కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం.
బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి...
కోస్తా కర్ణాటక
బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరగడమే ఇందుకు కారణం.
బెంగళూరు సిటీ
రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది.
ముంబై కర్ణాటక
లింగాయత్‌ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్‌గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్‌కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను దూరం పెట్టిన లింగాయత్‌లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్‌ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి.
పాత మైసూరు
64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి!
సెంట్రల్ కర్ణాటక
ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది!
హైదరాబాద్ కర్ణాటక
తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment