మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్‌ కమలం ? | Congress alleges poaching by BJP Says Kamal Nath | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్‌ కమలం ?

Published Thu, Mar 5 2020 4:30 AM | Last Updated on Thu, Mar 5 2020 4:30 AM

Congress alleges poaching by BJP Says Kamal Nath - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ డ్రామాకి తెరలేచింది. అధికార కాంగ్రెస్‌ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి రాత్రి కనిపించకపోవడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్‌ కమలంకుట్రలో ఇది భాగమని కాంగ్రెస్‌ ఆరోపించింది. కమల్‌నాథ్‌ సర్కార్‌ని కూల్చడానికి కుట్ర పన్నిన బీజేపీ అధికార కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హరియాణాకు తరలించి ఒక లగ్జరీ హోటల్‌లో ఉంచినట్టుగా రాష్ట్ర మంత్రి జితు పత్వారీ ఆరోపించారు. సీనియర్‌ బీజేపీ నాయకులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, భూపేంద్ర సింగ్‌ తదితరులు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను హరియాణాకు తీసుకువెళ్లారని, ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే తనతో చెప్పారని అన్నారు.

ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారైతే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ఈ ఆరోపణల్ని బీజేపీ నాయకులు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, ఏంచేస్తున్నారో తమకు తెలీదని అన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలలో నలుగురు బుధవారం తిరిగి వచ్చినట్టు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ విలేకరులకు చెప్పారు. మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి తరుణ్‌ భానోట్‌తో కలిసి కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వ్యాపమ్‌ స్కామ్‌ను బట్టబయలు చేసిన డాక్టర్‌ ఆనంద్‌రాయ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకువస్తే రూ.100 కోట్లు, ఎమ్మెల్యేలకి కొత్త కేబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ నేత నరోత్తమ్‌ మిశ్రా తనతో మాట్లాడారంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే అది మార్ఫింగ్‌ వీడియో అని మిశ్రా స్పష్టం చేశారు.  

మాకు మెజార్టీ ఉంది: కమల్‌నాథ్‌  
తన సర్కార్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నడం దారుణమని ఆయన ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ నాటకాలు ఆడుతోందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి గోవింద్‌ ఆరోపించారు. మార్చి 26న జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు విప్‌ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement