పూర్తి మెజారిటీ లభించని బీజేపీని గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో.. ‘ఆపరేషన్ కమల’ మరోసారి తెరపైకి వచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం.. 2008లోనూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇప్పటిలాగే అప్పుడు కూడా బీజేపీయే అతిపెద్ద పార్టీగా నిలిచింది. సాధారణ ఆధిక్యానికి 113 సీట్లు అవసరమవ్వగా బీజేపీ 110 స్థానాల్లో గెలుపొంది.. మేజిక్ ఫిగర్‌కు కేవలం మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది. దాంతో యడ్యూరప్ప రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, జేడీఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో ‘మాట్లాడి’ వారి చేత రాజీనామాలు చేయించారు.
మరోవైపు అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ, గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బలనిరూపణ పరీక్ష నాటికి సభలో ఏడుగురు సభ్యులు తగ్గిపోవడంతో మేజిక్ ఫిగర్ కూడా తగ్గింది. రాజీనామా చేసిన వారంతా కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులే కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గింది. ఆ వెంటనే రాజీనామా చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. వారిలో ఐదుగురు గెలిచారు. దీంతో సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 115కు చేరి స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీన్నే ‘ఆపరేషన్ కమల’ అని వ్యవహరిస్తారు. అప్పట్లో ‘ఆపరేషన్ కమల’ను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అందరూ మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment