vote share
-
ఆ ఐదు శాతమే! రాత మార్చింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం. బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి... కోస్తా కర్ణాటక బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరగడమే ఇందుకు కారణం. బెంగళూరు సిటీ రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది. ముంబై కర్ణాటక లింగాయత్‌ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్‌గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్‌కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను దూరం పెట్టిన లింగాయత్‌లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్‌ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి. పాత మైసూరు 64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి! సెంట్రల్ కర్ణాటక ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది! హైదరాబాద్ కర్ణాటక తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంచలన విజయంతో కాంగ్రెస్ సరికొత్త రికార్డు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయం సాధించింది. అలాగే అత్యధిక ఓటింగ్ శాతంతో మాత్రమే కాదు.. ఒక పార్టీకి విజయం దక్కడంలోనూ అక్కడ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. 34 ఏళ్ల తర్వాత.. ఒక పార్టీ ఇంతేసి ఓటు షేర్, ఇన్నేసి స్థానాలతోనూ గెలుపొందడం ఈ ఎన్నికల్లోనే జరిగింది. ► 1994లో 115 స్థానాలు గెలుపొందిన జేడీఎస్ మొత్తం ఓటింగ్‌లో 33.54 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా హెచ్డీ దేవగౌడ ప్రమాణం చేశారు. ► 1999 ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 132 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 40.84 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. ఎంఎం కృష్ణను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ► 2004 ఎన్నికల్లో.. 79 స్థానాలు నెగ్గిన బీజేపీ.. కేవలం 28.33 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2008లో 110 స్థానాలు గెలుపొందిన బీజేపీ.. 33.86 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. మళ్లీ యడియూరప్పనే సీఎంను చేసింది. ► 2013 అసెంబ్లీ ఎన్నికల్లో.. 122 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. 36.6 శాతం ఓటు షేర్‌ను దక్కించుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ► 2018 ఎన్నికల్లో.. 104 స్థానాలు, 36.3 శాతం ఓటు షేర్ దక్కించుకుంది బీజేపీ. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2023 ఎన్నికల్లో.. 136 స్థానాలు, 43 శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో కంటే ఏకంగా ఐదు శాతం ఓటింగ్‌ను పెంచుకుంది కాంగ్రెస్. ఇక గతంలో.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 178 స్థానాలు దక్కించుకుని.. 43.76 శాతం ఓటు షేర్‌ను కైవసం చేసుకుంది. వీరేంద్ర పాటిల్‌ను అప్పుడు సీఎంను చేసింది. -
Karnataka assembly elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి. ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది. 2013 ఎన్నికలు ప్రత్యేకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది. ఎందుకీ పరిస్థితి..? కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్‌కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్‌లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. -
బీజేపీ సొంతంగా సాధించిన సీట్లు ఎన్నో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్ తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఫట్! బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్‌కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది. 10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి 12.88, కాంగ్రెస్‌కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు) బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్పీకి 1 అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) ‘నోటా’నే బెటర్! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్సీపీ 0.05, ఎస్హెచ్ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీఆర్వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
ఓట్లు పెరిగినా తగ్గిన సీట్లు
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ కాంగ్రెస్‌తో ఉత్కంఠ పోరులో హోరాహోరీగా తలపడినా చివరికి కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 114 స్ధానాల్లో విజయం సాధించి మేజిక్ మార్క్‌కు కొద్ది అడుగుల దూరంలో నిలిచింది. బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. సీట్ల సంఖ్య పరంగా బీజేపీ వెనుకబడినా కాంగ్రెస్ కంటే అధిక శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 1,56,42,960, కాంగ్రెస్‌కు 1,55,95,153, స్వతంత్రులు 22,18,230, బీఎస్పీ, 1,91,1642 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి అధికంగా ఓట్లు దక్కినా అత్యధిక సీట్లు కాంగ్రెస్ వశమయ్యాయి. అయితే 2013 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ నాలుగు శాతం మేర ఓట్లు పెంచుకోగా, బీజేపీ నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది. మరోవైపు రైతు ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ తన పట్టునిలుపుకోవడం గమనార్హం. -
పార్టీ బతకడం కష్టమా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వరుస పరంపరగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. రానున్న రోజుల్లో టీడీపీని జాతీయస్థాయి పార్టీగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఆ పార్టీ మరింతగా కుంచించుకుపోతోంది. ఇటీవల జరిగిన వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పాటు తాజాగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీడీపీ ఘోర పరాజయం ఆ పార్టీ తెలంగాణలో మనుగడ సాధించడమే కష్టంగా మారుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో లభించిన ఓట్ల వివరాలతో పోల్చితే ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన వరంగల్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషిస్తే టీడీపీ దాదాపు 12 శాతానికి పైగా ఓట్లను కోల్పోయింది. గతంలో బలం ప్రదర్శించిన ప్రాంతాల్లోనూ టీడీపీ ఓట్లు చెల్లాచెదురు కావడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టతరంగా మారుతున్న పరిణామాలు ఆయా ఉపఎన్నికల ఫలితాల సరళి తెలియజేస్తుండగా నాయకులు కూడా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. నేతలు వెళ్లిపోతున్న పరిణామం కూడా పార్టీ అస్తిత్వం ఉంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ మద్దతునివ్వగా ఆ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 24 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 సెగ్మెంట్లలో కేవలం ఒకే ఒక్క డివిజన్ గెలుచుకుని టీడీపీ పూర్తిగా చతికిలపడిన విషయం తెలిసిందే. అది కూడా బీజేపీ మద్దతుతో రంగంలోకి దిగిన టీడీపీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు. వరంగల్ లోక్ సభ ఫలితాలు 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్కు 6,61,639 ఓట్లు రాగా రెండో స్థానంలో కాంగ్రెస్ (2,69,065) నిలిచింది. టీడీపీ మద్దతునిచ్చిన బీజేపీ మూడో స్థానానికి (1,87,639) పరిమితమైంది. ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో 2015 లో జరిగిన ఉపఎన్నికల్లో కొత్త ఆశలతో బరిలోకి దిగిన బీజేపీ-టీడీపీకి మరింత చేదు అనుభవం ఎదురైంది. 2015 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (6,15,403), కాంగ్రెస్ (1,56,311), టీడీపీ మద్దతునిచ్చిన బీజేపీ (1,30,178) మూడో స్థానానికే పరిమితమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్ష టీడీపీ-బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అదే కాకుండా ఆ జిల్లాకు చెందిన ధర్మారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలు ఎంతోమంది ఇప్పటికీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. గ్రేటర్లో దారుణం గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ మద్దతుతో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ రెండు పార్టీలు (టీడీపీ 9, బీజేపీ 5) 14 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తంగా ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిపి 34.42 శాతం ఓట్లను సాధించగా ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీలు 11 శాతానికి పైగా ఓట్లను కోల్పోయాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కలో చూస్తే.. సాధారణ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి 14,66,078 ఓట్లు రాగా, ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 7,85,300 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల పరంగా విశ్లేషిస్తే సగానికి సగం ఓట్లు ఆ పార్టీలు కోల్పోయాయి. ఖేడ్‌లో డిపాజిట్ గల్లంతు 2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో చేరగా, సాధారణ ఎన్నికల్లో టీడీపీ 40,405 ఓట్లు సాధించగా ప్రస్తుత ఉపఎన్నికలో కేవలం 14,787 ఓట్లను మాత్రమే సాధించింది. 2014 ఎన్నికలో నమోదైన స్థాయిలోనే తాజా ఉపఎన్నికలో కూడా పోలింగ్ నమోదు కాగా ఈ రెండేళ్లలో టీడీపీ 25,618 ఓట్లను కోల్పోయింది. సైకిల్ దిగుతున్న నేతలు తెలంగాణ ప్రాంతంలో గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోగా వారిలో 10 మంది ఇప్పటికే ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. వారితో పాటు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా టీడీపీని వీడుతున్నారు. మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించి పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తెస్తామని టీడీపీ నిర్వహించిన గత మహానాడులో ప్రకటించింది. పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తనకు తానుగా పార్టీ జాతీయాధ్యక్షుడిగా, తన కుమారుడిని ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. మూడు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపిన టీడీపీకి ఎదురవుతున్న పరిస్థితులు సబ్ రీజనల్ పార్టీ స్థాయికి కుదించుకుపోతోందని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. ఏపీ ఎఫెక్ట్ గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 5లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో అధికారం చేపట్టిన టీడీపీ ఇప్పుడు ఆ ప్రాంతంలోనూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టు స్పష్టంగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎంతోమంది టీడీపీ నేతలు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న చాలామందిని ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేసి తరలించి ఓట్లు వేయించుకున్న విషయంపై అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో టీడీపీకి ఓట్లు వేసినవారే ఇప్పుడు ఆ పార్టీని ఛీత్కరించడమంటే ఏపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడం, ఇటీవల జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం విషయంలో అనుసరించిన దోబూచులాట వైఖరి, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మిగిలిన సామాజిక వర్గాలను విస్మరించడం, అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించకపోవడం, ఏపీకి కీలకమైన ప్రత్యేకహోదా సాధించలేక చతికిలపడటం వంటి వైఫల్యాలతో పాటు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వస్తున్న విమర్శలు... టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. -కె.సుధాకర్ రెడ్డి