న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ ఖాతాల్లో ప్రస్తుతం రూ.669 కోట్లున్నాయి. బీఎస్‌పీ తర్వాతి స్థానాల్లో వరుసగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఉండగా ఐదో స్థానంలో అధికార బీజేపీ ఉండటం గమనార్హం. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికల ద్వారా ఈ విషయం వెల్లడయింది. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘానికి అందించిన నివేదిక ప్రకారం.. బహుజన్ సమాజ్ పార్టీకి దేశ రాజధానిలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పార్టీకి చెందిన 8 ఖాతాల్లో రూ.669 కోట్ల నిధులున్నాయి.
దీంతోపాటు రూ.95.54 లక్షలు నగదు రూపంలో కూడా ఉన్నట్లు తెలిపింది. ఇదంతా విరాళాల ద్వారానే సేకరించినట్లు బీఎస్‌పీ పేర్కొందని అధికారులు వివరించారు. రూ.471 కోట్ల నిల్వలతో సమాజ్‌వాదీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీల ఎన్నికల తర్వాత ఈ మొత్తం రూ.460 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో తమకు రూ.24 కోట్ల మేర విరాళాలు అందడంతో నిల్వలు రూ.669 కోట్లకు చేరినట్లు బీఎస్‌పీ వెల్లడించింది. బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో రూ.196 కోట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ లెక్కలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గత ఏడాది నవంబర్‌లో ఈసీకి సమర్పించిన వివరాల్లో పేర్కొన్నవి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను కాంగ్రెస్ ఈసీకి అందజేయలేదు. అధికార బీజేపీ విషయానికొస్తే.. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టినట్లు వెల్లడించిన ఈ పార్టీ రూ.82 కోట్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు వెల్లడించింది. 2017–18 సంవత్సరాల్లో ఎలక్టోరల్ బాండ్లు, విరాళాల ద్వారా అందిన రూ.1,027 కోట్లలో రూ.758 కోట్లను ఎన్నికల్లో వెచ్చించినట్లు ఈసీకి బీజేపీ తెలిపింది. ఈ విషయంలో రూ.107 కోట్లున్న తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీ వెనుకబడి ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆయా పార్టీల నిధుల్లో 87 శాతం వరకు స్వచ్ఛంద విరాళాల ద్వారా అందినవేనని పేర్కొనగా బీజేపీ మాత్రమే 2017–18 కాలంలో రూ.210 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించినట్లు తెలిపింది.
కాగా, ఆయా పార్టీలు ఆదాయ పన్ను రిటర్నుల్లో చూపిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. 2016–17, 2017–18 సంవత్సరాల్లో బీజేపీ అత్యధికంగా రూ.1,034 కోట్లు, రూ.1,027 కోట్లు విరాళాల రూపంలో అందుకున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఆ పార్టీ ఆదాయం రూ.174 కోట్ల నుంచి రూ.52 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా, 2016–17లో కాంగ్రెస్ ఆదాయం రూ.225 కోట్లుగా ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఈసీకి ఆదాయ వివరాలను అందజేయలేదు. సీపీఎం ఆదాయం గత కొద్ది సంవత్సరాలుగా రూ.100 కోట్లుగా ఉంది.
బ్యాంక్ బ్యాలెన్స్‌లో బీఎస్పీ టాప్
Published Tue, Apr 16 2019 4:22 AM | Last Updated on Tue, Apr 16 2019 7:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment