించగా, సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. బోపయ్య ప్రాథమిక రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారనీ, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించింది. -
1996లో అలా.. 2018లో ఇలా!
ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది. గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్‌కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్‌ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. వాజ్‌పేయి ఔట్.. దేవెగౌడ ఇన్ 1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్‌పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యడ్యూరప్ప అనే నేను...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప (75) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే రైతు రుణమాఫీపై యడ్యూరప్ప అధికారులతో చర్చించారు. రెండ్రోజుల్లో దీనిపై తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం ఉదయం యడ్డీ ప్రమాణం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతల నుంచి ఆటంకం కలుగుతుందనే ముందస్తు సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. యడ్డీ సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది మూడోసారి. గతంలో 2007లో నవంబర్ 12న తొలిసారిగా (వారం రోజులపాటు), రెండోసారి 2008, మే 3న మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. రెండోసారి సీఎం అయ్యాక మూడేళ్ల 10 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. రైతుల సాక్షిగా.. ప్రచారంలో తనను రైతుబంధుగా చెప్పుకున్న యడ్యూరప్ప తెల్లని సఫారీపై ఆకుపచ్చ శాలువా వేసుకుని విజయ సంకేతం చూపుతూ రాజ్‌భవన్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ యడ్డీని ఆహ్వానించారు. ‘భగవంతుడి సాక్షిగా, రైతు సాక్షిగా..’ అని ఆయన ప్రమాణం చేశారు. సాధారణంగా బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు ఈసారి గైర్హాజరవటం గమనార్హం. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంత్‌కుమార్ సహా ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యడ్యూరప్ప కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 104 మంది శాసనసభ్యులున్న బీజేపీ తగిన సంఖ్యాబలం సాధించాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రకటించారు. గవర్నర్ ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా రాష్ట్ర విధానసభలో యడ్యూరప్ప బలనిరూపణ చేయాల్సి ఉంది. ఆ తరువాతే కేబినెట్ విస్తరణ చేపడతామని యడ్యూరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉద్విగ్నంగా కనిపించారు. ‘విశ్వాసం’ నిలబెట్టుకుంటా ప్రమాణం తరువాత నేరుగా విధానసౌధకు వెళ్లిన యడ్డీ.. ముఖద్వారం మెట్లకు నమస్కరించి లోపలికెళ్లారు. సీఎస్ రత్నప్రభ, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశం అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికి రూ. లక్ష రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మరో రెండు రోజుల్లో రుణమాఫీపై ప్రకటన చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని.. విశ్వాస పరీక్షలో 100% విజయం సాధిస్తామన్నారు. ‘మా ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. గవర్నర్ అవకాశం ఇచ్చిన 15 రోజుల పాటు నేను వేచిచూడను. వీలైనంత త్వరగా మెజారిటీ నిరూపించుకుంటాను’ అని యడ్డీ పేర్కొన్నారు. ‘రిసార్టు’ భద్రత ఉపసంహరణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మకాం వేసిన బెంగళూరు బిడది సమీపంలోని ఈగల్టన్ రిసార్డు వద్ద భద్రతను ఉపసంహరించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తమ ఎమ్మెల్యేల భద్రతపై కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పాత్రికేయులను రిసార్ట్ లోనికి అనుమతించటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అక్కడ పహారా కాస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను సంప్రదించటానికి గురువారం మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. -
ఓడిపోతే నోరు నొక్కేస్తారా?: నటుడు
ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాక హంగ్ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీ మనిషంటూ బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా బీజేపీ, ఆరెస్సెస్ మనిషి కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారో అందరికీ తెలిసిన విషయమేనంటూ ట్వీటర్ వేదికగా ఆయన చేసిన కామెంట్ వైరల్ అయింది. దీనిపై బీజేపీ అభిమానులు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఉదయ్‌ని ‘బాలీవుడ్ రాహుల్ వచ్చేశాడు’ అంటూ కొందరు కామెంట్ చేయగా, ‘నువ్వూ రాజకీయాల్లోకి రాకపోయావా’ అంటూ మరికొందరు నెటిజన్లు ఆయనపై కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వీటిపై స్పందించిన ఉదయ్... ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేసే కనీస హక్కు అందరికీ ఉందని వారందరికీ సమాధానం ఇచ్చాడు. తనకు కలిగిన అభిప్రాయం తప్పని అనుకోవడం లేదని తెలిపారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా తన గోడు వెల్లబోసుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉందని ఉదయ్ తెలిపారు. కాగా, లాంగెర్ మీనాక్షి అనే నెటిజన్.. ‘ఓడిపోయిన వారికి అభిప్రాయాలు చెప్పుకొనే స్వేచ్ఛ ఉందనీ.. అయితే బావిలో కప్పలా ఆలోచించే వారు, లోకజ్ఞానం లేకుండా మాట్లాడేవారు.. నోరు మూసుకుని ఉంటే మంచిది’ అని చేసిన ట్వీట్‌పై ఉదయ్ స్పందించారు. ‘మనది ప్రజాస్వామ్య దేశం. ఓడిపోయినంత మాత్రాన నోరు నొక్కేస్తారా..! ఎవరి అభిప్రాయాలు వారివి’ అంటూ రీట్వీట్ చేశారు. కాగా వజుభాయ్ వాలాను బీజేపీ, ఆరెస్సెస్ మనిషంటూ ఉదయ్ చేసిన ట్వీట్‌పై మరో నెటిజన్.. భారత రాష్ట్రపతి కాక పూర్వం ప్రణబ్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ మనిషే కదా..! అంటూ ట్రోల్ చేశారు. Not really. In a democracy a loser is allowed to have opinions too — Uday Chopra (@udaychopra) May 15, 2018 I just googled the governor of Karnataka https://t.co/5vUFe5Tttq BJP guy and RSS hmmm I guess we all know what’s gonna happen — Uday Chopra (@udaychopra) May 15, 2018 -
కీలుబొమ్మలుగా గవర్నర్లు...
సాక్షి, చెన్నై : కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘గతంలో తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, ఇప్పుడు ప్రధాని మోదీ కర్నాటకలోనూ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేశారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఇది అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు వాజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా ఖండిస్తోంది.’ అని స్టాలిన్ అన్నారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు స్టాలిన్ తెలిపారు. అంతకు ముందు ఆయన తన ట్వీటర్లో ఆయన కర్ణాటక పరిణామాలపై వరుస ట్వీట్లు చేశారు. ‘కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వనించారు. ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పునాదులను నాశనం చేసేదిగా, ముఖ్యంగా బేరసారాలను ప్రొత్సహించేదిగా ఉంది. తమిళనాడులోనూ అవినీతి అన్నాడీఎంకేను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు రాజ్యాంగ విలువలకు ప్రమాదకారకంగా మారుతున్నాయి’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. People of Tamil Nadu are familiar with the BJP's efforts to protect the corrupt ADMK Government, which also incidentally does not enjoy the majority support in the Legislative Assembly. Constitutional institutions and principles are under threat from these actions. — M.K.Stalin (@mkstalin) 17 May 2018 -
మళ్లీ ‘ఆపరేషన్ కమల’?
పూర్తి మెజారిటీ లభించని బీజేపీని గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో.. ‘ఆపరేషన్ కమల’ మరోసారి తెరపైకి వచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం.. 2008లోనూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇప్పటిలాగే అప్పుడు కూడా బీజేపీయే అతిపెద్ద పార్టీగా నిలిచింది. సాధారణ ఆధిక్యానికి 113 సీట్లు అవసరమవ్వగా బీజేపీ 110 స్థానాల్లో గెలుపొంది.. మేజిక్ ఫిగర్‌కు కేవలం మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది. దాంతో యడ్యూరప్ప రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, జేడీఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో ‘మాట్లాడి’ వారి చేత రాజీనామాలు చేయించారు. మరోవైపు అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ, గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బలనిరూపణ పరీక్ష నాటికి సభలో ఏడుగురు సభ్యులు తగ్గిపోవడంతో మేజిక్ ఫిగర్ కూడా తగ్గింది. రాజీనామా చేసిన వారంతా కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులే కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గింది. ఆ వెంటనే రాజీనామా చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. వారిలో ఐదుగురు గెలిచారు. దీంతో సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 115కు చేరి స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీన్నే ‘ఆపరేషన్ కమల’ అని వ్యవహరిస్తారు. అప్పట్లో ‘ఆపరేషన్ కమల’ను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అందరూ మెచ్చుకున్నారు. -
వజూభాయ్ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. వజూభాయ్ బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘వజూభాయ్ గవర్నర్ కార్యాలయ గౌరవాన్ని దిగజార్చారు. రాజ్యాంగాన్ని అణగదొక్కారు. చట్టాలను దుర్వినియోగం చేసి బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదేశాలతో వజూభాయ్ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఆయన రాజ్యాంగ విలువల్ని కాకుం డా బీజేపీ అధిష్టానం ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకున్నారు’ అని ట్వీట్ చేశారు. -
నేడు యడ్యూరప్ప ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఖండించాయి. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి. యడ్డీ ఒక్కరే! కాంగ్రెస్–జేడీఎస్ నేతల వ్యతిరేకతలు, హెచ్చరికల మధ్య బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. యడ్డీ ప్రమాణానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాకపోవచ్చని సమాచారం. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆందోళనలు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో రాజ్‌భవన్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోనూ భద్రతను పటిష్టం చేయాలని పోలీసుశాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఉదయం నుంచీ హైడ్రామా! హంగ్ తీర్పుతో రాజుకున్న కన్నడ రాజకీయాల్లో బుధవారం కూడా సస్పెన్స్ కొనసాగింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేస్తారు? గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారనేదానిపై స్పష్టత రాకపోవడం. బలాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమి, బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. అయితే, సోమవారం గవర్నర్‌కు సమర్పించిన కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖలో ముగ్గురు ఎమ్మెల్యేల సంతకాల్లేకపోవటం మధ్యాహ్నం కలకలం రేపింది. వీరంతా బీజేపీతోనే ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా కాంగ్రెస్‌లోని లింగాయత్ ఎమ్మెల్యేలు, జేడీఎస్ కూటమిలోని ఆరుగురు తమతోనే ఉన్నారని లీకులు ఇవ్వడంతో ప్రత్యర్థి కూటమిలో ఆందోళన నెలకొంది. జేడీఎస్‌తో జవదేకర్ చర్చలు! బీజేపీ ఎమ్మెల్యేలంతా బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశమై యడ్యూరప్పను తమపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఉదయం జేడీఎస్ అధినేత కుమారస్వామితో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇవి విఫలం కావడంతో జేడీఎస్‌లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆందోళన పెరిగింది. కాగా, రాణీ బెన్నూరు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్‌నేత ఈశ్వరప్పపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేరా?’ అని మండిపడ్డారు. అయితే, శంకర్ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు. అటు, పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో లేకుండా పోయారన్న వార్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఖండించారు. వారు ఎక్కడున్నా తమకే మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ ప్రలోభాలు: కుమారస్వామి తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం కానీయబోమన్నారు. బుధవారం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్లో జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కుమారస్వామిని తమ పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తోంది. మేం తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా సమావేశానికి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరిద్దరూ ఫోన్లోనూ అందుబాటులో లేరని తెలుస్తోంది. కాగా, తను బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వచ్చిన వదంతులను దేవేగౌడ రెండో కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ తోసిపుచ్చారు. కుమారస్వామిని జేడీఎస్ పక్ష నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. కుమారస్వామి ఆరోపణలను జవదేకర్ ఖండించారు. అంతపెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదన్నారు. మోదీ ప్రోద్బలంతోనే తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని సిద్దరామయ్య అన్నారు. శెట్టర్ గెలుపును నిర్ధారించిన ఈసీ సాక్షి, బళ్లారి: హుబ్లీ–ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్ల మధ్య స్వల్ప తేడా వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ నలవాడ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఫలితాన్ని నిలిపివేశారు. సమగ్ర పరిశీలన అనంతరం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ బలం 104కు చేరుకుంది. రాజ్‌భవన్‌కు క్యూ కట్టిన పార్టీలు .బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్ ముందు ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. యడ్యూరప్ప, ఇతర బీజేపీ సీనియర్ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు తమకే అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు, 2008 తరహాలోనే ఈసారి కూడా తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే అనుమానంతో కాంగ్రెస్‌పార్టీ చాలా జాగ్రత్తపడింది. వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అనంతరం జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్న ఈ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకుందని ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే ఇరు పక్షాలకూ గవర్నర్ ఒకే సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. -
కర్ణాటక: బీజేపీ సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నడుమ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీజేపీలో కలకలం రేపుతున్నది. మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100కోట్లు ఆఫర్ చేస్తున్నదన్న కుమారస్వామి ఆరోపణలను కొట్టిపారేసిన కాషాయదళం... ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నదని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే టార్గెట్‌గా వ్యవహారం నడుస్తున్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదులు వెళ్లాయి. బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, జీఎం సిద్ధేశ్వర, పీసీ మోహన్‌లు ఉమ్మడిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘‘కర్ణాటకలో అధికార దుర్వినియోగానికి సంబంధించి మా వద్ద స్పష్టమైన కారణాలున్నాయి. చట్టవిరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకోండి..’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దరామయ్య ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించాల్సిఉంది. కేంద్రానికి బీజేపీ ఎంపీ శోభ రాసిన లేఖ The #kannadigas mandate is clear and it favours BJP only. now they are tapping phones of @BJP4Karnataka ‘s leaders . its hard to see people can stoop this level for power. The saga of unholy nexus continues #KaranatakaVerdict pic.twitter.com/ebkTxgOlrQ — Shobha Karandlaje (@ShobhaBJP) May 16, 2018 -
బాలీవుడ్ రాహుల్ గాంధీ వచ్చేసాడు!
ముంబై: రసవత్తరంగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను మాత్రం చేరుకోలేక పోయింది. ఈ సమయంలో గవర్నర్ నిర్ణయంపైనే ప్రస్తుత పరిస్థితి ఆధారపడి ఉన్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాను ‘బీజేపీ మనిషి’ అంటూ ట్విటర్లో మెసేజ్ పోస్టు చేశారు. దాంతో నెటిజన్లు ఈ ‘ధూమ్’ నటుడిని ‘బాలీవుడ్ రాహుల్ గాంధీ’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఉదయ్ చోప్రా ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడిన హంగ్ పరిస్థితులను ఉటంకిస్తూ, వజుభాయ్‌ను ఉద్ధేశిస్తూ తన ట్విటర్లో ఒక మెసేజ్ పోస్టు చేశారు. ‘ఇప్పుడే నేను గూగుల్‌లో కర్ణాటక గవర్నర్ గురించి వెతికాను. దానికి గూగుల్ అతన్ని బీజేపీ వ్యక్తి, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తిగా చూపిస్తుంది. దీన్ని బట్టి ఏం జరగబోతుందో మీకందరికి తెలుసనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ చేసి నెటిజన్లకు చిక్కాడు. ఇంకేముందు నెటిజన్లు ఈ హీరోను తెగ ఆడుకుంటున్నారు. కొందరు ఉదయ్ చోప్రాను ‘బాలీవుడ్ రాహుల్‌గాంధీ’ అని, మరికొందరు ‘ఉదయ్ భాయ్ మీరు రాజకీయాల్లోకి రండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇంతకు విషయమేమిటంటే వజుభాయ్ వాలా బీజేపీ పార్టీకి చెందిన వాడని, ఆర్ఎస్ఎస్ మనిషి అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఉదయ్ చోప్రా ఈ విషయాన్ని గూగుల్‌లో వెతికి మరీ చెప్పానని తన తెలివితక్కువతనాన్ని బయట పెట్టుకున్నాడు. -
బీజేపీని ఆహ్వానిస్తే.. ప్రలోభాలకు తెరతీసినట్లే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక గవర్నర్ ఒకవేళ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆయన రాజకీయ ప్రలోభాలకు, బేరసారాలకు, అవినీతికి, పార్టీల ఫిరాయింపులకు బహిరంగంగా తెరతీసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన మెజారిటీ కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఉందని తెలిపారు. గవర్నర్ వజూభాయి వాలాతో మంగళవారం భేటీఅయిన తర్వాత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించరాదన్నారు. ఏకైక అతిపెద్ద పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం కుదరదని గోవా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. చిన్నపార్టీల సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతు తమకు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీఎస్ గవర్నర్ వజూభాయి వాలాకు లేఖ రాసింది. గవర్నర్‌కు మరో మార్గంలేదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ఆహ్వానించటం తప్ప గవర్నర్ వజూభాయి వాలాకు మరోమార్గం లేదని కాంగ్రెస్ పేర్కొంది. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తిప్పికొట్టారు. మొత్తం 222కు గాను 115 సభ్యుల బలమున్న ఈ కూటమికి ప్రభుత్వ ఏర్పాటులో అవకాశమివ్వటం రాజ్యాంగ, న్యాయసూత్రాల ప్రకారం సరైందేనన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ అధికారం చేపట్టలేదన్నారు. 1998లో పార్లమెంట్లో సంఖ్యాపరంగా ఎక్కువ బలమున్న అటల్ బిహారీ వాజ్‌పేయి కూటమికే అప్పటి రాష్ట్రపతి నారాయణన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించి, మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు. -
శాంతిస్థాపకుడు బాహుబలి
సాక్షి, బెంగళూరు: శాంతి స్థాపనకు బాహుబలి (గోమఠేశ్వరుడు) ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పేర్కొన్నారు. అన్నింటి కంటే శాంతి ముఖ్యమని బోధించే జైనధర్మం ప్రపంచంలోనే ఎంతో విలువైందని కొనియాడారు. కర్ణాటకలో హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో కొలువుతీరిన గోమఠేశ్వరుని విగ్రహానికి 88వ మహామస్తకాభిషేక కార్యక్రమాలను కోవింద్ బుధవారం ప్రారంభించారు. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలను చావుండరాయ సభ మంటపంలో జ్యోతిని వెలిగించి నాంది పలికారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 17వ తేదీన మహామస్తకాభిషేకం జరుగనుంది. వేడుకల్లో రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, గవర్నర్ వజుభాయి వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తదితరులు పాల్గొన్నారు. 17 మీటర్ల ఎత్తైన బాహుబలి ఏకశిలా విగ్రహానికి జైన అర్చకులు పాలు, నెయ్యి, కుంకుమలతో అభిషేకం చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్
తిరుమల: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం స్వామిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించి హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో గవర్నర్‌కు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడుకొండలవాడిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని, విశ్వశాంతి కోసం ప్రార్థించానని, స్వామివారిని ఎన్నిసార్లు దర్శించినా ఇంకా చూడాలనే తపన ఉంటుందని చెప్పారు. తెలుగు గడ్డపై తిరుమల శ్రీవారి ఆలయం ఉండటం ప్రతి ఒక్క తెలుగువారి అదృష్టమని అన్నారు.