నేడే ఫైనల్ పోలింగ్ | Last phase of Maharashtra polls | Sakshi
Sakshi News home page

నేడే ఫైనల్ పోలింగ్

Published Wed, Apr 23 2014 10:15 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Last phase of Maharashtra polls

ముంబై: రాష్ట్రంలో గురువారం జరగనున్న తుది విడత ఎన్నికల్లో బరిలో ఉన్న 338 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బిలియనీర్‌లు, మురికివాడవాసులు, సినీ తారలు, గిరిజనులు, మత్స్యకారులు, రైతులు, వలసవాదులు నిర్ణయించనున్నారు. 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో 43,343 పోలింగ్ కేంద్రాల్లో 3.17 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముంబైలో ఆరు స్థానాలతో కలుపుకొని కోస్తా, పశ్చి,మ మహారాష్ట్రల్లో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 1977లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కాంగ్రెస్ మళ్లీ 2009 లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం చేసింది. ఐదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎన్‌సీపీ దక్కించుకుంది.

1996లో బీజేపీ, మిత్రపక్షమైన శివసేన పార్టీ చెరో మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. అయితే 2009 ఎన్నికల్లో మాదిరిగానే ముంబైలోని ఆరు స్థానాల్లో గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఒక్క 1977లో తప్ప ఆరు స్థానాలను ఓటర్లు ఒక్క పార్టీకి కట్టబెట్టిన దాఖలాలు కనబడటం లేదు. ముంబై ఓటర్లు ఎప్పడు చారిత్రక తీర్పు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ముంబైకర్లు ఏమీ చేయనున్నారనే దానిపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

 ఇదీ లెక్క...
 1997లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలోని ఐదు స్థానాలను భారతీయ లోక్‌దళ్, ఒక స్థానాన్ని సీపీఐ (ఎం) గెలుచుకుంది. 1980లో జనతా పార్టీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ ఒక్క సీటును దక్కించుకుంది. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా ఐదు స్థానాలు గెలుచుకుంది. మరొక స్థానం ఇండిపెండెంట్‌కి దక్కింది. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీజేపీకి రెండు, శివసేనకు ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థి మరో స్థానంలో గెలిచారు. 1991లో కాంగ్రెస్ నాలుగు స్థానాలు, బీజేపీ, శివసేన తలా ఒకటీ గెలుచుకున్నాయి.

 1996లో బీజేపీ, శివసేన చెరో మూడు స్థానాలు తమ ఖాతాలో వేసుకున్నాయి. 1998లో కాంగ్రెస్ రెండు, మిత్రపక్షమైన ఆర్‌పీఐ ఒకటి, శివసేన రెండు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. 1999లో కాంగ్రెస్ ఒక్క స్థానమే దక్కించుకుంది. బీజేపీ మూడు, శివసేన రెండు స్థానాలు గెలుచుకున్నాయి. 2004లో కాంగ్రెస్ ఏకంగా ఐదు సీట్లు, శివసేన ఒకటీ దక్కించుకున్నాయి. 2009 ఎన్నికల్లో అయితే కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ సిట్టింగ్ స్థానాలను ఎలాగైనా నిలుపుకోవాలని డీఎఫ్ కూటమి, వాటిని దక్కించుకునేందుకు మహా కూటమి, తమ ప్రభావాన్ని చూపాలని ఎమ్మెన్నెస్, ఆప్ సర్వశక్తులు ఒడ్డాయి. 19 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్, బీఎస్‌పీలు కొంత ఓటు బ్యాంక్‌ను తమవైపుకు తిప్పకున్నా, ఎమ్మెన్నెస్ మరికొన్ని ఓట్లు చీల్చినా అది ఎవరికి నష్టం చేకూరుతుందోనన్న ఆందోళన ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కనబడుతోంది.

 బరిలో ప్రముఖులు...
 కేంద్ర మంత్రి మిలింద్ దేవరా, కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్, మాజీ జర్నలిస్ట్ సంజయ్ నిరూపమ్, ప్రియాదత్ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  నందూర్బార్ నుంచి మాణిక్వ్ ్రగవిత్ బరిలో ఉన్నారు. ఈశాన్య ముంబై నుంచి కిరీత్ సోమయ్య, ఉత్తర మధ్య ముంబై  నుంచి పూనమ్ మహాజన్, నందుర్బార్ నుంచి హీనా గవిత్ బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నాసిక్ నుంచి ఎన్‌సీపీ అభ్యర్థిగా ఛగన్ భుజ్‌బల్, రాయ్‌గఢ్‌లో సునీల్ తట్కరే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  రాయ్‌గఢ్‌లో శివసేన అభ్యర్థిగా అనంత్ గీతే బరిలో ఉన్నారు. నాసిక్ నుంచి విజయ్ పాండరే, ఈశాన్య ముంబై నుంచి మేధా పాట్కర్, ఉత్తర మధ్య ముంబై నుంచి ఎస్‌పీ అభ్యర్థిగా ఫర్హన్ అజ్మీ పోటీలో ఉన్నారు.

 ముంబైలో 32,500 మంది పోలీసులు
 సాక్షి, ముంబై: నగరంలో గురువారం ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు  పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తును చేపట్టారు. 32,500 మంది భద్రతా బలగాలను మొహరించారు. నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా మాట్లాడుతూ...పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతను పెంచామన్నారు. ముందు జాగ్రత్తగా కొంత మంది నేరస్తులను కూడా అరెస్టు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మారియా తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.5.36 కోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను మరింత పెంచామన్నారు.

 కాగా, 19 లోక్‌సభ స్థానాల్లో 951 పోలింగ్ కేంద్రాలను సమస్మాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. భివండీలో అత్యధికంగా 130, పాల్ఘర్‌లో 111, ఠాణేలో 91, కల్యాణ్‌లో 86, ఔరంగాబాద్‌లో 40, రావేర్‌లో 40, జల్గావ్‌లో 33, దిండోరిలో 24, నాసిక్‌లో 43, రాయ్‌గఢ్‌లోని 19 కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటుచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement