నేడు నగరానికి కేజ్రీవాల్ | Auto, local train ride on Arvind Kejriwal's Mumbai itinerary | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి కేజ్రీవాల్

Published Tue, Mar 11 2014 11:09 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Auto, local train ride on Arvind Kejriwal's Mumbai itinerary

 ముంబై: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నగరానికి రానున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే ఓటర్ల దగ్గరికి వెళ్లనున్నారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కేజ్రీవాల్ ఆటోరిక్షాలో అంధేరీ స్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత చర్చ్‌గేట్‌కు వెళ్లే లోకల్ రైలు ఎక్కి 40 నిమిషాల పాటు ప్రజల మధ్యే సామాన్యుడిలా ప్రయాణించనున్నారు. చర్చ్‌గేట్‌కు చేరుకున్న తర్వాత దక్షిణ ముంబై లోక్‌సభ అభ్యర్థి మీరా సన్యాల్‌తో పాటు ఇతర నాయకులు స్వాగతం పలుకుతారు.

ఆ తర్వాత వారితో కేజ్రీవాల్ అరగంటకు పైగా భేటీ అయి ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఆ తర్వాత మీడియాతో మాట్లాడి ఆగస్టు క్రాంతి మైదాన్ నుంచి కిలాఫత్ హౌస్ వరకు రెండు గంటల పాటు రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ ప్రాంతాలన్నీ సన్యాల్ పోటీచేసే దక్షిణ ముంబై ప్రాంతంలో ఉన్నాయి. అనంతరం సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పోటీచేసే ఈశాన్య ముంబైలో రోడ్‌షో నిర్వహిస్తార’ని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 రేపు నాగపూర్‌లో కేజ్రీవాల్ విందు
 నాగపూర్: సదర్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహిస్తున్న విరాళాల సేకరణ విందులో ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొనున్నారు. కేజ్రీవాల్‌ను భేటీ అవ్వాలనుకున్న ఒక్కొక్కరి నుంచి రూ.పది వేలు వసూలు చేయనున్నారు. ఈ విందుగా మంచి స్పందన వస్తోందని, సుమారు 150 నుంచి 200 మంది హాజరయ్యే అవకాశముందని ఈ కార్యక్రమ నిర్వాహకుడు గిరీశ్ నంద్‌గావ్‌కర్, ఆప్ అధికార ప్రతినిథి ప్రజక్త అతుల్ తెలిపారు.

 ఈ విందుకు నాగపూర్ లోక్‌సభ అభ్యర్థి అంజలి దమానియ కూడా వస్తారన్నారు. దాతలు గురించే ఈ విందు నిర్వహిస్తున్నామని, విరాళాలు ఇచ్చిన వారి పేర్లను ఆప్ నాగపూర్ వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు. ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేజ్రీవాల్ నాగపూర్‌కు గురువారం రానున్నారు. చంద్రపూర్, బండారా లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి నాగపూర్‌లో రాత్రి జరిగే విందులో పాల్గొంటారని చెప్పారు. శుక్రవారం రోజు కేజ్రీవాల్ నగరంలో రోడ్‌షో నిర్వహిస్తారని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement