చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు.
► ఈ లిస్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.
► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు.
► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు.
► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు.
గెలిచిన ప్రముఖులు..
► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు.
► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు.
► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు.
► కుమారస్వామి సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు.
► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు.
► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment