
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్.అశోక్ ఆరోపించారు. ఎవరూ కరెంటు బిల్లులు చెల్లించరాదని, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఎన్నికల సమయంలో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ ప్రచారం చేశారన్నారు.
ఎవరైనా కరెంటు బిల్లులు చెల్లిస్తే సిద్దూ, డీకే శివకుమార్‌ను అవమానించినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గ్యారంటీ పథకాల అమలుపై షరతులు విధిస్తే ప్రజలను మోసిగించిట్లేనన్నారు. కాంగ్రెస్‌కు సత్తా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని ఆయన సవాల్ విసిరారు.