mlas missing
-
కేజ్రీవాల్‌కు షాక్.. అజ్ఞాతంలోకి పలువురు ఆప్ ఎమ్మెల్యేలు?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు కలవటం లేదని, వారితో మాట్లాడలేకపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో మొత్తం మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆప్ నేత దిలీప్ పాండే. అయితే, 40 మంది ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలందరితో టచ్‌లో ఉన్నాం. బుధవారమే అందరికి సందేశాలు పంపించాం. ఫోన్లు కలవని వారికి సైతం సందేశాలు చేరుతాయి. మీటింగ్‌కు ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. 40 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది’ అని పేర్కొన్నారు దిలీప్ పాండే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, పలువురు ఎమ్మెల్యేల ఆచూకీ లభించకపోవటంతో ఆప్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీలో చేరే ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు కాషాయపార్టీ ఆఫర్ చేసిందని బుధవారం ఆరోపించారు సౌరభ్ భరద్వాజ్. అంతకు ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం బీజేపీపై ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటే బీజేపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం -
కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు
భోపాల్/సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కీలకనేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరుకు మకాం మార్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను వలలో వేసుకుంటోందంటూ ఇటీవల కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగివచ్చి సర్కారుకు మద్దతు పలకడం తెలిసిందే. అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. రిసార్టులో మకాం కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. ఆరోగ్య, కార్మిక, రవాణా, మహిళా శిశు సంక్షేమ, ఆహార, పౌర సరఫరాలు, విద్యా శాఖలకు చెందిన ఆరుగురు మంత్రులు తులసి సిలావత్, మహేంద్ర సింగ్ సిసోడియా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇమార్తీ దేవి, ప్రద్యుమ్నసింగ్ తోమర్, ప్రభురా చౌధరితోపాటు ఎమ్మెల్యేలు సింథియా వెంట ఉన్నారు. వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, సింథియా మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని పీటీఐ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు వచ్చిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో లేరని సిద్ధరామయ్య చెప్పినట్లు సమాచారం. అనంతరం మాజీ మంత్రి జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావుకు భోపాల్ రావాల్సిందిగా నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. ఏమిటీ సమస్య? సీఎం కమల్‌నాథ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం మూడు రాజ్యసభ (కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా) సీట్ల కోసం ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాల ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవడం ఖాయం. తాజా పరిణామంతో కాంగ్రెస్‌కు మూడో సీటు దక్కడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితిని పార్టీ చీఫ్ సోనియాకు వివరించేందుకు కమల్‌నాథ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన 12న తిరిగి రావాల్సి ఉంది. నేడు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ 16న రాష్ట్ర బడ్జెట్, 26న రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కోల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన బీజేపీ సమావేశానికి సైతం వీరు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతల్లోనూ ఉత్కంఠ పెరిగింది. రెండు రాజ్యసభ సీట్ల కోసం పార్టీ నేతలు రాంమాధవ్, కైలావ్ విజయ్‌వర్గీయ సహా 22 మంది పేర్లను సోమవారం రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది. -
మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం ?
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ డ్రామాకి తెరలేచింది. అధికార కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి రాత్రి కనిపించకపోవడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్ కమలంకుట్రలో ఇది భాగమని కాంగ్రెస్ ఆరోపించింది. కమల్‌నాథ్ సర్కార్‌ని కూల్చడానికి కుట్ర పన్నిన బీజేపీ అధికార కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హరియాణాకు తరలించి ఒక లగ్జరీ హోటల్లో ఉంచినట్టుగా రాష్ట్ర మంత్రి జితు పత్వారీ ఆరోపించారు. సీనియర్ బీజేపీ నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర సింగ్ తదితరులు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను హరియాణాకు తీసుకువెళ్లారని, ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే తనతో చెప్పారని అన్నారు. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారైతే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ఈ ఆరోపణల్ని బీజేపీ నాయకులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, ఏంచేస్తున్నారో తమకు తెలీదని అన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలలో నలుగురు బుధవారం తిరిగి వచ్చినట్టు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు. మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోట్తో కలిసి కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వ్యాపమ్ స్కామ్‌ను బట్టబయలు చేసిన డాక్టర్ ఆనంద్‌రాయ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకువస్తే రూ.100 కోట్లు, ఎమ్మెల్యేలకి కొత్త కేబినెట్లో మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా తనతో మాట్లాడారంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే అది మార్ఫింగ్ వీడియో అని మిశ్రా స్పష్టం చేశారు. మాకు మెజార్టీ ఉంది: కమల్‌నాథ్ తన సర్కార్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నడం దారుణమని ఆయన ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ నాటకాలు ఆడుతోందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి గోవింద్ ఆరోపించారు. మార్చి 26న జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు విప్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
వేడెక్కిన కన్నడ రాజకీయం
సాక్షి, బెంగళూరు/శివాజీనగర/మైసూరు: కన్నడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని జేడీఎస్– కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలనే లాక్కునేందుకు కుమారస్వామి సర్కారు ప్రయత్నిస్తోందంటూ బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగాయి. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరు వెళ్లనివ్వకుండా, పార్టీ అగ్ర నేతలు అక్కడే ఉంచారని, తాజాగా గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో వారికి బస ఏర్పాటు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు, కాంగ్రెస్– జేడీఎస్‌లకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ‘కనిపించడం’ లేదన్న వార్తలు ప్రభుత్వ శిబిరంలో ఆందోళనలకు కారణమయ్యాయి. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు తమ శిబిరంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ఇరు పార్టీల నేతలు మీడియాకు సమాచారమిస్తుండటంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ అయిన 113ను మించి కాంగ్రెస్– జేడీఎస్‌లకు 118 మంది సభ్యుల మద్దతుండగా, బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలున్నారు. వారు చెప్పే వెళ్లారు: సీఎం కుమారస్వామి బెళగావి, బళ్లారి జిల్లాలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పక్షంలోకి చేరిపోయారనీ వస్తున్న వార్తలతోపాటు, పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారన్న దానిపైనా సీఎం కుమారస్వామి స్పందించారు. ‘జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బీజేపీ వలలో పడరు. ముంబై వెళ్లిన ఎమ్మెల్యేలు మా స్నేహితులే. వ్యక్తిగత పనులపై వెళుతున్నట్లు వారు ముందుగానే చెప్పారు. మా ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి కర్ణాటక అంటే భయం పట్టుకుందన్నారు. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసముందని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎక్కడికీ వెళ్లలేదని సీఎల్పీ అధ్యక్షుడు సిద్ధరామయ్య అన్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన రమేశ్ జరకిహొలితో పాటు ఆనంద్ సింగ్, బీ నాగేంద్ర, ఉమేశ్ జాధవ్, బీసీ పాటిల్ తదితర అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రిసార్టు రాజకీయాలు చేయం: యెడ్డీ ‘జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాకు సంబంధం లేదు. మేం వాళ్లను ఎక్కడికీ తీసుకెళ్లలేదు. వాళ్లు ముంబైలో ఎందుకున్నారో ఆ పార్టీల నేతలకే తెలియాలి’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. ‘మా ఎమ్మెల్యేలపై వల వేసేందుకు జేడీఎస్– కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మావారిని ఢిల్లీలో ఉంచాం. రెండు రోజుల తర్వాత వారంతా తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేపడతారు’ అని తెలిపారు. రిసార్టు రాజకీయాలు మాకు అవసరం లేదన్నారు. -
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న శశికళా నటరాజన్‌కు అనుకోకుండా పెద్ద షాక్ తగిలింది. అత్యంత జాగ్రత్తగా బస్సులలో ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటళ్లు, రిసార్టులకు తరలించి.. వాళ్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నా, అందులోంచి ఉన్నట్టుండి 43 మంది మిస్సయ్యారు. వీళ్లంతా పన్నీర్ సెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం. తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. తన వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదవి చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న శశికళకు ఇది అనుకోని షాక్ అయ్యింది. ప్రభుత్వం నిలబడాలంటే 233 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో కనీసం 117 మంది మద్దతు అవసరం అవుతుంది. ఉన్న 130 మందిలోంచి 43 మంది వెళ్లిపోతే ఇక ఆమె వద్ద మిగిలేది 80-90 మంది మధ్య మాత్రమే. అలాంటప్పుడు ఆమె ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసినా, సభలో బలం నిరూపించుకోలేక వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలన, శాంతిభద్రతల గురించి చర్చించడానికే సీఎస్, డీజీపీలను పిలిపించినట్లు చెబుతున్నా.. నిజానికి ఎమ్మెల్యేల క్యాంప్ ఎక్కడ, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ విభాగం ఏమంటోందో తెలుసుకోడానికే పన్నీర్ వాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది. ఇక గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చెన్నై రాజ్‌భవన్‌కు వస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు రాజకీయ నాయకులను కలుస్తారో లేదోనన్నది అనుమానంగానే ఉంది. ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ ఇచ్చి, మిగిలినది తాను సభలో నిరూపించుకుంటానని చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ముందుగా డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులను పిలిపిస్తారు. ఆ తర్వాత తనవద్ద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసుకుంటారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు సాయంత్రం తర్వాత మరింత వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.