సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది.
బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్
తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి.
బీఎస్‌పీ, కాంగ్రెస్ ఫట్!
బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్‌పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్‌కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది.
10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు
తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్‌పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్‌పీకి 12.88, కాంగ్రెస్‌కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు)
బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్‌పీకి 1
అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్)
‘నోటా’నే బెటర్!
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్‌సీపీ 0.05, ఎస్‌హెచ్‌ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్‌జేపీఆర్‌వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు)
Comments
Please login to add a commentAdd a comment