సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని ఎవరు అధిరోహించాలన్నది నిర్ణయించడంలో యువతే కీలక భూమిక పోషించనుంది. తమ భవిష్యత్తు అవసరాలను తీర్చగలవని నమ్మిన పార్టీలను ఎన్నుకుంటూ వస్తూనే.. తమ కలలను నెరవేర్చని ప్రభుత్వాలను కూలదోస్తూ.. ప్రతి ఎన్నికలో కీలకంగా మారింది. అందుకే యూపీ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఏకంగా యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోనే విడుదల చేసింది.
నిర్ణయాత్మకంగా మారడంతో..
యూపీలో ప్రస్తుత ఎన్నికల్లో 15.02 కోట్ల మంది ఓటు వేయనుండగా.. అందులో ఏకంగా 4 కోట్ల మంది 18–39 ఏళ్ల మధ్య వయసున్న యువతే. అందులోనూ కొత్తగా 19.89 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓట్లను దృష్టిలో పెట్టుకొనే అన్ని రాజకీయ పార్టీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతోపాటు, మెజార్టీ సంఖ్యలో సీట్లను కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2007 నుంచి ప్రతి ఎన్నికలో సుమారు 70 మంది యువ ఎమ్మెల్యేలు యూపీ అసెంబ్లీకి వస్తున్నారు. ప్రస్తుతం ముగుస్తున్న అసెంబ్లీలోనూ 71 మంది ఎమ్మెల్యేల వయసు 40 ఏళ్లకన్నా తక్కువే కావడం గమనార్హం. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు ఏకంగా 128 మంది వరకు ఉన్నారు.
హామీ మరిస్తే ఇంటికే..
ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకున్నా, నిధుల కేటాయింపులో ప్రాధాన్యం తగ్గినా యువత తమ సత్తా చూపిస్తోంది. 2007లో మాయావతి (బహుజన సమాజ్ పార్టీ–బీఎస్పీ) యువత లక్ష్యంగా.. ఉద్యోగాల కల్పన, విద్యా ఖర్చుల తగ్గింపు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి వంటి హామీలు ఇచ్చారు. దానితో దళిత, ముస్లిం యువత మొత్తం ఆమె వెంట నడిచింది. ఆమె మొత్తం 403 సీట్లకుగాను 206 సీట్లు గెలుపొందారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చాక 18–30 ఏళ్ల యువత కోసం ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. ఐదేళ్ల పాలనా కాలంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారు. పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు హామీ నీరుగారింది. దీనిపై ఆగ్రహించిన యువత బీఎస్పీకి దూరమైంది. ఫలితంగా 2012లో బీఎస్పీకి 80 సీట్లు మాత్రమే వచ్చాయి, 2017 నాటికి 19 సీట్లకు పడిపోయాయి.
►సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్‌యాదవ్.. 2012 ఎన్నికల్లో 3.8 కోట్ల మంది యువ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, తమ మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. 10వ తరగతి పిల్లలకు ట్యాబ్లెట్, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్‌టాప్, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు వంటి హామీలు ఇచ్చారు. యువత మద్దతుగా నిలవడంతో ఎస్పీ ఏకంగా 224 సీట్లు గెలుచుకొని అధికారంలో వచ్చింది. అఖిలేష్‌యాదవ్ అధికారంలోకి వచ్చాక.. విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌ల పంపిణీ నామమాత్రంగానే సాగింది. ఆయన ఐదేళ్ల పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇతర హామీలూ పూర్తిగా అమలుకాలేదు. దానితో 2017 ఎన్నికల్లో యువత దూరమై.. ఎస్పీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది.
►2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్, ఐదుగురు యువకులు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. కానీ హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల కల్పనలో బీజేపీ సఫలం కాలేకపోయింది. పైగా నిరుద్యోగం పెరగడంతో యువత రోడ్లెక్కారు. ప్రయాగ్‌రాజ్, లక్నోలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మరోవైపు టెట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశం సుమారు 20లక్షల మంది యువతను ఇబ్బందుల్లో నెట్టడంతో బీజేపీ సర్కారు అపఖ్యాతి పాలైంది. ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు బీజేపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందులో రవికిషన్, గౌతమ్ గంభీర్, బబితా ఫోగట్, తేజస్వి సూర్య వంటి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించి.. యువ, ప్రగతిశీల ఓటర్లలో బీజేపీని విస్తరించేలా కార్యక్రమాలు నిర్వహించింది.
ప్రత్యేక మేనిఫెస్టోతో కాంగ్రెస్..
యువత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏకంగా యూత్ మేనిఫోస్టోనే తెరపైకి తెచ్చింది. రెండు రోజుల కింద కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిని ఆవిష్కరించారు. ‘భారతీ విధాన్’ పేరుతో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 8లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. గతంలో 25–30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసి విఫలమైందని.. కాంగ్రెస్ అమలుచేసి చూపించి యువత విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment