న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో 918 మంది అభ్యర్థులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఈ ఎన్నికల్లో 10.01 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ ఎన్నికల్లో చండీగఢ్ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్(13), పంజాబ్(13), పశ్చిమబెంగాల్(9) బిహార్(8), మధ్యప్రదేశ్(8), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్(4) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఆరు విడతల్లో పోలింగ్ సగటు 66.88 శాతంగా నిలిచింది. ఏడో విడత పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత పత్రికలు, వార్తా చానల్స్ తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రకటించుకోవచ్చు.
చివరివిడత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 13 సీట్లకు గానూ బీజేపీ 11 స్థానాల్లో, మిత్రపక్షం అప్నాదళ్(సోనేలాల్) మిగిలిన రెండు స్థానాల్లో పోటీచేస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలో ఉండగా, ఆయనపై ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున షాలినీయాదవ్ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక పంజాబ్‌లో 13 స్థానాలకు 278 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 24 మంది మహిళా నేతలు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మరో విజయంపై బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిరణ్‌ఖేర్ ధీమాతో ఉండగా, ఆమెను ఓడించి తీరుతామని కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెబుతున్నారు.
బెంగాల్‌లో కట్టుదిట్టమైన భద్రత
పశ్చిమబెంగాల్‌లోని 9 స్థానాలకు ఈసారి హోరాహోరి పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య గట్టిపోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా హింస చెలరేగకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులకు అదనంగా 710 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. ఇక బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు గానూ నలుగురు కేంద్ర మంత్రులు సహా 157 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
జార్ఖండ్‌లోని నాలుగు స్థానాలకు 42 మంది పోటీలో ఉండగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ సీట్లకు 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు గోవాలోని పణజి అసెంబ్లీ స్థానానికి ఆదివారం ఉపఎన్నికలు జరగనున్నాయి. గోవా సీఎం మనోహర్ పరీకర్ మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అలాగే తమిళనాడులోని సూలూరు, అరవకురిచ్చి, ఒట్టాపిదరమ్(ఎస్సీ), తిరుపరన్‌కుంద్రం, కర్ణాటకలోని కుంద్‌గోల్, చించోలి అసెంబ్లీ స్థానాలకూ ఈసీ ఉపఎన్నికలు నిర్వహించనుంది.
బరిలో ఉన్న ప్రముఖులు, నియోజకవర్గం
నరేంద్ర మోదీ (బీజేపీ–వారణాసి)
రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–పట్నా సాహిబ్)
మనోజ్ సిన్హా (బీజేపీ–ఘాజీపూర్)
మహేంద్రనాథ్ పాండే (బీజేపీ–చందౌలీ)
అశ్వినీకుమార్ చౌబే (బీజేపీ–బక్సార్)
రవికిషన్ (బీజేపీ–గోరఖ్‌పూర్)
అనురాగ్ ఠాకూర్ (బీజేపీ–హామీర్పూర్)
హర్దీప్‌సింగ్ పూరీ (బీజేపీ–అమృతసర్)
సన్నీడియోల్ (బీజేపీ–గురుదాస్‌పూర్)
కిరణ్ ఖేర్ (బీజేపీ–చండీగఢ్)
అనుప్రియా పటేల్ (అప్నాదళ్–మీర్జాపూర్)
సుక్బీర్‌సింగ్ బాదల్ (అకాలీదళ్–ఫిరోజ్‌పూర్)
షాలినీ యాదవ్ (ఎస్పీ–బీఎస్పీ–వారణాసి)
అజయ్ రాయ్ (కాంగ్రెస్–వారణాసి)
శత్రుఘ్న సిన్హా (కాంగ్రెస్–పట్నా సాహిబ్)
మీరాకుమార్ (కాంగ్రెస్–సాసారాం)
సునీల్ జక్కర్ (కాంగ్రెస్–గురుదాస్‌పూర్)
పవన్ కుమార్ బన్సల్ (కాంగ్రెస్–చండీగఢ్)
శిబూ సోరెన్ (జేఎంఎం–ధుమ్కా)
మీసాభారతి (ఆర్జేడీ–పాటలీపుత్ర)
రామ్‌కృపాల్‌యాదవ్ (బీజేపీ–పాటలీపుత్ర)
హర్‌సిమ్రత్ బాదల్ (అకాలీదళ్–భటిండా)
Comments
Please login to add a commentAdd a comment