బెంగళూరు: కర్ణాటకలో మైకులు మూగబోయాయి. నెలకు పైగా జోరుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. పార్టీలు, అభ్యర్థులు మంగళవారం కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అవినీతే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్లారు.
ఇక బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. అమిత్ షా, నడ్డా వంటి అతిరథులు రంగంలోకి దిగినా ప్రధానంగా మోదీయే సుడిగాలి పర్యటనలు, వరుస సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచే కర్ణాటకలో పదేపదే పర్యటించిన ఆయన, 10 రోజుల్లో ఏకంగా 19 భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలతో రాష్ట్రమంతటా చుట్టేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
40 శాతం కమీషన్ల సర్కారు విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ 85 శాతం కమిషన్ల పార్టీ అంటూ ప్రతి దాడికి దిగారు. ఇక ప్రచారం చివరి దశలో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ జాతీయ నేతలు మొత్తం 206 సభలు, 90 రోడ్‌షోలు, రాష్ట్ర నేతలు 231 బహిరంగ సభలు, 48 రోడ్ షోలు నిర్వహించారు.
ఇక కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలంతా కలిసి 99 బహిరంగ సభలు, 33 రోడ్‌షోలు జరిపారు. విషసర్పం, పనికిమాలిన కుమారుడు, విషకన్య తదితర వ్యక్తిగత విమర్శలు ఈసారి కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో హైలైట్‌గా నిలిచాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు, ఎలాగైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నించాయి. ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధనే లక్ష్యంగా రెండు పార్టీలూ పరిశ్రమించాయి. జేడీ(ఎస్) నేతలు కూడా నిప్పులు చెరిగే ఎండల్లో చెమటలు కక్కారు. ఇప్పుడిక బుధవారం జరగబోయే కీలకమైన పోలింగ్ మీదే అందరి దృష్టీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు 13వ తేదీన వెలువడనున్నాయి.
రూ.375 కోట్లు జప్తు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబ్బు కట్టలు తెంచుకుని పారింది. మార్చి 29 నుంచి ఏకంగా రూ.375.6 కోట్ల మేరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.147 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువైన మద్యం, రూ.97 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.24 కోట్ల విలువైన కానుకలు, రూ.24 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏకంగా 2,896 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. మార్చి 29కి ముందు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న రూ.58 కోట్ల విలువైన నగదు తదితరాలు దొరికాయి.
Comments
Please login to add a commentAdd a comment