Last phase of polling
-
అలాస్కాలో అమెరికా చివరి ఓటరు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం. అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు. అమెరికా చిట్టచివరి భూభాగం అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది. అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు. రెండో ప్రపంచయుద్ధ స్థావరం ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు. 33 వృక్షాల జాతీయవనం ! అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు. – యాంకరేజ్(అమెరికా) -
ముగిసిన బెంగాల్ పోలింగ్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తుది దశ పోలింగ్‌లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. గురువారం 35 స్థానాలకు జరిగిన ఎనిమిదో విడత పోలింగ్‌లో 76.07శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా భయాలను కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ దశలోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీర్భమ్ జిల్లా ఇలామ్‌బజార్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ అ«భ్యర్థి అనిర్బన్ గంగూలీపై దాడి జరిగినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. కర్రలు, బ్యాట్లు తీసుకొని ఆయనపై దాడి చేయడానికి వచ్చినçప్పుడు ఏర్పడిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడి వెనుక టీఎంసీ మద్దతుదారులు ఉన్నారని గంగూలీ చెప్పారు. తన కారుని పూర్తిగా ధ్వంసం చేశారని అన్నారు. వాళ్లు రాక ముందు వరకు పోలింగ్ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. జొరసాంకో నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మీనాదేవి పురోహిత్ తాను నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు తన కారుపై బాంబులు విసిరారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉండగా ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించారు. మార్చి 27 న మొదలైన పోలింగ్ ఏప్రిల్ 29తో ముగిసింది. -
నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ
స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యామ్‌శరణ్ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి లోక్‌సభ వరకూ ప్రతీఎన్నికల్లో ఓటు వేశారు. భారత్‌లో తొలిఓటర్ కావడంపై నేగీ స్పందిస్తూ..‘1952, ఫిబ్రవరిలో మనదేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే వాతావరణం అనుకూలించదేమోనన్న కారణంతో కిన్నౌర్‌లో 1951, అక్టోబర్‌లోనే ఎన్నికల్ని నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే నేను ఓటేశా’ అని తెలిపారు. రాజకీయ పార్టీలకు కాకుండా నిజాయితీపరులైన, చురుకైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు నేగీ విజ్ఞప్తి చేశారు. కాగా, నేగీని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
కేదార్‌నాథ్‌లో మోదీ
కేదార్నాథ్(ఉత్తరాఖండ్): హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు ఆయన ఆలయాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది. శనివారం ఉదయమే డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ బూడిద రంగు సంప్రదాయ దుస్తులు ధరించారు. హిమాచల్ సంప్రదాయ టోపీ పెట్టుకుని కాషాయరంగు కండువాను నడుముకు చుట్టుకున్నారు. సుమారు అర్ధగంట పాటు ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మందాకినీ నదీ సమీపంలో ఉన్న ఈ 11,755 అడుగుల ఎత్తుగల కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం కేదార్‌నాథ్‌లో 2013 జూన్‌లో వచ్చిన భారీ వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణ పనులను సమీక్షించారు. ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ ఆ పనుల గురించి ప్రధానికి వివరించారు. మధ్యాహ్నం సమయంలో కాసేపు ధ్యానం చేసుకోడానికి ఆలయం సమీపంలోని ‘ధ్యాన్ కుతియా’అనే గుహకు వెళ్లారు. ప్రధాని రాత్రికి అక్కడే గడిపి ఆదివారం ఉదయం బద్రీనాథ్‌కి వెళ్తారు. బద్రీనాథ్ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఇక రెండేళ్లలో మోదీ ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ మాట్లాడుతూ ‘ఆధ్యాత్మిక సందర్శన కోసం మాత్రమే ప్రధాని ఇక్కడికి వచ్చారు’అని తెలిపారు. ప్రధాని రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. ప్రధాని పూజల నేపథ్యంలో భక్తులెవరినీ ఆలయం సమీపంలోకి కూడా అనుమతించలేదని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ మంగేశ్ చెప్పారు. బద్రీనాథ్ ఆలయం సందర్శన అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటనకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా అమల్లోనే ఉందని ప్రధాని కార్యాలయానికి సూచించింది. -
నేడే చివరి విడత పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో 918 మంది అభ్యర్థులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఈ ఎన్నికల్లో 10.01 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో చండీగఢ్ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్(13), పంజాబ్(13), పశ్చిమబెంగాల్(9) బిహార్(8), మధ్యప్రదేశ్(8), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్(4) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఆరు విడతల్లో పోలింగ్ సగటు 66.88 శాతంగా నిలిచింది. ఏడో విడత పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత పత్రికలు, వార్తా చానల్స్ తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రకటించుకోవచ్చు. చివరివిడత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 13 సీట్లకు గానూ బీజేపీ 11 స్థానాల్లో, మిత్రపక్షం అప్నాదళ్(సోనేలాల్) మిగిలిన రెండు స్థానాల్లో పోటీచేస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలో ఉండగా, ఆయనపై ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున షాలినీయాదవ్ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక పంజాబ్‌లో 13 స్థానాలకు 278 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 24 మంది మహిళా నేతలు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మరో విజయంపై బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిరణ్‌ఖేర్ ధీమాతో ఉండగా, ఆమెను ఓడించి తీరుతామని కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెబుతున్నారు. బెంగాల్లో కట్టుదిట్టమైన భద్రత పశ్చిమబెంగాల్లోని 9 స్థానాలకు ఈసారి హోరాహోరి పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య గట్టిపోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగాల్లో పోలింగ్ సందర్భంగా హింస చెలరేగకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులకు అదనంగా 710 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. ఇక బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు గానూ నలుగురు కేంద్ర మంత్రులు సహా 157 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జార్ఖండ్‌లోని నాలుగు స్థానాలకు 42 మంది పోటీలో ఉండగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ సీట్లకు 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు గోవాలోని పణజి అసెంబ్లీ స్థానానికి ఆదివారం ఉపఎన్నికలు జరగనున్నాయి. గోవా సీఎం మనోహర్ పరీకర్ మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అలాగే తమిళనాడులోని సూలూరు, అరవకురిచ్చి, ఒట్టాపిదరమ్(ఎస్సీ), తిరుపరన్కుంద్రం, కర్ణాటకలోని కుంద్గోల్, చించోలి అసెంబ్లీ స్థానాలకూ ఈసీ ఉపఎన్నికలు నిర్వహించనుంది. బరిలో ఉన్న ప్రముఖులు, నియోజకవర్గం నరేంద్ర మోదీ (బీజేపీ–వారణాసి) రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–పట్నా సాహిబ్) మనోజ్ సిన్హా (బీజేపీ–ఘాజీపూర్) మహేంద్రనాథ్ పాండే (బీజేపీ–చందౌలీ) అశ్వినీకుమార్ చౌబే (బీజేపీ–బక్సార్) రవికిషన్ (బీజేపీ–గోరఖ్‌పూర్) అనురాగ్ ఠాకూర్ (బీజేపీ–హామీర్పూర్) హర్దీప్సింగ్ పూరీ (బీజేపీ–అమృతసర్) సన్నీడియోల్ (బీజేపీ–గురుదాస్‌పూర్) కిరణ్ ఖేర్ (బీజేపీ–చండీగఢ్) అనుప్రియా పటేల్ (అప్నాదళ్–మీర్జాపూర్) సుక్బీర్సింగ్ బాదల్ (అకాలీదళ్–ఫిరోజ్‌పూర్) షాలినీ యాదవ్ (ఎస్పీ–బీఎస్పీ–వారణాసి) అజయ్ రాయ్ (కాంగ్రెస్–వారణాసి) శత్రుఘ్న సిన్హా (కాంగ్రెస్–పట్నా సాహిబ్) మీరాకుమార్ (కాంగ్రెస్–సాసారాం) సునీల్ జక్కర్ (కాంగ్రెస్–గురుదాస్‌పూర్) పవన్ కుమార్ బన్సల్ (కాంగ్రెస్–చండీగఢ్) శిబూ సోరెన్ (జేఎంఎం–ధుమ్కా) మీసాభారతి (ఆర్జేడీ–పాటలీపుత్ర) రామ్‌కృపాల్‌యాదవ్ (బీజేపీ–పాటలీపుత్ర) హర్సిమ్రత్ బాదల్ (అకాలీదళ్–భటిండా) -
నేడే ఫైనల్ పోలింగ్
ముంబై: రాష్ట్రంలో గురువారం జరగనున్న తుది విడత ఎన్నికల్లో బరిలో ఉన్న 338 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బిలియనీర్లు, మురికివాడవాసులు, సినీ తారలు, గిరిజనులు, మత్స్యకారులు, రైతులు, వలసవాదులు నిర్ణయించనున్నారు. 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో 43,343 పోలింగ్ కేంద్రాల్లో 3.17 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముంబైలో ఆరు స్థానాలతో కలుపుకొని కోస్తా, పశ్చి,మ మహారాష్ట్రల్లో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 1977లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కాంగ్రెస్ మళ్లీ 2009 లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం చేసింది. ఐదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎన్సీపీ దక్కించుకుంది. 1996లో బీజేపీ, మిత్రపక్షమైన శివసేన పార్టీ చెరో మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. అయితే 2009 ఎన్నికల్లో మాదిరిగానే ముంబైలోని ఆరు స్థానాల్లో గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఒక్క 1977లో తప్ప ఆరు స్థానాలను ఓటర్లు ఒక్క పార్టీకి కట్టబెట్టిన దాఖలాలు కనబడటం లేదు. ముంబై ఓటర్లు ఎప్పడు చారిత్రక తీర్పు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ముంబైకర్లు ఏమీ చేయనున్నారనే దానిపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదీ లెక్క... 1997లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలోని ఐదు స్థానాలను భారతీయ లోక్‌దళ్, ఒక స్థానాన్ని సీపీఐ (ఎం) గెలుచుకుంది. 1980లో జనతా పార్టీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ ఒక్క సీటును దక్కించుకుంది. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా ఐదు స్థానాలు గెలుచుకుంది. మరొక స్థానం ఇండిపెండెంట్‌కి దక్కింది. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీజేపీకి రెండు, శివసేనకు ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థి మరో స్థానంలో గెలిచారు. 1991లో కాంగ్రెస్ నాలుగు స్థానాలు, బీజేపీ, శివసేన తలా ఒకటీ గెలుచుకున్నాయి. 1996లో బీజేపీ, శివసేన చెరో మూడు స్థానాలు తమ ఖాతాలో వేసుకున్నాయి. 1998లో కాంగ్రెస్ రెండు, మిత్రపక్షమైన ఆర్పీఐ ఒకటి, శివసేన రెండు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. 1999లో కాంగ్రెస్ ఒక్క స్థానమే దక్కించుకుంది. బీజేపీ మూడు, శివసేన రెండు స్థానాలు గెలుచుకున్నాయి. 2004లో కాంగ్రెస్ ఏకంగా ఐదు సీట్లు, శివసేన ఒకటీ దక్కించుకున్నాయి. 2009 ఎన్నికల్లో అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ సిట్టింగ్ స్థానాలను ఎలాగైనా నిలుపుకోవాలని డీఎఫ్ కూటమి, వాటిని దక్కించుకునేందుకు మహా కూటమి, తమ ప్రభావాన్ని చూపాలని ఎమ్మెన్నెస్, ఆప్ సర్వశక్తులు ఒడ్డాయి. 19 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్, బీఎస్పీలు కొంత ఓటు బ్యాంక్‌ను తమవైపుకు తిప్పకున్నా, ఎమ్మెన్నెస్ మరికొన్ని ఓట్లు చీల్చినా అది ఎవరికి నష్టం చేకూరుతుందోనన్న ఆందోళన ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కనబడుతోంది. బరిలో ప్రముఖులు... కేంద్ర మంత్రి మిలింద్ దేవరా, కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్, మాజీ జర్నలిస్ట్ సంజయ్ నిరూపమ్, ప్రియాదత్ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నందూర్బార్ నుంచి మాణిక్వ్ ్రగవిత్ బరిలో ఉన్నారు. ఈశాన్య ముంబై నుంచి కిరీత్ సోమయ్య, ఉత్తర మధ్య ముంబై నుంచి పూనమ్ మహాజన్, నందుర్బార్ నుంచి హీనా గవిత్ బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నాసిక్ నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా ఛగన్ భుజ్‌బల్, రాయ్‌గఢ్‌లో సునీల్ తట్కరే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాయ్‌గఢ్‌లో శివసేన అభ్యర్థిగా అనంత్ గీతే బరిలో ఉన్నారు. నాసిక్ నుంచి విజయ్ పాండరే, ఈశాన్య ముంబై నుంచి మేధా పాట్కర్, ఉత్తర మధ్య ముంబై నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఫర్హన్ అజ్మీ పోటీలో ఉన్నారు. ముంబైలో 32,500 మంది పోలీసులు సాక్షి, ముంబై: నగరంలో గురువారం ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తును చేపట్టారు. 32,500 మంది భద్రతా బలగాలను మొహరించారు. నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా మాట్లాడుతూ...పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతను పెంచామన్నారు. ముందు జాగ్రత్తగా కొంత మంది నేరస్తులను కూడా అరెస్టు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మారియా తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.5.36 కోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను మరింత పెంచామన్నారు. కాగా, 19 లోక్‌సభ స్థానాల్లో 951 పోలింగ్ కేంద్రాలను సమస్మాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. భివండీలో అత్యధికంగా 130, పాల్ఘర్లో 111, ఠాణేలో 91, కల్యాణ్‌లో 86, ఔరంగాబాద్‌లో 40, రావేర్లో 40, జల్గావ్లో 33, దిండోరిలో 24, నాసిక్‌లో 43, రాయ్‌గఢ్‌లోని 19 కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటుచేశారు.