Operation Aakarsh
-
మరో రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’.. కాంగ్రెస్‌లో గుబులు
మహారాష్ట్రలో మహా అఘాడీ సంకీర్ణ సర్కారును కూలదోసిన కాషాయ పార్టీ ఇప్పుడు మరో రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేసినట్టు కనబడుతోంది. హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టుందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో బెంగాల్లో పట్టుబడడంతో ఈ వాదనకు బలం చేకూరింది. కాంగ్రెస్ అలర్ట్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో సోరేన్ సర్కారుకు ఎసరు పెట్టుందుకు కమలనాథులు సిద్ధమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోరేన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, పూర్తికాలం కొనసాగుతుందని ఏఐసీసీ రాష్ట్ర బాధ్యుడు అవినాష్ పాండే భరోసాయిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వాములైన వారి పట్ల అప్రమత్తంగా ఉన్నామని, సరైన సమయంలో కుట్రదారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. ఫిరాయింపుదారులకు వార్నింగ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నకాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు.. సోరేన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠినవైఖరి అవలంభించాలని నిర్ణయించింది. అందుకే కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ వేటు చేసి ఫిరాయింపుదారులకు గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాదు జార్ఖండ్ కాంగ్రెస్ విభాగం 18 జిల్లాల్లో ఆందోళనలు కూడా చేపట్టింది. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో శాసనసభ్యుడు బెంగాల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది రెండోసారి.. నాకేం తెలియదు హేమంత్ సోరేన్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నించడం ఇది రెండోసారని అవినాష్ పాండే తెలిపారు. ప్రస్తుత కుట్ర వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని ఆయన పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు. సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాను ప్రయత్నించడం లేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. 22 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగినందున ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, సీనియర్ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనపై కాంగ్రెస్ ఎందుకు కేసు పెట్టిందో తెలియదన్నారు. హిమంత ప్రోద్బలంతోనే.. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. హిమంత బిశ్వ శర్మ ప్రోద్బలంతో తనకు 10 కోట్ల రూపాయలు, కొత్త ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఆశచూపారని ఆరోపిస్తూ బెర్మో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జయమంగళ్.. రాంచిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కారులో డబ్బు పట్టుబడిన తర్వాతే ఎందుకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నకు జయమంగళ్ వద్ద సమాధానం లేదు. మరోవైపు సీఎం సోరేన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికార పక్షంలో గుబులు మొదలైంది. (క్లిక్: రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్) -
టార్గెట్ సిట్టింగ్స్: ఓ ఎంపీ.. 10 మంది ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు కీలక నేతలతో సంప్రదింపుల కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థి బీజేపీనే అని చాటి చెప్పడంతో పాటు.. పార్టీలో చేరే నేతలకు అన్నివిధాలా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్లో అసంతృప్తి బలంగా ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తాము టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బహిర్గతం అవుతోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులను సైతం చేర్చుకునేలా బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక ఇప్పటికే ఖాయమైందని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం. కాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కీలక దశలో చర్చలు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈటల బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు వేగం పుంజుకున్నాయి. జిల్లాల వారీగా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించడంతో పాటు వారు బీజేపీలో చేరేలా చర్చలు సాగుతున్నాయి. ఇతరత్రా హామీలతో పాటు పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వచ్చే నెలలో పార్టీలో చేరతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆయన చేరిక నల్లగొండ జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని, మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి రావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులు, కీలక నాయకులు ఎంతోమంది ఉన్నారని.. ప్రస్తుతానికి ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలతో, పాటు బలమైన నాయకులతో చర్చల ప్రక్రియ కీలక దశలో ఉన్నట్టు బీజేపీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. భరోసా ఇస్తున్న బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరికలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని, పార్టీలోకి వచ్చే ప్రజాప్రతినిధులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాపులారిటీని కూడా గమనంలోకి తీసుకుంటున్నట్లు బీజేపీ నేత తెలిపారు. అసంతృప్తితో ఉన్న ప్రజాప్రతినిధుల్లో కొందరు శాసనసభ్యులు.. ఇప్పటికిప్పుడు బయటకు వస్తే అనవసర వేధింపులు, కేసులు కొనసాగుతాయని, నియోజక వర్గాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా ఆపేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అలాంటి భయాలు అక్కర్లేదని భరోసా కల్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పలువురు ముఖ్య నేతలు రెడీ! ఖమ్మం నుంచి మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ ఆయన రావడంతో ఆ జిల్లాలో బీజేపీకి బలం గణనీయంగా పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఈటల అధ్యక్షతన ఏర్పాటైన చేరికల కమిటీ నాయకుడొకరు వ్యక్తం చేశారు. అదే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని కూడా చేర్చుకునే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలిసింది. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ఓ మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే టీఆర్ఎస్ పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన తేజవత్ రామచంద్రు పార్టీలో చేరతారని అంటున్నారు. అదే విధంగా ఆ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం ఉందని సమాచారం. ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్న ఓ వ్యాపారవేత్త బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. నల్లగొండలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరికి కీలక పదవి కట్టబెట్టి పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై బీజేపీ నేతలు చర్చించినట్లు తెలిసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీజేపీలోకి వస్తారని అంటున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. -
మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం ?
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ డ్రామాకి తెరలేచింది. అధికార కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి రాత్రి కనిపించకపోవడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్ కమలంకుట్రలో ఇది భాగమని కాంగ్రెస్ ఆరోపించింది. కమల్‌నాథ్ సర్కార్‌ని కూల్చడానికి కుట్ర పన్నిన బీజేపీ అధికార కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హరియాణాకు తరలించి ఒక లగ్జరీ హోటల్లో ఉంచినట్టుగా రాష్ట్ర మంత్రి జితు పత్వారీ ఆరోపించారు. సీనియర్ బీజేపీ నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర సింగ్ తదితరులు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను హరియాణాకు తీసుకువెళ్లారని, ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే తనతో చెప్పారని అన్నారు. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారైతే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ఈ ఆరోపణల్ని బీజేపీ నాయకులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, ఏంచేస్తున్నారో తమకు తెలీదని అన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలలో నలుగురు బుధవారం తిరిగి వచ్చినట్టు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు. మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోట్తో కలిసి కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వ్యాపమ్ స్కామ్‌ను బట్టబయలు చేసిన డాక్టర్ ఆనంద్‌రాయ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకువస్తే రూ.100 కోట్లు, ఎమ్మెల్యేలకి కొత్త కేబినెట్లో మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా తనతో మాట్లాడారంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే అది మార్ఫింగ్ వీడియో అని మిశ్రా స్పష్టం చేశారు. మాకు మెజార్టీ ఉంది: కమల్‌నాథ్ తన సర్కార్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నడం దారుణమని ఆయన ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ నాటకాలు ఆడుతోందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి గోవింద్ ఆరోపించారు. మార్చి 26న జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు విప్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
పట్టు దిశగా కమలం అడుగులు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పట్టు సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుని ఊపుమీదున్న కమలదళం.. ఆపరేషన్ ఆకర్ష్‌ను పకడ్బదీంగా అమలు చేస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైనే బీజేపీ గురి పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.టీఆర్ఎస్కు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో షకీల్ అమేర్ అర్వింద్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆర్మూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకురాలు ఏలేటీ అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అనుచరులు బీజేపీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈనెలాఖరులో గానీ, వచ్చేనెలలో గానీ ఆమె బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డితో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ వంటి నాయకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధినాయత్వం ప్రయత్నిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా బీజేపీ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలే కాకుండా, మండల స్థాయిలో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని యోచిస్తోంది. ఇటీవల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అనుచరవర్గం దాదాపు మొత్తం కాషాయ కండువా కప్పుకుంది. అలాగే ఆర్మూర్ వంటి నియోజకవర్గంలోనూ వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలకు బీజేపీ వలవేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్‌ను పెంచుకోవడం ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలవుతుందని భావిస్తోంది. -
కమలదళం వలస బలం!
రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. భారీగా బలగాన్ని సమకూర్చుకొనే పనిని చాప కింద నీరులా చేసుకుపోతోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీని ఖాళీ చేయించిన బీజేపీ.. అడపాదడపా కాంగ్రెస్ నేతలను ఆకర్షించడమే కాక ఇప్పుడు ఏకంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా కన్నేసింది. అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను రాజకీయ వర్గాల్లోకి పంపాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్ : అటు ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ, ఇటు ఆపరేషన్ ఆకర్ష్‌ను ఏక కాలంలో అమలు చేయడం ద్వారా రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో బలీయమైన రాజకీయ శక్తిగా అవ తరించాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపి స్తోంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌తో అధికార పార్టీలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ప్రారంభించిన ఆ పార్టీ... రాష్ట్ర ప్రభుత్వం పైనా పోరాటాలకు సిద్ధమవు తోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలు కూడా రాష్ట్ర బీజేపీలో ఇమడలేకపోతున్నా రనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి వచ్చే నాయకులను ఏ మేరకు కలుపుకొనిపోతారు... ఎంతకాలం వారు పార్టీలో ఉండగలుగుతారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. లోక్‌సభ ఎన్నికల నుంచే.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దూకు డుగా వ్యవహరించలేకపోయిన తెలంగాణ బీజేపీ... లోక్‌సభ ఎన్నికల సమయంలో వ్యూహాలను అమల్లోకి తెచ్చింది. బలమైన అభ్యర్థులను దింప డం, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అలాగే మరో చోట పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును సమకూర్చుకుంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలు పట్టం కట్టడంతో అదే ఊపును కొనసాగిస్తూ గత ఆరేడు నెలలుగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమున్న రాష్ట్రమన్న అంచనాతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వ్యూహాలకు అనుగుణంగా పార్టీ రాష్ట్ర శాఖ పక్కా కార్యాచరణతో ఇప్పటికే అనేక మంది నేతలను కమలదళంలో చేర్చుకోవడంలో సఫలీకృతమైంది. టీ టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరినీ పార్టీలో చేర్చుకోవడంతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నియోజకవర్గ స్థాయి నేతలను కూడా అక్కున చేర్చుకుంది. ఆ రెండు పార్టీల్లో ఇంకా వీలైనంత మందిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలను కొనసాగిస్తూనే అధికార టీఆర్ఎస్లోని అసంతృప్తిని కూడా సొమ్ము చేసుకొని రాజకీయంగా ఎదిగే వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. షకీల్‌తో ‘షురూ’? అధికార టీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని, త్వరలోనే వారు అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరతారని 4–5 రోజుల నుంచి సోషల్ మీడి యాలో ప్రచారం జరుగు తోంది. ఈ ప్రచారానికి తగ్గట్లు గానే గురువారం బోధన్ ఎమ్మెల్యే ఫకీల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ల భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృ ప్తితో ఉన్న షకీల్ బోధన్ లాంటి సమస్యాత్మక నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బీజేపీ నేతతో భేటీ కావడం, అన్ని విషయాలను సోమవారం వెల్లడిస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో షకీల్ బీజేపీలో చేరడం లాంఛనమేనని, షకీల్‌తోపాటు మరికొందరు ఎమ్మె ల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా టచ్‌లో ఉన్నా రని బీజేపీ వర్గాలంటున్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నేరుగా ఢిల్లీ నేతలే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఐదుగురు ఎమ్మె ల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని కమలనాథులంటు న్నారు. వారంతా అమిత్ షా సమ క్షంలో పార్టీలోకి వస్తారని చెబుతున్నారు. వారితో పాటు కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలను కూడా పార్టీలో చేర్చుకునే ప్రణాళికలు... ఢిల్లీ నుంచే అమలు జరుగుతుండ టంతో త్వరలోనే తమకు మరింత బలం సమకూరు తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలని ఇప్పటికే జాతీయ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమతో మాట్లాడుతున్నారని, 2022కల్లా రాష్ట్రంలో పేరున్న రాజకీయ నాయకులకు తమ పార్టీ చిరునామాగా మారబోతోందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం ఆ పార్టీ వ్యూహాన్ని తెలియజేస్తోంది. త్వరలోనే ‘పాదయాత్ర’! ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతోపాటు ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలన్న కోణంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడతారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఇది టానిక్‌గా ఉపయోగపడుతుందని బీజేపీ శిబిరం అంటోంది. అందులో భాగంగానే ఈ నెల 17న విమోచన దినోత్సవానికి అమిత్ షాను రప్పించాలని రాష్ట్ర నాయకులు ఇప్పటికే జాతీయ పార్టీకి ప్రతిపాదనలు కూడా పంపారు. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తేనే పార్టీలో చేరికలుంటాయనే అంచనాలో ఉన్న కమలనాథులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా పావులు కదుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎలాగూ తమకు సానుకూలత ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని, తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలు ఉండగలుగుతారా...? ఇతర పార్టీ నుంచి వచ్చి చేరే వలస నేతలను బీజేపీలో కలుపుకొని పోరనే అభిప్రాయం ఉంది. నాగం జనార్దన్‌రెడ్డి లాంటి నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు చర్చిస్తుంటాయి. మొదటి నుంచీ బీజేపీలో ఉన్న నేతలే పాతుకుపోయారని, పార్టీ, ప్రభుత్వంలో పదవులు కూడా వారికే వస్తాయనే అపవాదు కూడా ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన డి.కె. అరుణ లేదా ఇతర నేతలకు ఇన్నాళ్లయినా ఎలాంటి అవకాశం కల్పించలేదని, అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిన వారికైనా ఏదో ఒక పదవి లేదా హోదా ఇచ్చి ఉంటే వలస నేతలకు భరోసా ఉండేదనే అభిప్రాయం అంతర్గతంగా బీజేపీలోనూ వ్యక్తమవుతోంది. -
సైకిల్ చూపు కమలం వైపు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో కనిపించిన ఊపును స్థిరం చేసుకునే దిశలో కమలనాథులు అడుగులేస్తున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా...ఎన్నికల ముందు నిర్దేశించిన లక్ష్యా న్ని సాధించే క్రమంలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా తలపడేందుకు అడుగులేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచి మంచి ఊపులో ఉన్న బీజేపీ ఇప్పుడు మరింత బలపడేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆపరేషన్ తెలంగాణ, ఆపరేషన్ ఆకర్ష్‌ను ఎన్నికలకు ముందునుంచే ప్రారంభించిన బీజేపీ ఇపుడు ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాపోలు ఆనంద భాస్కర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరగా, ఇపుడు మరిన్ని చేరికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు టీడీపీ ఖాళీ అయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవటంతో నేతలు నైరాశ్యంలో ఉన్నారు. వారితోపాటు పార్టీ కార్యకర్తలను తనవైపు తిప్పుకోవాలని బీజేపీ సిద్ధమైంది. తాజాగా ఆ పార్టీ నేతలు కొందరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌తో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే టీడీపీ నేతలు బీజేపీకి టచ్‌లోకి రావటం విశేషం. కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లి అక్కడే ఉన్నారు. టీడీపీ నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, హన్మకొండ మాపీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ తదితరులు లక్ష్మణ్æతో దాదాపు గంటపాటు చర్చించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మర్యాద పూర్వకంగానే లక్ష్మణ్‌ను కలిశామని ఆయా నేతలు పేర్కొన్నా.. వారు బీజేపీలో చేరేందుకు సిద్ధమై చర్చలు జరిపినట్లు సమాచారం. వీరితోపాటు ఆ పార్టీ తెలంగాణ నేతలు మరికొందరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల ముందే పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా టీఆర్ఎస్కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనను బీజేపీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. చివరి క్షణంలో ఆయన పార్టీలో చేరలేదు. అయితే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. -
గెట్ రెడీ టు ఆపరేషన్ ఆకర్ష్...
సాక్షి, కామారెడ్డి: ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార పార్టీలోకి వలసలు జోరందుకోవడం సర్వసాధారణమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి గులాబీదళం ఆకర్ష్‌కు పదును పెట్టింది. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు కారెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవాలి. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. సీఎం కేసీఆర్ పంపించే సైనికుడినే గెలిపించాలి’ అని బుధవా రం జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సభ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో అన్ని ఎంపీ స్థానాలను గెలచుకునేందుకు ఆ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందని కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీల్లోని బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఫోకస్ చేసింది. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. జహీరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆరు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 5,76,433 కాగా... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 4,43,468 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకన్నా 1,32,965 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అదే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 1,44,631 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందున మెజారిటీ మరింత పెరగాల్సిందని, కానీ గతంలోకన్నా తక్కువ ఓట్లు రావడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల శాతం ఎందుకు తగ్గిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్‌ను టార్గెట్ చేసుకుని ఓట్ల శాతం పెరిగేలా పార్టీ క్యాడర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేగాక ఎమ్మెల్యేలు తమతమ నియోజక వర్గాల్లో మెజారిటీ తేవడానికి ప్రయత్నించాలని ఓ రకంగా అల్టిమేటం జారీ చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటూ చురకలు కూడా అంటించారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే కాదు మంచి మెజారిటీ రావాలన్న టార్గెట్‌తో ఎన్నికలకు సమాయత్తమైన టీఆర్ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది. ప్రత్యర్థి పార్టీలో ఉన్న బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో ఆ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజక వర్గానికి చెందిన నేతలకు గాలం వేయడానికి గులాబీ శ్రేణులు రంగంలోకి దిగాయి. నియోజక వర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి పార్టీ మారుతాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రసార మాద్యమాల్లో వచ్చిన ఈ వార్త గురువారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి, అవకాశాల కోసం పార్టీలో చేరమంటూ ఇతర పార్టీల నేతలకు గులాబీ దళం గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి.. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎదుటి పార్టీని బలహీన పర్చడంతో పాటు తమ బలాన్ని పెంచుకునేందుకు ఆకర్ష్‌కు పదును పెట్టినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలై, వారు నామినేషన్లు వేసేలోగా అవకాశం రాని నేతలు పార్టీ ఫిరాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలా మంది పార్టీలు మారుతారని తెలుస్తోంది. -
సెంచరీపై టీఆర్ఎస్ ధీమా
సాక్షి, హైదరాబాద్ : అనుకున్న లక్ష్యాల సాధనగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఐదుగురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం.. 16 ఎంపీ సీట్లను సాధించేదిశగా పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. దీనికితోడు వంద సీట్లు సాధించాలని మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలో అంతర్గత పరిణామాలతో 100సీట్ల లక్ష్యానికి కొంచెం దూరంలో ఆగిపోయింది. అయితే ఆ అసంతృప్తిని సరిదిద్దుకునేందుకు.. లెక్కను సరిచేయాలనే లక్ష్యంతో మిషన్‌పై దృష్టిపెట్టింది. టీఆర్ఎస్ లక్ష్యాన్ని ఇతర పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా నెరవేర్చే పరిస్థితి వచ్చింది.గత శాసనసభలో చేరికల వ్యూహానికి భిన్నంగా ఈసారి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు (కోరుకంటి చందర్– రామగుండం, లావుడ్య రాములు నాయక్ – వైరా) టీఆర్ఎస్లో చేరారు. అధికార పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్, టీడీపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రకటించారు. త్వరలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు సైతం అధికార పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నలుగురి చేరికతో టీఆర్ఎస్ బలం 94కు చేరనుంది. లోక్‌సభ ఎన్నికలలోపు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉండడంతో.. గులాబీ పార్టీ పెట్టుకున్న వంద మంది ఎమ్మెల్యేల లక్ష్యం పూర్తి కానుంది. వచ్చే వారికి స్వాగతం అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేందుకు విషయంలో టీఆర్ఎస్ ఈసారి విభిన్న వైఖరితో వ్యవహరిస్తోంది. గత శాసనసభలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ముందుగా సంప్రదింపులు జరిపేది. ఇప్పుడు మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల ప్రతిపాదనను అంగీకరిస్తోంది. టీఆర్ఎస్లో చేరుతామని ఆ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించే ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి చేరికల ప్రక్రియను పూర్తి చేస్తోంది. 2015లో జరిగిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు ఉదంతం తర్వాత టీఆర్ఎస్ ఈ వ్యూహానికి మరింత పదునుపెట్టింది. తెలంగాణలో టీడీపీని పూర్తిగా బలహీనపరిచేలా వ్యవహరించింది. టీఆర్ఎస్ అధిష్టానమే ముందుగా చొరవ తీసుకుని ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో సంద్రింపులు జరిపింది. వారి అవసరాలను తెలుసుకుని దీనికి అనుగుణంగా పార్టీలో చేర్చుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో టీఆర్ఎస్ సొంతంగా 65 సీట్లు గెలుచుకుంది. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, వైఎస్సాఆర్సీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక్కరు చొప్పున మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 90కి చేరింది. అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలు జరిగాయి. వంద స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పదేపదే చెప్పారు. అనుకున్నట్లుగానే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు భారీ మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు. ఖరారుకాని ముహూర్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతరావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్లో చేరే ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. గులాబీ కండువా కప్పుకోబోతున్నామంటూ వీరిద్దరు శనివారం ప్రకటించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం అధికార పార్టీలో చేరే కార్యక్రమం ఉంటుందని సంకేతాలిచ్చారు. వీరి చేరిక ముహూర్తంపై స్పష్టత రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వీరిద్దరు పార్టీలో చేరతారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేలోపు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల చేరిక కార్యక్రమం ఉంటుందంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరిక ముహూర్తాన్ని కేసీఆర్ ఇంకా ఖరారు చేయలేదని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. -
కొనసాగుతున్న ‘ఆకర్ష్’
సాక్షి, కల్వకుర్తి: నామినేషన్ల పర్వం సాగుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలోనే అసమ్మతి నాయకులకు గాలం వేయడానికి ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆకర్ష్ పథకం అమలు చేస్తున్నాయి. బీజేపీ మాత్రం రెండు పార్టీల నాయకులపై దృష్టి సారించింది. టీఆర్ఎస్లో ఉన్న వారిని కాపాడుకోవడానికి అసమ్మతి నాయకులను బుజ్జగిస్తూ కాంగ్రెస్ అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ మాత్రం టీఆర్ఎస్ అసమ్మతి, అసంతృప్తి నాయకులు, కార్యకర్తలపై నజర్ వేసింది. ఈ మూడు పార్టీలు నాయకులకు, కార్యకర్తలకు, ఎవరు వచ్చినా వారికి పార్టీల కండువాలు కప్పడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏదిఏమైనా నియోజకవర్గంలో ఆకర్ష్ పథకం జోరుగా సాగుతుంది. అసెంబ్లీ రద్దు నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి ఈ ఆకర్ష్ పథకం ఆరంభమైంది. అంతకు ముందు ఎవరు ఏ పార్టీ నాయకుడిని పట్టించుకోలేదు. ముందుస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి అసంతృప్తులు, అసమ్మతి నాయకులకు ఫోన్లు చేయడం, కలవడం మొదలెట్టారు. అప్పటి నుంచి సాగుతున్న కండవాలు కప్పటం నేటికి సాగుతూనే ఉంది. సట్టణాలు, మండల కేంద్రాలు, పల్లెలో, గిరిజన తండాలు, చివరకు కాలనీలు సైతం ప్రస్తుతం రాజకీయపార్టీలకు కండువాలు కప్పే ట్రెండ్ జోరుగా సాగుతుంది. పెద్ద రాజకీయ నాయకుల నుంచి చిన్న కార్యకర్త వరకు అన్ని పార్టీలు కండువాలు మెడలో వేసి ఓ ఫోటోకు ఫోజులిప్పించి ఇక మన పార్టీ వారే నని సంబరపడిపోతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థుల ముందు మెప్పుపొందడానికి గ్రామాల్లోని మహిళలను, కూలీలను సైతం వదలడం లేదు. ఆ తర్వాత వారికి కొంతమేర కూలీ ముట్టజెబుతున్నారు. ఒకరోజు ఒకపార్టీ.. మరుసటి రోజు మరో పార్టీ పార్టీల కండువాల సంస్కృతి నవ్వుల పాలుచేస్తోంది. యువకులు కొందరు ఒక రోజు ఒక పార్టీ కండువాలు మెడలో వేసుకొని మరుసటి రోజు మరో పార్టీ కండవాలు మెడలో వేసుకోవడం ఫొటోలకు పోజులివ్వడం సాధారణంగా మారింది. దీనికి కారణం డబ్బులు చేతులు మారడమనే విమర్శలున్నాయి. పెద్దనాయకులే కొందరు ఒకరోజు ఒక పార్టీలో మారుతున్నామని చెప్పి రెండు మూడు రోజులకు మరోపార్టీలో చేరుతున్నారు. ఈప్రాంతంలో ఓనాయకుడు తన ఇంటిపై ఒకపార్టీ జెండాలు సైతం ఎగురవేసి మరసటిరోజు మాటమార్చారు. ఇందుకు కారణం రాజకీయ భవిష్యత్‌తోపాటు కాసుల లెక్క తేలకపోవడమేనని గుసగుసలు విన్పిస్తున్నాయి. డబ్బులిస్తేనే కండువా మెడలో..జెండా చేతిలో ఎన్ని సంస్కరణలు వచ్చినా సోషల్ మీడియా పెరిగి పోతున్నా ప్రతి ఎన్నికల్లో వ్యయం పెరిగిపోవడంతోపాటు విలువలు సైతం పోతున్నాయి. అక్షరాస్యత పెరిగిపోతున్నా ఓటర్లలో మాత్రం తనకేంటి అన్న «ధోరణే పెరిగిపోతుంది. కాసులిస్తే ఏ పార్టీ కండువైనా కప్పుకుంటాం.. జెండా మోస్తామని నిసిగ్గుగా చెప్పుతున్నారు. ఓటు మాత్రం తనకు నచ్చిన వారికి మాత్రమే వేస్తామని అంటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తే.. ప్రస్తుతం నియోజవర్గంలో ఏ పార్టీ సమావేశాలు పెట్టినా, సభలు, ర్యాలీలు పెట్టినా వ్యయం చేస్తే చాలు జనం భారీగా తరలివస్తున్నారు. ఒక మహిళకు రూ.250 నుంచి రూ.300 కూలీ, మగవారికి రూ.300, ఒక క్వాటర్ మద్యం, యువకులకు మాత్రం మద్యం ఖర్చు అధికం. వీరికేకాదు నిత్యం తిరిగే కార్యకర్త సైతం మద్యం, డబ్బులు ఇవ్వకపోతే పెదవి విరచడంతోపాటు కొందరు అలిగిపోతున్నారు. ఇక వాహనాలకు తడిసిమోపడుఅవుతుంది. కాసులు లేనిదే ఎన్నికల్లో జెండా ఎగురదు..ప్రచారం సాగని దుస్థితి నెలకొంది. -
దక్షిణంపై టీఆర్ఎస్ ‘గురి’!
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల నాటికి విపక్షాలను నిర్వీర్యం చేసేలా.. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ పాగా వేసేలా అధికార టీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆకర్షించడం ద్వారా విపక్షాల ఆత్మ విశ్వాసంపై దెబ్బకొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదారు నెలలకే మొదలుపెట్టిన ‘ఆకర్ష్’వ్యూహాన్ని మరింత ముమ్మరం చేసేలా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం బలహీనంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. విపక్షాల్లో కొంచెం పేరున్న నాయకులెవరూ మిగలకుండా చేసి.. ఎన్నికల నాటికి వాటిని నైతికంగా బలహీనం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రధాన నేతలంతా టార్గెట్! గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించడంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించాయి. దాంతో ‘ఆకర్ష్’కు తెరతీసిన టీఆర్ఎస్ అధినేత.. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో అన్ని పార్టీల సీనియర్లను, ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మరింతగా దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం పరిధిలో టీఆర్ఎస్ కేవలం ఒక్క కొత్తగూడెం స్థానానికే పరిమితమైంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఇందుకు పూర్తి భిన్నంగా అత్యధిక స్థానాలు సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావును టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రివర్గంలోకీ తీసుకున్నారు. తరువాత కాలంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలను, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇక రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఉప ఎన్నికలు జరిగిన పాలేరు స్థానంలో టీఆర్ఎస్ గెలిచింది. ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతానికి కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే వ్యూహం నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో ఇతర పార్టీల్లో ఉన్న ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రనాయక్‌తో పాటు జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వంటి వారంతా టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీ పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లు మాత్రమే మిగిలారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోనూ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. ఇక్కడ మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితర నేతలే కాంగ్రెస్‌కు మిగిలారు. ఈ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలను దెబ్బకొట్టడానికి వారి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఇతర సీనియర్లను, ద్వితీయ శ్రేణి నేతలకు గులాబీ కండువా కప్పారు. హైదరాబాద్, రంగారెడ్డిలపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డిలపైనా గులాబీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్కు గత ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే వచ్చింది. మిగతా సీట్లను విపక్షాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్ఎస్కు నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో విపక్షాల నుంచి నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు సీనియర్లు, బలమైన నాయకులు లేరు. దాంతో ఆయా చోట్ల కాంగ్రెస్, టీడీపీల నుంచి బలమైన నేతలను చేర్చుకుంటున్నారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో టీడీపీని ఉనికిలో కూడా లేకుండా చేసిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీలోని పలువురు ముఖ్యులను ఇప్పటికే టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు బలమైన నాయకులు, కేడర్ ఉన్న నేతలు లేకుండా చేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. -
కాంగ్రెస్, జేడీఎస్ చలో కేరళ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. విశ్వాస పరీక్షలో గెలుపొందేందుకు ‘ఆపరేషన్ కమల్’కి తెరలేపింది. అసెంబ్లీలో బల నిరూపణకు ప్రస్తుతమున్న 104 ఎమ్మెల్యేలు సహా మరో 8 మంది బీజేపీకి అవసరం. దీంతో మిగిలిన వారి కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఆపరేషన్‌లో చిక్కుకోకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. కుమారస్వామి, సిద్దరామయ్య సహా జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్యనేతలు కొచ్చిలోని ‘క్రౌన్ ప్లాజా’ 5స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోటల్ ముందు కేరళ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అయితే.. వీరిని తరలించేందుకు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక విమానానికి డీజీసీఏ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రోడ్డుమార్గంలో పుదుచ్చేరికి తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కరొక్కరుగా.. హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (కాంగ్రెస్) రిసార్టుకు రాకుండానే అదృశ్యమయ్యారు. దీనికి తోడు.. బుధవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ రిసార్టు నుంచి బయటకెళ్లిన మస్కి ఎమ్మెల్యే ప్రతాప గౌడ తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేదంటూ గురువారం రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వీరి ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో కూటమిలో కలవరం మొదలైంది. క్యూలో మరికొందరు! కాంగ్రెస్‌కు చెందిన కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరితో కమలదళ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకరరెడ్డి, స్వతంత్ర ఎమ్మెల్యేలు నాగేష్, శంకర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
మళ్లీ ‘ఆపరేషన్ కమల’?
పూర్తి మెజారిటీ లభించని బీజేపీని గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో.. ‘ఆపరేషన్ కమల’ మరోసారి తెరపైకి వచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం.. 2008లోనూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇప్పటిలాగే అప్పుడు కూడా బీజేపీయే అతిపెద్ద పార్టీగా నిలిచింది. సాధారణ ఆధిక్యానికి 113 సీట్లు అవసరమవ్వగా బీజేపీ 110 స్థానాల్లో గెలుపొంది.. మేజిక్ ఫిగర్‌కు కేవలం మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది. దాంతో యడ్యూరప్ప రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, జేడీఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో ‘మాట్లాడి’ వారి చేత రాజీనామాలు చేయించారు. మరోవైపు అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ, గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బలనిరూపణ పరీక్ష నాటికి సభలో ఏడుగురు సభ్యులు తగ్గిపోవడంతో మేజిక్ ఫిగర్ కూడా తగ్గింది. రాజీనామా చేసిన వారంతా కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులే కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గింది. ఆ వెంటనే రాజీనామా చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. వారిలో ఐదుగురు గెలిచారు. దీంతో సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 115కు చేరి స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీన్నే ‘ఆపరేషన్ కమల’ అని వ్యవహరిస్తారు. అప్పట్లో ‘ఆపరేషన్ కమల’ను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అందరూ మెచ్చుకున్నారు. -
జంప్ జిలానీలకు కష్టకాలం!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మార్లు చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఓ అంచనాకు వచ్చేలా ఫలితాలు ఉపయోగపడ్డాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నా ఏ కారణాల చేతనో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవతోందంటున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఈ అసంతృప్తి మరింతగా ఉందని సమాచారం. ప్రభుత్వ పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజాభిప్రాయం ఎంతో సానుకూలంగా ఉన్నా, కొందరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అలా లేదంటున్నారు. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా ఈ మేరకు పార్టీ అధినేతకు సమాచారం కూడా చేరిందని చెబుతున్నారు. జంప్ జిలానీలుగా ముద్రపడిన ఇతర పార్టీలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణల పేర జరిగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం ఏకంగా 88కి పెరిగింది. కాం గ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. వీరిలో గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ శాసన సభాపక్షంలో విలీనం అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీకి చెందిన 12 మంది, వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఎల్పీలో విలీనం అయ్యారు. కాగా, కాంగ్రెస్‌నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా శాసనసభ రికార్డుల్లో మాత్రం వారు గెలిచిన పార్టీల సభ్యులుగానే కొనసాగుతున్నారు. మొత్తంగా ఈ 25 మంది ఎమ్మెల్యేల్లో ఓ ఇద్దరు ముగ్గురు మినహా మిగతావారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలతో దూరం పెరిగిందన్న సమాచారం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మింగుడుపడని సమాచారం.. జంప్ జిలానీ ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దీనికన్నా ఏం భిన్నంగా లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కనీసం నూరు స్థానాల్లో గెలుపును లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్కు ఈ సమాచారం మింగుడుపడటం లేదంటున్నారు. దీంతో అటు పార్టీ పరిస్థితి, ఇటు ప్రభుత్వ పనితీరూ బాగా ఉండి కొందరు ఎమ్మెల్యేల విషయంలోనే ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందో తెలుసుకునేందుకు గులాబీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే కొందరు సిట్టింగ్‌ల మెడపై కత్తి వేలాడుతున్నట్టేనని పార్టీ వర్గాలు అను కుంటున్నాయి. కారణాలపై ఆరా.. ప్రజల్లోకి చొచ్చుకుపోలేక పోతున్నారా? వారితో నిత్య సంబంధాలను కొనసాగించలేక పోతున్నారా? అభివృద్ధి పనులు చేపట్టి, వాటిని పూర్తి చేయడంలో వెనుకబడి పోతున్నారా? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెదకడం ద్వారా గులాబీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం మొదలు పెట్టిందని చెబుతున్నారు. అరవైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని క్షేత్రస్థాయి సమాచారంతో విశ్లేషిస్తున్నారని అంటున్నారు. కాగా, కనీసం నలభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తి వివరాలు, సమాచారం సేకరించి విశ్లేషించనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీచే ముప్పు ఏర్పడటంతో దిద్దుబాటు యో చనలో ఉన్నారంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవ ర్గాల్లో పార్టీ నాయకులు, శ్రేణులతో కూడా పూర్తిగా కలసిపోలేక పోయారని, వీరి మధ్య తేడాలు కొనసాగుతుండటం కూడా ఓ కారణంగా కనిపిస్తోందని అనుకుంటున్నా రు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు అధినేత ఎలాంటి చర్యలు చేపడతారోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
సొంతగూటికి జంప్ జిలానీలు!
మేడ్చల్: టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా ఆ పార్టీలో చేరిన కొందరు టీడీపీ నాయకులు తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ వర్గాల సమాచారం మేరకు.. టీఆర్ఎస్లోకి రెండు నెలల క్రితం మేడ్చల్ మండలానికి అప్పటి టీడీపీ సీనియర్ నాయకులు పెద్దఎత్తున మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డితో కలిసి సొంతగూటిని వీడి అధికార పార్టీలో చేరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు, బడానేతలంతా గంపగుత్తగా పార్టీని వీడిపోయారు. అయితే, ‘గులాబీతోట’ వారి చేరికకు ముందే హౌస్‌ఫుల్ కావడంతో టీడీపీలో దక్కిన ప్రాధాన్యత జంప్ జిలానీలకు అక్కడ దక్కలేదు. దీంతోవారు తమ సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో మేడ్చల్ మండలం టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మండలానికి చెందిన సర్పంచ్‌లు, మేడ్చల్ నగర పంచాయతీకి చెందిన నాయకులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుటున్నారని తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఈనెల 14న ఆ పార్టీ తెలంగాన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శామీర్‌పేట్, కీసర మండలాలకు చెందిన కొందరు నాయకులు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సొంతపార్టీలో ఉన్న వలస నేతలపై, సర్పంచ్‌లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. పార్టీ మార్పు విషయం ఆయనకు తెలిసిపోవడంతో విమర్శలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం
టీడీపీతో చేతులు కలిపినా ఫలితం శూన్యం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ‘ఆపరేషన్ ఆకర్ష్’ అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి సంపూర్ణమైంది. సాధారణ ఎన్నికల్లో మొదలైన హస్త పరాభవం స్థానిక పీఠాల పోరుతో ముగిసింది. అధికార పార్టీ అనుకూలత, సొంత పార్టీలోని నాయకత్వ లోపం, స్థానిక ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రయోజనాల ముందు కాంగ్రెస్ వ్యూహాలేవీ ఫలించలేదు. చివరకు ఆగర్భ శత్రువు తెలుగుదేశంతో జతకట్టి లబ్ధిపొందాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఫలితంగా అత్యధిక స్థానాలు సాధించి సుమారు 50కి పైగా స్థానిక పీఠాలనూ కాంగ్రెస్ చేజార్చుకుంది. అధికారపార్టీకి ఉన్న అనుకూలతలతో ఆయా పీఠాలన్నీ దాదాపుగా గులాబీ వశం కావడం గమనార్హం. రంగారెడ్డిలోనూ ఫలించని వ్యూహం తాజాగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని పంచుకునేలా తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి ఎత్తుగడల ముందు కాంగ్రెస్ ప్లాన్ ఫలించలేదు. టీడీపీ సభ్యులు టీఆర్ఎస్ వైపు వెళ్లడంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జెడ్పీలు సహా మరో 10 మున్సిపాలిటీలు, 41 మండల పరిషత్తుల్లో అధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఆయా పీఠాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. సాధారణ, స్థానిక ఎన్నికల్లోనే కాకుండా ఇటీవల జరిగిన శాసనమండలి చైర్మన్ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. -
ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు
-
రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు
హైదరాబాద్ : హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు తెలంగాణ శాసనమండలి నేత డీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు డీఎస్ పావులు కదుపుతున్నారు. వారితో ఆయన ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో డీఎస్ భేటీ కానున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు డి.శ్రీనివాస్‌కు, షబ్బీర్ అలీకి కౌన్సిల్లో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పదవులివ్వడంపై ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి,భానుప్రసాద్‌రావు , భూపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే పదవులు సీనియర్లకే వస్తాయి తప్ప పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వారికి రావనేది వారి ఆరోపణ. దీంతో ఈ ఎమ్మెల్సీలు అధికార టిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు సమాచారం. వీరంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బుధవారం మధ్యాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు.