సాక్షి, బెంగళూరు/శివాజీనగర/మైసూరు: కన్నడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని జేడీఎస్– కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలనే లాక్కునేందుకు కుమారస్వామి సర్కారు ప్రయత్నిస్తోందంటూ బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగాయి. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరు వెళ్లనివ్వకుండా, పార్టీ అగ్ర నేతలు అక్కడే ఉంచారని, తాజాగా గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో వారికి బస ఏర్పాటు చేశారని వార్తలు గుప్పుమన్నాయి.
మరోవైపు, కాంగ్రెస్– జేడీఎస్‌లకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ‘కనిపించడం’ లేదన్న వార్తలు ప్రభుత్వ శిబిరంలో ఆందోళనలకు కారణమయ్యాయి. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు తమ శిబిరంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ఇరు పార్టీల నేతలు మీడియాకు సమాచారమిస్తుండటంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ అయిన 113ను మించి కాంగ్రెస్– జేడీఎస్‌లకు 118 మంది సభ్యుల మద్దతుండగా, బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలున్నారు.
వారు చెప్పే వెళ్లారు: సీఎం కుమారస్వామి
బెళగావి, బళ్లారి జిల్లాలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పక్షంలోకి చేరిపోయారనీ వస్తున్న వార్తలతోపాటు, పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారన్న దానిపైనా సీఎం కుమారస్వామి స్పందించారు. ‘జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బీజేపీ వలలో పడరు. ముంబై వెళ్లిన ఎమ్మెల్యేలు మా స్నేహితులే. వ్యక్తిగత పనులపై వెళుతున్నట్లు వారు ముందుగానే చెప్పారు. మా ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు’ అని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీకి కర్ణాటక అంటే భయం పట్టుకుందన్నారు. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసముందని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎక్కడికీ వెళ్లలేదని సీఎల్పీ అధ్యక్షుడు సిద్ధరామయ్య అన్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన రమేశ్ జరకిహొలితో పాటు ఆనంద్ సింగ్, బీ నాగేంద్ర, ఉమేశ్ జాధవ్, బీసీ పాటిల్ తదితర అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రిసార్టు రాజకీయాలు చేయం: యెడ్డీ
‘జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాకు సంబంధం లేదు. మేం వాళ్లను ఎక్కడికీ తీసుకెళ్లలేదు. వాళ్లు ముంబైలో ఎందుకున్నారో ఆ పార్టీల నేతలకే తెలియాలి’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. ‘మా ఎమ్మెల్యేలపై వల వేసేందుకు జేడీఎస్– కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మావారిని ఢిల్లీలో ఉంచాం. రెండు రోజుల తర్వాత వారంతా తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేపడతారు’ అని తెలిపారు. రిసార్టు రాజకీయాలు మాకు అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment